Science fiction Mystery Movie: ఒక మనిషి 100 ఏళ్లు బతికితేనే మనకు అదో అబ్బురం. అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి ? ఎలా అంతకాలం ఆరోగ్యంగా బతికారు అన్న క్యూరియాసిటీ పెరుగుతుంది. ఎందుకంటే ఈ తరం మనుషులు ఆరోగ్యంగా 60 ఏళ్లు బతికితేనే అదో గొప్ప వరం అని చెప్పాలి. అలాంటిది ఏకంగా 14,000 ఏళ్లు ఓ వ్యక్తి బతికితే… ఎలా ఉంటుందో తెలియాలంటే ‘ది మ్యాన్ ఫ్రమ్ ఎర్త్’ (The Man from Earth 2007) అనే ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాను చూడాల్సిందే. ఇంతకీ ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉందా ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
ఇందులో మన హీరో పేరు జాన్ ఓల్డ్‌మన్. అతను ప్రముఖ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్. ఓరోజు అకస్మాత్తుగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆ ఊరిని వదిలి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతాడు. అతనిని సాగనంపడానికి మరికొందరు ప్రొఫెసర్లు అతని ఇంటికి వస్తారు. అలా వచ్చిన వాళ్ళలో ఆంత్రోపాలజిస్ట్, బయోలాజిస్ట్, సైకియాట్రిస్ట్, హిస్టోరియన్ వంటి వివిధ రంగాల నిపుణులు ఉంటారు. మొదట కొంతసేపు అందరూ నార్మల్ గానే మాట్లాడుకుంటారు. కానీ హీరో అసలు ఎందుకు అక్కడి నుంచి వెళ్లిపోవాలని అకస్మాత్తుగా ఆ నిర్ణయం తీసుకున్నాడో ఎవ్వరికీ అర్థం కాదు. అదే ప్రశ్నను అడుగుతారు.
ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. జాన్ ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేసి, ఆ తర్వాత అసలు నిజాన్ని బయట పెడతాడు. తాను సుమారు 14,000 సంవత్సరాల క్రితం జన్మించిన రాతియుగం నాటి మానవుడిని అని చెప్పేస్తాడు. తనకు అప్పటి నుండి ఇప్పటివరకు అస్సలు వృద్ధాప్యం రాలేదని చెబుతాడు. ఒకే చోట 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే తనికెలాంటి వృద్ధాప్యం రావడం లేదనే విషయాన్ని చుట్టుపక్కల వారు గమనించి ప్రమాదంలో పడేస్తారని, అందుకే ప్రతి పదేళ్లకు ఒకసారి తన పేరును, ఊరిని మారుస్తూ బతుకుతున్నానని చెబుతాడు.
మొదట అతని స్నేహితులు ఇదంతా ఒక జోక్ అనుకుంటారు. అంతేకాదు అతను ఏదో సైన్స్ ఫిక్షన్ నవల రాయడానికి కథ చెప్తున్నాడని అనుకుంటారు. కానీ హిస్టరీ, బయాలజీ పరంగా వారు అడిగే ప్రతి కఠినమైన ప్రశ్నకు జాన్ చాలా లాజికల్‌గా, వివరంగా సమాధానాలు ఇస్తాడు. తాను చారిత్రక పురుషులైన బుద్ధుడు, జీసస్ వంటి వారిని ఎలా కలిశాడో, ప్రపంచ చరిత్ర ఎలా మారిందో తన అనుభవాల ద్వారా వివరిస్తాడు. అంతే చర్చ తీవ్రమయ్యాక, అక్కడున్న ఒక సైకియాట్రిస్ట్ జాన్ మానసిక స్థితి సరిగ్గా లేదని భయపడతాడు. ఆ తరువాత మైండ్ బ్లాంక్ ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ ఏంటి ? హీరో చెప్పింది నిజమేనా ? చివరికి ఏమైంది ? ఆనంది తెలియాలంటే ఈ సినిమాను డోంట్ మిస్.
హాలీవుడ్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ సినిమాలలో క్లాసిక్ మూవీ ‘ది మ్యాన్ ఫ్రమ్ ఎర్త్’. రిచర్డ్ షెంక్‌మన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జెరోమ్ బిక్స్బీ రాసిన కథ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో యాక్షన్, స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కానీ డైలాగ్స్ ద్వారానే ప్రేక్షకులను స్క్రీన్ ను అతుక్కుపోయేలా చేశారు మేకర్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా తెలుగు డబ్బింగ్ లేదు. కానీ ఇంగ్లీష్ లో YouTubeలో చూడవచ్చు. అది కూడా ఫ్రీగానే. సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఇష్టపడే వారు ఒక్కసారి ఈ మూవీని చూస్తే జన్మలో మర్చిపోలేరు.
Read Also: బతికుండగానే చనిపోయిందని షాక్… డిజిటల్ ట్రాన్సాక్షన్ లో దిమ్మతిరిగే ట్విస్ట్