Tamil Crime Thriller OTT : ఒకవైపు పోలీసుల వేట… మరోవైపు ప్రాణంగా ప్రేమించిన వాళ్లను కోల్పోయిన బాధ.. ఇంకోవైపు బతకడానికి ప్రతిక్షణం పోరాటం. ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న ఓ గ్యాంగ్‌స్టర్ కథే ‘డీసీ ది బ్లడీ వాలెంటైన్’ (DC The Bloody Valentine). ప్రేమ, ప్రతీకారం, హింస కలగలిసిన ఈ తమిళ చిత్రం థియేటర్లలో మంచి వసూళ్లు సాధించి, ఇప్పుడు ఓటీటీలోనూ ప్రేక్షకులను పలకరిస్తోంది. పైగా ఓటీటీలో ఏకంగా 5 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్లలో మిస్ అయిన వాళ్ళు, మరోసారి ఈ సినిమాను ఇంట్లోనే చూడాలి అనుకునేవారు తెలుగులో ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
దేవదాస్ అలియాస్ దాస్ ఓ గ్యాంగ్‌స్టర్. తన అనుచరులతో కలిసి పోలీసుల దగ్గర నుంచి ఆయుధాలను దొంగిలించే అతడి జీవితం నేరాల చుట్టూనే తిరుగుతుంటుంది. అయితే ఓ మహిళ తన భర్తను ఓ పోలీసు అధికారి చంపేశాడని, తన కుమారుడి చదువు కోసం దాచుకున్న డబ్బును కూడా దోచుకున్నాడని దాస్‌ను ఆశ్రయిస్తుంది. ఆమెకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో దాస్ ఆ పోలీసు అధికారిని చంపేస్తాడు. దీంతో పోలీసుల దృష్టి మొత్తం అతడిపై పడుతుంది.
అరసు నేతృత్వంలోని పోలీసులు దాస్‌ను పట్టుకునేందుకు వేట మొదలుపెడతారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో దాస్ కోయంబత్తూరుకు చేరుకుంటాడు. అక్కడ బార్లో పాటలు పాడే పార్వతితో పరిచయం ఏర్పడుతుంది. కానీ పోలీసుల దాడిలో ఆమె కూడా ప్రాణాలు కోల్పోవడంతో దాస్ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి తప్పించుకున్న దాస్ ఈరోడ్‌కు చేరుకుంటాడు. అక్కడ ఎన్నో ఏళ్లుగా దోపిడీకి, వేధింపులకు గురవుతున్న చంద్ర అనే మహిళను కలుస్తాడు. ఆమె పరిస్థితిని చూసి చలించిపోయిన దాస్… ఆ నరకం నుంచి బయటపడేందుకు సహాయం చేస్తాడు.
చంద్ర కూడా అతడితో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకుంటుంది. అయితే గతం నుంచి వెంటాడుతున్న ప్రమాదాలు వారిని అంత సులభంగా వదలవు. పోలీసుల నుంచి తప్పించుకుంటూ, తమకంటూ ఓ ప్రశాంతమైన జీవితాన్ని వెతుక్కునే ప్రయత్నంలో ఇద్దరూ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు ? వారి ప్రయాణం ఎక్కడికి చేరింది ? చివరికి ఈ ఊచకోత ఎక్కడికి దారి తీసింది ? అనేదే సినిమా మిగతా కథ.
‘డీసీ’ అక్టోబర్ 16 నుంచి సోనీలివ్ (SonyLIV)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. అంతకుముందు సెప్టెంబర్ 4 నుంచి సన్ నెక్స్ట్ (Sun NXT)లోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 106 కోట్లకు పైగా వసూలు చేసింది. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ (Arun Matheswaran) ఈ కథను ప్రేమకథగానే కాకుండా, హింసాత్మక ప్రపంచంలో చిక్కుకున్న మనుషుల జీవితాల కోణంలోనూ చూపించారు. లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj), వామికా గబ్బి (Wamiqa Gabbi), సంజన కృష్ణమూర్తి (Sanjana Krishnamoorthy) కీలక పాత్రల్లో నటించారు. ప్రేమతో పాటు నేరాలు, ప్రతీకారం, భావోద్వేగాలు కలగలిసిన కథలను ఇష్టపడే వారికి ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది.