ఆమధ్య బంగ్లాదేశ్ లో అల్లర్ల కారణంగా ప్రధాన మంత్రి దేశం విడిచి పారిపోయింది.
తాజాగా నేపాల్ ఆందోళనల వల్ల ప్రధాన మంత్రి ప్రాణభయంతో రాజీనామా చేశారు.
మన దేశంలో ఇలాంటి పరిస్థితుల్ని ఊహించగలమా? కచ్చితంగా ఊహించలేం. ప్రధాని కాదు కదా, కనీసం ఒక గ్రామ సర్పంచ్ కూడా ఇంత అవమానకరంగా పదవి కోల్పోరు. ఆ గొప్పదనం ఎవరిది? కచ్చితంగా మన రాజ్యాంగానిదేనంటోంది సుప్రీంకోర్టు. తాజాగా భారత రాజ్యాంగ గొప్పదనం గురించి తాజాగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో భారత రాజ్యాంగం, దాని లక్షణాలు మరోసారి చర్చలోకి వచ్చాయి.
సందర్భం ఏంటి?
రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదించే విషయంలో కోర్టులు కాలపరిమితిని విధించవచ్చా అనే అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా సూప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం రాజ్యాంగం గురించి ప్రస్తావించింది. కేంద్రం తరపున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, 1975లో ఇందిరా గాంధీ హయాంలో విధించిన అత్యవసర పరిస్థితిని ప్రస్తావించారు. ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు, ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ఆ తర్వా జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీకి గుణపాఠం నేర్పించారని అన్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం సమర్థంగా పాలన కొనసాగించలేకపోయే సరికి తిరిగి అదే ప్రజలు ఇందిరాగాంధీని గెలిపించారని గుర్తు చేశారు. మధ్యలో చీఫ్ జస్టిస్ గవాయ్ జోక్యం చేసుకుంటూ బంపర్ మెజార్టీతో తిరిగి ఇందిరాగాంధీని గెలిపించారని అన్నారు. అది మన రాజ్యాంగం యొక్క గొప్ప శక్తి అని మెహతా ముగింపు పలికారు.
రాజ్యాంగం గొప్పదనం..
మన రాజ్యాంగం ధృఢ, అధృఢ లక్షణాలను కలిగి ఉంది. అంటే అది అమెరికా రాజ్యాంగం వలే ధృఢమైనది కాదు, బ్రిటన్ రాజ్యాంగం వలే అధృఢమైనది కూడా కాదు. రాజ్యాంగంలో ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించారు. ప్రతి సమస్యకూ పరిష్కారాన్ని చూపించారు. అందుకే మనది ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా అవతరించింది. రాజ్యాంగ రచన సమయంలో కొన్ని విమర్శలు వచ్చినా.. సుదీర్ఘ లిఖిత రాజ్యాంగంవైపే అందరూ మొగ్గు చూపడంతో అది సాధ్యమైంది. అయితే ఆ రాజ్యాంగం సుగుణాలు తర్వాతి తరాల వారికి బాగా తెలిసొచ్చాయి.
భారత రాజ్యాంగానికి పౌరులే మూలం. అధికార వికేంద్రీకరణ, రాజ్యాంగ పదవుల గురించి అందులో వివరంగా ఉంటుంది. రాష్ట్రపతి పేరుమీదుగా పాలన జరిగినా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాధినేతలే నిజమైన పాలకులు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలకు తిరుగుబాట్ల ముప్పు లేకుండా రాజ్యాంగాన్ని తయారు చేశారు. అదే సమయంలో ఇతర దేశాల రాజ్యాంగాల నిర్మాణం అత్యంత నాసిరకంగా జరిగిందని చెప్పడానికి తాజా ఘటనలే ఉదాహరణలు. బంగ్లాదేశ్ లో తిరుగుబాట్లకు ఏకంగా ప్రధాని దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. తాజాగా నేపాల్ లో పౌరుల అలజడికి ఏకంగా ప్రధాని రాజీనామా చేశారు. సైన్యం జోక్యం చేసుకున్నా కూడా అక్కడ పరిస్థితి అదుపులోకి రాకపోవడం విశేషం. ఇలాంటి పరిస్థితుల్లో అసలు మన రాజ్యాంగం ఎంత ఉన్నతమైనదో మరోసారి గుర్తు చేసింది సుప్రీంకోర్టు.