Marital Rape: వైవాహిక అత్యాచారాన్ని (మ్యారిటల్ రేప్) నేరంగా పరిగణించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిని నేరంగా పరిగణించాలా? లేదా? అన్నదానిపై నిర్ణయం కోర్టుల పరిధిలోనిది కాదని పేర్కొంది. ఇది పార్లమెంట్, కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోనిదని స్పష్టం చేసింది. ఈ అంశంపై కోర్టు జోక్యం చేసుకోకూడదని, ఇది పూర్తిగా చట్టసభల నిర్ణయానికి వదిలివేయాలని కేంద్రం తన నివేదికలో పేర్కొంది.
వైవాహిక అత్యాచారాన్ని ప్రత్యేక నేరంగా గుర్తిస్తే, అది వివాహ బంధాలు, కుటుంబ వ్యవస్థపై తీవ్రమైన సామాజిక ప్రభావం చూపుతుందని కేంద్రం పేర్కొంది. భార్యాభర్తల మధ్య పరస్పర సామాజిక, చట్టపరమైన బాధ్యతలు ఉంటాయని, వివాహం వెలుపల జరిగే లైంగిక దాడితో దీనిని సమానంగా చూడలేమని వాదించింది. పెళ్లి అయినంత మాత్రాన మహిళల సమ్మతి కనుమరుగైపోదని, భార్య ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు ఉండాలని కేంద్రం అంగీకరించింది.
Also read: టోకెన్ ఉన్నా లేకపోయినా రూ. 10 లక్షల ఇన్సూరెన్స్.. టీటీడీ సంచలన నిర్ణయం!
అయితే, దీనికోసం ఇప్పటికే ఉన్న గృహ హింస నిరోధక చట్టం, ఇతర శిక్షాస్మృతి నిబంధనలు సరిపోతాయని తెలిపింది. అత్యాచారంగా పరిగణించడం చాలా కఠినమైన నిర్ణయం అవుతుందని తెలిపింది. 2013 లో జస్టిస్ వర్మ కమిటీ నివేదిక, ఇటీవల తెచ్చిన నూతన చట్టం బీఎన్ఎస్ రూపకల్పన సమయంలో కూడా పార్లమెంటు ఈ మినహాయింపును కావాలనే కొనసాగించిందని తెలియచేసింది. ఈ నేపథ్యంలో న్యాయ సమీక్ష ద్వారా కోర్టులు ఇందులో జోక్యం చేసుకోకూడదని పేర్కొంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తోంది.
Also read: సామాన్యుడిపై సెలబ్రిటీస్ ప్రతాపం.. కప్పు కొట్టేస్తాడని భయమా?