Korean Horror Series: కొరియన్ హారర్ సినిమాలకు మరియు సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా విశేషమైన క్రేజ్ ఉంది. వారు ఎంచుకునే విభిన్నమైన కథనాలు, హార్ట్ టచింగ్ చేసే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటి ఒక సూపర్ హిట్ హారర్ అండ్ మిస్టరీ కొరియన్ సిరీస్ ‘గోస్ట్ మేన్షన్’ (Ghost Mansion – Korean Series). దెయ్యం సినిమాలు అంటే సాధారణంగా ఓ ఇంట్లోకి వెళ్లిన వాళ్లను ఆత్మలు వెంటాడటం, భయపెట్టడం చూస్తుంటాం. కానీ ఈ సిరీస్ లో మాత్రం ఒక పాత అపార్ట్‌మెంట్‌నే భయానికి కేంద్రంగా మార్చారు. అక్కడ ఒక్కో గదిలో ఒక్కో విషాదకరమైన కథ దాగి ఉంటుంది. ఆ కథలన్నింటినీ ఓ రచయితకు కేర్‌టేకర్ చెబుతాడు. కానీ చివరి ట్విస్ట్ మామూలుగా ఉండదు. మరి ఇంతకీ ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం పదండి.
జి-వూ ఓ హారర్ వెబ్‌టూన్ రచయిత. తన కొత్త కథ కోసం భయంకరమైన అనుభవాలను వెతుకుతూ సియోల్ శివార్లలోని గ్వాంగ్లిమ్ మాన్షన్ అనే పాత అపార్ట్‌మెంట్‌కి వెళ్తాడు. అక్కడ అతనికి ఓ మిస్టీరియస్ కేర్‌టేకర్ పరిచయమవుతాడు. ఆ అపార్ట్‌మెంట్‌లో గతంలో జరిగిన వింత సంఘటనలను అతను జి-వూకు ఒక్కొక్కటిగా చెబుతాడు.
మొదటి కథ రూమ్ 504లో జరుగుతుంది. ప్రశాంతంగా నవల రాసుకోవడానికి వచ్చిన ఓ రచయితకు మూసివేసిన అనాథాశ్రమం నుంచి పిల్లల నవ్వులు, ఏడుపులు వినిపిస్తుంటాయి. ఆ శబ్దాలు క్రమంగా అతని మానసిక పరిస్థితినే దెబ్బతీస్తాయి. రూమ్ 907 కథలో ఓ ఫార్మసిస్ట్ వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఆమె భర్త హత్యకు గురైన తర్వాత… ఆ మహిళలో వచ్చిన వింత మార్పులు అతని జీవితాన్ని నరకంగా మారుస్తాయి.
ఇక రూమ్ 708లో ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ తన కుటుంబాన్ని వదిలేసి ఓ సింథటిక్ డాల్‌తో జీవిస్తుంటాడు. కానీ ఆ బొమ్మ వెనుక దాగి ఉన్న రహస్యం బయటపడటంతో అతని పరిస్థితి దారుణంగా మారుతుంది. రూమ్ 604లో విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడు స్నేహితుడి ఇంట్లో ఉంటాడు. అక్కడి బూజు, ఇంట్లోని వ్యక్తుల వింత ప్రవర్తన అతడిని భయంకరమైన పరిస్థితుల్లోకి నెడతాయి.
చివరగా రూమ్ 1504లో దొంగతనం చేయడానికి వెళ్లిన వ్యక్తి కథను కేర్‌టేకర్ చెబుతాడు. ఇవన్నీ విన్న జి-వూకి తనకు దొరికిన కీతో ఆ గదిలోకి వెళ్లాలనే ఆసక్తి పెరుగుతుంది. అక్కడే అసలు ట్విస్ట్ బయట పడుతుంది. ఈ అపార్ట్‌మెంట్ ఒకప్పుడు ఓ రహస్య మతపరమైన ఆచారాలకు కేంద్రంగా ఉండేదని తెలుస్తుంది. అక్కడి ఆత్మలు కేర్‌టేకర్ రూపాన్ని ఉపయోగించి కొత్త వ్యక్తులను తమ ఉచ్చులోకి లాగుతుంటాయి. మరి చివరికి జి-వూ పరిస్థితి ఏమైంది ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి ? అసలు ఆ అపార్ట్‌మెంట్ అంతలా శపించబడటానికి గల కారణం ఏంటి? అక్కడి కేర్‌టేకర్ నిజంగానే మనిషా లేక దెయ్యమా ? మరి ఆ భయంకరమైన గోస్ట్ మేన్షన్ నుండి ఆ వెబ్ టూన్ రచయిత ప్రాణాలతో బయటపడగలిగాడా? ఆ భవంతిలోని దెయ్యాల వెనుక ఉన్న అసలు రహస్య ఏమిటి అనేది ఈ హారర్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కొరియన్ మిస్టరీ హారర్ సిరీస్ ‘గోస్ట్ మేన్షన్’లో సుంగ్ జూన్, కిమ్ బో-రా, కిమ్ హాంగ్-పా తమ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. హారర్ చిత్రాల స్పెషలిస్ట్ దర్శకుడు జో బార్న్-కూ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. కే-డ్రామాలకు ఇండియాలో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సిరీస్ సబ్‌టైటిల్స్‌తో పాటు తెలుగు డబ్బింగ్ ఆడియోలోనూ ప్రసారం అవుతోంది.
Read Also: మహిళల ఇళ్లకు వచ్చే విచిత్రమైన బాక్సులు… కట్ చేస్తే వరుస హత్యలు… ప్రతి కేసు వెనుక ఒకే మైండ్