యావత్ దేశం ఆసక్తిగా గమనించింది తమిళ రాజకీయాలను. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మరిపించిందీ రాజకీయం. సీఎం కాకముందే ఎన్నో డక్కాముక్కీలను రుచి చూశాడు విజయ్. రాజకీయాలపై అప్పటి వరకు కనీస అవగాహనైతే ఉండి ఉంటుంది.. కానీ ప్రాక్టికల్‌గా దిగే సరికి .. సినిమాలో చూపిన రాజకీయాలకంటే దారుణమని తెలుసుకున్నట్టున్నాడు విజయ్. కానీ నిన్నటి వరకు విజయ్ రీల్ హీరోనే. ఇప్పుడు అక్కడ జరిగిన రాజకీయ పరిణామాలను తన పరిణతితో సైలెంట్‌గా ఎదుర్కొన్న తీరు.. అతన్ని రియల్ హీరోగా జనాలు కీర్తించేలా చేశాయి. కాలం వచ్చినప్పుడు, సమస్య ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే.. పరీక్ష ఎదుర్కొనే తీరులోనే ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుందంటారు. అలా ఈ జఠిలమైన సమస్య తనకు ఆదిలోనే రావడం మంచిదైందనే చెప్పాలి.
ఎవరి మనస్తత్వం ఏమిటో తేలిపోయింది. ఏం చేయాలో కర్తవ్యం బోధపడ్డది. అప్పటి వరకు తనను తక్కువ చేసి చూసిన వారికి, తనను అవమానించేలా మాట్లాడిన వారికి అతడి ప్రవర్తన, వ్యవహార శైలే సమాధానమిచ్చింది. మాటలు లేవు… ఆవేశపూరిత స్పందనా లేదు. కేవలం సమాలోచనలు మాత్రమే. తక్షణ కర్తవ్యంపైనే సీరియస్ దృష్టి. అంతే. అవతలి పక్షం ఎత్తులను చిత్తుచేయడంలో ప్రదర్శించిన రాజనీతిజ్ఞత అనుభవశీలురను సైతం అవాక్కయ్యేల చేసింది. ఎంతో అనుభవం కలిగిన రాజకీయ వేత్తగానే నడుచుకున్న తీరు ఆకట్టుకున్నది. ప్రకాశ్‌రాజ్‌తో సహా.. కమలహాసన్, శ్రియా.. సినీ స్టార్లంతా విజయ్‌కు సపోర్టుగా నిలిచారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల ఎంతటి కమిట్‌మెంట్‌తో ఉన్నారో.. పరిస్తితులు ఎదురైనప్పుడు ఇలా వారు స్పందిన తీరు మెచ్చుకోదగిందే.
ఇక స్టాలిన్ సైతం తను పరిణతి చెందిన రాజకీయ వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. అన్నాడీఎంకేతో అనైతిక పొత్తుకు ససేమిరా అన్నాడు. ఎక్కడా టెంప్ట్ కాలేదు. అధకార యావతో పాకులాడలేదు. మాట తీరులో, నడవడికలో నిండుతనమే కనిపించింది. వేలెత్తి చూపలేని వ్యక్తిత్వ ప్రదర్శనకు పార్టీలకతీతంగా మెచ్చుకున్నారు. ఒక్క రాహుల్ గాంధీ విషయంలో తప్ప. మిత్రధర్మం పాటించలేదనే ఆవేశం ఆయన్ను నిలకడగా ఉండనీయలేదు. ఇక ఇండి కూటమిలో ఉండబోమనే తీర్మానం దాకా రావడం.. ఆయనను బాగా ఇబ్బంది పెట్టిన అంశంగానే చూడాలి.
అయితే మాత్రం..శత్రువుకు శత్రువు.. మిత్రుడు అనే లాజిక్‌ను కూడా స్టాలిన్ పాటించలేదు. స్నేహహస్తం అందించాలని చూసిన బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. ఇప్పుడు రాహుల్ మీద కోపంలో కూడా .. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ లేని కూటమిని ఏర్పాటు చేస్తాననే ప్రకటించాడు స్టాలిన్.ఓటమి తరువాత జనం వద్దకు చేరడం.. హుందాగా ఇచ్చిన సందేశం.. రాజకీయ సంక్షోభ సృష్టించే సమయంలో ప్రజాస్వామ్యం వైపే నిలవడం.. అనైతిక రాజకీయాలకు తలొగ్గకపోవడం.. స్టాలిన్‌లోని వ్యక్తిత్వాన్ని పట్టించాయి. ఇక విలన్‌గా బీజేపీ మిగిలిపోయింది. కొండకు వెంట్రక వేసి లాగితే.. వస్తే కొండ వస్తుందనే దురాశ.. పోతే వెంట్రుకేగా పోయేది అనే చీప్ టెక్నిక్. కానీ ఆ నైతికత విషయంలో దేశంలో జరుగుతున్న చర్చను మాత్రం అది వినే, చూసే పరిస్థితిలో లేదు.