Malayalam Mystery Thriller OTT : ఒక రాత్రి జరిగిన చిన్న రోడ్డు ప్రమాదం… రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి, ఊహించని పరిణామాలకు దారితీస్తుంది. కూతురితో కలిసి సినిమా చూసి ఇంటికి తిరిగి వస్తున్న ఓ తల్లి జీవితంలోకి అనుకోకుండా ఓ వ్యక్తి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత జరిగే సంఘటనలు ఆమెను భయాందోళనలకు గురి చేస్తాయి. ఒక చిన్న ఘటన ఎంతమంది జీవితాలను మార్చగలదో చూపించే మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ‘ఆశ’ (Aasha). మరి ఈ సినిమా తెలుగులో ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
ఆశ తన చిన్న కూతురు అనఘతో కలిసి జీవించే మహిళ. గతంలో ఎదురైన కష్టాలు, జీవితంలో ఎదురైన అనుభవాలు ఆమెను మొండిగా, ధైర్యంగా ఉండే వ్యక్తిగా మారుస్తాయి. కూతురితో ఆమెకు కొన్ని విషయాల్లో అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ, ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. ఓ రోజు రాత్రి తల్లీకూతుళ్లు సినిమా చూసి కారులో ఇంటికి తిరిగి వస్తుంటారు. ఆ సమయంలో మరో వాహనంతో జరిగిన రోడ్డు ప్రమాదం వారి జీవితాలను అనూహ్యమైన మలుపు తిప్పుతుంది. ఆ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తే జీమన్.
మొదట ఇదంతా ఏదో చిన్న గోడవలా అన్పించినప్పటికీ, ఈ ఘటన తర్వాత పరిస్థితులు అదుపు తప్పుతాయి. జీమన్ ఈ ఘటనను అక్కడితో వదిలేయకుండా, ఆశ, అనఘల వెంట పడటం మొదలుపెడతాడు. దీంతో తల్లీకూతుళ్లు భయాందోళనలకు గురవుతారు. ఒకవైపు తన కూతురిని కాపాడుకోవాలనే తల్లి ఆరాటం… మరోవైపు తన జీవితంలోకి వచ్చిన ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలనే ఆందోళన. ఈ ఘటనలో ఎవరి తప్పు ఎంత ఉంది ? చిన్న గొడవగా మొదలైన వ్యవహారం ఎందుకు ప్రతీకారం వరకు వెళ్తుంది ? ఒకరి నిర్ణయం మరొకరి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ? అనేదే సినిమాలో చూడాల్సిన కథ. ఒక్క సంఘటనతో మొదలైన గందరగోళం చివరకు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది ఆసక్తిని పెంచుతుంది.
‘ఆశ’ సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల కాగా, అక్టోబర్ 16 నుంచి జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్కు వచ్చింది. ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఆడియో అందుబాటులో ఉంది. ఊర్వశి (Urvashi) ఆశ పాత్రలో నటించగా, ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) అనఘగా కనిపిస్తుంది. జోజు జార్జ్ (Joju George) కీలక పాత్ర పోషించారు. సఫర్ సనల్ (Safar Sanal) దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జోజు జార్జ్, రమేశ్ గిరిజ (Ramesh Girija) కూడా కథా రచనలో భాగమయ్యారు. చిన్న నిర్ణయాలు, అనుకోని సంఘటనలు మనుషుల జీవితాలను ఎలా మార్చగలవనే అంశాన్ని ఈ సినిమాలో ప్రధానంగా చూపించారు. కానీ క్లైమాక్స్ ట్విస్ట్ ను మాత్రం అస్సలు ఊహించలేరు.