Foot Pain: చాలామంది రోజువారీ జీవితంలో పాదాల నొప్పితో బాధపడుతూ ఉంటారు. పాదాల నొప్పిని తగ్గించుకోవడానికి ఎన్నో సహజసిద్ధమైన మార్గాలు ఉన్నాయి. చికిత్సలతో పాటు ఈ సహజ పద్ధతులను పాటించడం వల్ల పాదాల నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. కింద ఇచ్చిన కొన్ని సహజసిద్ధమైన పద్ధతులను అనుసరించడం వల్ల తక్కువ సమయంలోనే మంచి ఫలితం లభిస్తుంది.
మసాజ్: పాదాల నొప్పిని తగ్గించడంలో మసాజ్ చాలా బాగా పనిచేస్తుంది. ఆవ నూనె, కొబ్బరి నూనె, లేదా ఆలివ్ నూనెతో పాదాలను మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి కండరాల నొప్పి తగ్గుతుంది. ప్రతిరోజూ పడుకునే ముందు పాదాలను మసాజ్ చేయడం మంచిది.
వేడి నీళ్ళలో పాదాలు నానబెట్టడం: వేడి నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి పాదాలను నానబెట్టడం వల్ల పాదాల నొప్పి నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. పాదాలు వాపుగా ఉన్నప్పుడు కూడా ఈ పద్ధతిని వాడవచ్చు. వాపు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నీళ్ళలో కొన్ని ఐస్ ముక్కలను వేసి పాదాలను నానబెట్టండి.
ఐస్ ప్యాక్: పాదాలు వాపుగా ఉన్నప్పుడు లేదా నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఐస్ ప్యాక్ వాడడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. ఒక క్లాత్‌లో ఐస్ ముక్కలను వేసి వాపుగా ఉన్న పాదాలపైన పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచండి.
యాపిల్ సైడర్ వెనిగర్: ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండడం వల్ల పాదాల నొప్పిని తగ్గించడంలో సహాయ పడుతుంది. వేడి నీటిలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ వేసి పాదాలను నానబెట్టడం మంచిది.
అల్లం టీ: అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఒక కప్పు వేడి నీళ్ళలో చిన్న అల్లం ముక్కను వేసి మరిగించి.. ఆ టీని తాగడం వల్ల శరీరంలో ఉండే నొప్పి తగ్గుతుంది.
సరైన పాదరక్షలు వాడడం: పాదరక్షలు కూడా పాదాల నొప్పికి ఒక కారణం కావచ్చు. సరైన పాదరక్షలు వాడడం వల్ల పాదాల నొప్పిని నివారించవచ్చు. ఎక్కువగా నడిచేటప్పుడు లేదా నిలబడేటప్పుడు సౌకర్యవంతమైన చెప్పులు ధరించాలి.
సరైన ఆహారం: సరైన పోషక విలువలు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కండరాలు బలపడి ఎముకల నొప్పి తగ్గుతుంది. క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవాలి.
ఈ పద్ధతులు కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే. ఈ పద్ధతులను అనుసరించినప్పటికీ పాదాల నొప్పి తగ్గకపోతే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. తరచూ పాదాల నొప్పి వస్తుంటే దానికి కారణం ఏంటో తెలుసుకుని దానికి తగ్గ చికిత్స తీసుకోవాలి.
పైన పేర్కొన్న పద్ధతులను పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజసిద్ధంగా పాదాల నొప్పిని తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలను అనుసరించడం వల్ల రోజువారీ జీవితంలో పాదాల నొప్పి లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.