బండి సంజయ్‌ను టార్గెట్ చేయడమే లక్ష్యం.. రాజకీయ మైలేజే ప్రధానం.. దీని కోసం బీఆరెస్, ఆ పార్టీ సోషల్ మీడియాలో ఎన్ని చేయాలో అన్ని చేసింది. దిగజారి ప్రవర్తించింది. మోడీ సభనూ పట్టించుకోలేదు. ఆ సభలో మోడీ ఏం చెప్పాడో వినలేదు. తెలంగాణ కోసం మోడీ చెప్పిన మాటలేమిటీ? ఆయన ప్రసంగంలో ఆంతర్యమేమిటీ? ఏమీ పట్టినట్టు లేదు. ఒకటే యావ.. ఒకటే లొల్లి. బండి భగీరథ్.. బండి సంజయ్! మొత్తం టీమ్ అంతా దీనిపై పడిపోయారు. సరే, బండి భగీరథ్ కేసు అంశం.. కేటీఆర్‌కు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే అయ్యింది. ఇది వాస్తవం.
అంతకు ముందే ఇద్దరి మధ్య వార్ పతాక స్థాయికి పోవడం.. పాడె కౌశిక్ కారు ధ్వంసం.. బండి సంజయ్ .. కేటీఆర్‌పై మాట్లాడిన పరుష పదాలు.. ఇవన్నీ కోపాన్ని తెప్పించి ఉంటాయి. రాజకీయంగా కక్షసాధించేందుకు ప్రత్యర్థి వర్గంగా సమయం కోసం ఎదురుచూడటం కామన్. ఆ సమయం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు కేటీఆర్. కానీ మరీ అంత చిల్లరగా, దిగజారి, గాయిగత్తర చేయాల్సిన అవసరం లేదు. టీఆరెస్ చీఫ్ కవిత ఇవాళ ప్రెస్‌మీట్ పెట్టి ఈ ఉదంతం మాట్లాడిన తరువాత గానీ చాలా మందికి తెలియరాలేదు. ఇలాంటి సున్నితమైన అంశంపై ఏ మేర స్పందించాలి? ఎలా స్పందించాలి? ఏం డిమాండ్ చేయాలి..? ఎంత వరకు ప్రతిపక్షాలు హద్దుల్లో ఉండాలి?? ఈ పాఠాలన్నీ నేర్పారు అన్నకు చెల్లె. ఆమె చూసిన కోణం బహుశా కేటీఆర్‌కు, ఆ పార్టీకి కనీసం మదిలోకి అణువంత కూడా వచ్చి ఉండదు.
కవిత ఓ మైనర్ బాలిక కోణంలో ఈ కేసును చూశారు. బండి భగీరథ్ పేరును కూడా ఆమె ప్రస్తావించలేదు. బాలిక ఫోటోలను సోషల్ మీడియాలో విచ్చలవిడిగా విడుదల చేసి పైశాచికానందం.. శునకానందం పొందిన బీఆరెస్‌ను ఆమె ఏకిపారేశారు. ఇదేం బుద్ది.. ఇదేం తీరు.. ఇదేం రాజకీయం..?? ఇక్కడో విషయం గమనించాలె…! ఇంటి ఆడబిడ్డనే మెడబట్టుకు బయటకు గెంటేసిన .. ఆ పార్టీ.. తండ్రీ, కొడుకులకు..కనీసం ఈ కేసులో సున్నితత్వం తెలుసా? రాజకీయ ప్రతిదాడి చేయాలంటే సబ్జెక్టు మీద బోలెడు మాట్లాడొచ్చు.. వ్యక్తిత్వ హననం చేయడం కేటీఆర్‌కే చెల్లిందనే విమర్శలు వచ్చాయి. బండి సంజయ్.. మోడీ సభకు హాజరు అయి ఉండాల్సింది కాదని కవిత హుందాగా స్పందించారు.
పోలీసులు ముందుగా లుక్ ఔట్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదో చట్టపరంగా ప్రశ్నించారు. ఇక్కడ రాజకీయ కోణం లేదు. దురుద్దేశం.. కక్షసాధింపుకు తావులేదు. మరి ఇలా కదా మెలగాల్సింది. దిగజారుడు రాజకీయాలకు ఇప్పుడు బీఆరెస్, ఆ పార్టీ సోషల్ మీడియా కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. అమ్మాయి కుటుంబ సభ్యుల వీడియోలు కూడా విడుదల చేయడం.. ఆమె సన్నిహితంగా దోస్తులతో కలిసి ఉన్న ఫోటోలను కూడా మీడియాలో పెట్టడంపై కవిత సీరియస్ అయ్యారు. ఆ అకౌంట్లను బ్లాక్ చేయాలని, వారిని అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేశారు.
ఇదీ అసలైన స్పందన. దిమాఖ్‌లో ఒకటే నింపుకుని.. గుర్రం కళ్లకు గంతలు కట్టినట్టు.. ఒకటే దారి.. అదే పంథాలో పోయి.. తమకు రాజకీయ మైలేజీ వస్తుందని, బండి సంజయ్‌ను ఇరకాటంలో పెట్టామని చంకలు గుద్దుకుంటున్న కేటీఆర్‌కు ..కవిత ప్రెస్‌మీట్ ఓ చెంపపెట్టులాంటిది. మేమిలాగే ఉంటాం.. మహిళల పట్ల ఇలాగే స్పందిస్తాం.. చెల్లెనే బయటకు తరిమేసినోళ్లం.. ఆ మైనర్ బాలిక, ఆ కుటుంబం మాకోలెక్కా..? అంటే..! అదీ చూస్తున్నారు జనం. ఇంకా చూస్తారు కూడా.