కీలకమైన డీలిమిటేషన్‌పై కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సమయంలో బీఆరెస్ స్టాండ్ ఏమిటీ? అనే చర్చ సాగుతోంది. అంతకు ముందు ఈ బిల్లు పెట్టిన సందర్భంలో దీన్ని బీఆర్ఎస్ వ్యతిరేకించింది. దక్షిణాది రాష్ట్రాల ఎంపీ కోటా తగ్గితే ఒప్పుకునేదే లేదనే వాదనే తీసుకొచ్చారు కేటీఆర్. కానీ ఇప్పుడు స్టాండ్ మారింది. కేంద్ర ప్రభుత్వం బిల్లులో అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెంచుతామనే ప్రతిపాదనను సాకుగా చూపి.. మనకొచ్చే నష్టం ఏమీ లేదనే విధంగా ఎన్డీయేకే సై అంటోంది బీఆర్ఎస్.
కేసీఆర్ ఈ విషయంలో క్లారిటీ ఆదేశాలు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. లోక్ సభలో బీఆరెస్‌కు ఒక్క సీటు కూడా లేకున్నా.. రాజ్యసభలో ముగ్గురు సభ్యులున్నారు. రాజ్యసభలో కూడా కేంద్రానికి బిల్లు ఆమోదానికి బీఆర్ఎస్ కీలకం కానుంది. అంతకు మించి .. కేసీఆర్ స్టాండ్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి కూడా కొనసాగుతోంది. కాంగ్రెస్ ఓవైపు .. బీఆరెస్‌ఎస్, బీజేపీకి మధ్య లోపాయికారి సంబంధాలున్నాయని, ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయనే విధంగా ప్రచారం చేస్తున్నది.
కేటీఆర్, కేసీఆర్‌లను పలు కేసుల నుంచి కాపాడుడున్నది కూడా కేంద్రమేననే విధంగా కామెంట్ చేస్తున్నది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో ఇండీ కూటమికి వ్యతిరేకంగా.. ఎన్డీయేకు మద్దతు తెలపనున్నది బీఆరెస్. దీనిపై కీలక సమయంలో వ్యతిరేకిస్తే.. అవసరంగా మోడీతో వైరమెందుకు? అనే దోరణి కూడా బీఆరెస్‌లో కనిపిస్తుందంటున్నారు. ఈ పరిణామాలను కాంగ్రెస్ తన వ్యూహంలో భాగంగా వాడుకోనుందా?
బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల ఎంపీల సంఖ్యను గణనీయంగా పెంచుకుని, తామే పరిపాలించే ఎత్తుగడలో భాగంగానే ఈ డీలిమిటేషన్‌ను చేపడుతుందనే విమర్శలను బీఆరెస్ పట్టించుకోవడం లేదనే తేలిపోనుంది. దక్షిణాది రాష్ట్రాల ప్రభావం మరింత తగ్గడాన్ని మనమే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నామా? అనే ప్రశ్నలు జనాల్లో తలెత్తుతున్న తరుణంలో.. బీఆరెస్‌ను ఈ విషయంలో దోషిగా నిలపాలనే వ్యూహాన్ని కూడా కాంగ్రెస్ భవిష్యత్తులో అమలు చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
అయితే, ఈ పరిణామాల నేపథ్యంలోనే.. గత కొద్ది రోజులుగా కేసీఆర్ కొత్త రాగం అందుకుంటున్నారు. ఇంతకు ముందు థర్డ్ ఫ్రంట్ అని రాష్ట్రాలు పట్టుకు తిరిగిన కేసీఆర్.. ఇప్పుడు కేంద్రంలో సంకీర్ణమే రావొచ్చనే విధంగా తన మానస పుత్రిక నమస్తే తెలంగాణ ద్వారా నిత్యం బ్యానర్ వార్తలు గుప్పిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ను ఎన్నుకోవడం ద్వారా కేంద్రంలో మనం చక్రం తిప్పొచ్చని,ఇలా అయితేనే తెలంగాణ ఆకాంక్షలను సాధించగలుగుతామని, నిధులు, అభివృద్ది సాధించగలుగుతామని చెబుతూ వస్తున్నారు.
గతంలో తమిళనాడు, తాజాగా ఏపీలోని రాజకీయ పరిణామాలను తెలంగాణ జనానికి గుర్తు చేస్తున్నారు. ఎన్డీయే సర్కార్‌లో కీలకంగా మారిన ఏపీ..తన రాష్ట్రానికి కావాల్సినవన్నీకేంద్రంతో సయోధ్య ద్వారా ఏ విధంగా సాధిస్తున్నదో పరోక్షంగా వెల్లడించే ప్రయత్నం చేస్తున్నది బీఆరెస్. థర్ట్ ఫ్రంట్ అనే మాట బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
రేపు డీలిమిటేషన్ ప్రకారం పెరిగిన లోక్‌సభ సీట్లలో కూడా ఇటు ఇండీ కూటమికి, అటు ఎన్డీయేకు సరైన సంఖ్యా బలం లేకపోతే.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే తమ లాంటి ప్రాంతీయ పార్టీలే కీలకం కాబోతాయని కేసీఆర్ భావిస్తున్నట్టున్నారు. ఏపీ దీనికి తాజా ఉదాహరణగా నిలవడంతో.. తెలంగాణలో ఎందుకు అదే స్టాండ్ అమలు చేయొద్దనే దోరణిలో వ్యూహాత్మకంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
దేశ్ కీ నేత.. కావాలనే ఆశలను మొగ్గలోనే తుంచేసి ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేసిన చేదు అనుభవాలు కళ్లముందు కదలాడుతుండగా.. మళ్లీ వాతలు పెట్టుకోకుండా.. మధ్యే మార్గంగా సంకీర్ణమనే కొత్త రాగాన్ని కేసీఆర్ అందుకున్నట్టు తెలుస్తోంది. బీఆరెస్ ఎంపీ సీట్లను మెజారిటీగా గెలుచుకోవడం, కేంద్రంలో సంకీర్ణం ఏర్పడితే కీలకంగా మారాలనుకోవడం.. కేసీఆర్ కొత్త ఎత్తుగడగా తెలుస్తోంది.
అందుకే ఇప్పుడు డీలిమిటేషన్‌పై బేషరతుగా మద్దతు తెలిపేందుకు రెడీ అయిపోయారని తెలుస్తోంది. దేశ్ కీ నేత, థర్డ్ ఫ్రంట్.. మాటలు రాకుండా చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారట కేసీఆర్.