ఇవి రెండూ వేర్వేరు వార్తలు కాదు. ఒకటే వార్త. టైటిల్స్ వేర్వేరుగా ఉన్నా.. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి బీఆరెస్, బీజేపీలో గందరగోళ పరిస్థితులకు నప్పుతుంది. కేసీఆర్ వ్యూహమేందీ? కేటీఆర్ గండి కొట్టడమేందీ? మొదట దీని గురించి చర్చించుకుందాం. కేసీఆర్ అక్కడ ఫామ్‌హౌజ్‌లో కూర్చుని తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాడు. ఎలాగైనా కేటీఆర్‌ను సీఎం చేయాలె.. వచ్చేసారి అధికారంలోకి రావాలె.. ఇదే ఆయన జీవిత లక్ష్యం. అంతకు మించి మరేం లేదు. కవిత రూపంలో, మరోవైపు రేవంత్ రూపంలో ఆయన ఆశలు సన్నగిల్లుతూ వస్తున్న నేపథ్యంలో..ఇక బీజేపీతో పొత్తు తప్పదనే పరిస్థితి ఉంది.
చల్లకు వచ్చి ముంత దాచినట్టు ఇంకా ఎన్ని రోజులు..? జనాలు కూడా నమ్మడం లేదు. పక్కన ఏపీలో చంద్రబాబు.. డేర్ స్టెప్ వేశాడు. గెలిచాడు. కేంద్రం సపోర్టుతో అమరావతిని అద్బుతంగా తీర్చిదిద్దే పనిలో తలమునకలై ఉన్నాడు. మరింక ఆలోచన ఎందుకు? మైనార్టీలు దూరమైతారనా? ఏం ఇప్పుడు మాత్రం కేసీఆర్‌కు ఏమన్నా గంపగుత్తగా ఓట్లేస్తరా? అవకాశం లేదు. అదీ తెలుసు కేసీఆర్‌కు. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకునేందుక ముహూర్తమే లేటు. కానీ ఆలోపు ఇలా కేటీఆర్ తన వ్యూహాలకు గండికొట్టే పనిని చేస్తూ… ఆయనకు ఫామ్‌హౌజ్‌లో కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు. బండి సంజయ్ తాకిడిని తట్టుకోలేకే.. అప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించగలిగాడు కేసీఆర్.
అవును.. అప్పుడు మోడీ, కేసీఆర్ మధ్య టర్మ్స్ అంత మంచిగుండె మరి. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి మారింది. బీఆరెస్ దుస్థితి తెలిసింది. దీంతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. కానీ వారికీ తెలుసు. ఇక్కడ కాంగ్రెస్‌ను రానీయొద్దంటే.. కేసీఆర్ సపోర్టు కావాల్సిందే. అందుకే తప్పదు. పొత్తు పొడవాల్సిందే. కానీ ఈ మధ్యలో రామాయణంలో పిడకల వేటలా వీరిద్దరి పంచాయతీ ఇద్దరికీ.. అదే రెండు పార్టీలకూ తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇంతలా తిట్టుకుని మళ్లీ కలవడం జనాలు ఏమనుకోవాలె? ఇప్పటికే బీఆరెస్ అన్నా.. కేసీఆర్, కేటీఆర్ అన్నా అరవింద్, రఘునందన్ రావు, ఈటల, బండి.. ఒంటికాలిపై లేస్తారు. ఒక్క కిషన్ రెడ్డి తప్ప. సరే, అధిష్టానం నిర్ణయం తీసుకుంటే తప్పదు. తలొగ్గుతారు. బలవంతంగానైనా.
మరి ఈలోపు ఇంతలా గ్యాప్ పెంచుకోవాలా? ఇన్నేసి తిట్లు తిట్టుకోవాలా? కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందన్నట్టు.. నువ్వు తిట్ట… నేను తిట్ట.. లోపాలు, పాపాలన్నీ బయటపడ.. ఇగ జనం ముందు ఇద్దరూ దోషులుగా నిలబడతారే తప్ప.. ఏమైనా లాభం ఉందా? ఇద్దరి పనులు ఏమైనా పనికొచ్చేటివా? పిల్లకాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ.. అన్నట్టు.. నా బాధలు వీడికేం తెలుసు.. అని పాపం పెద్దాయన తెగ ఇదిగా బాధపడిపోతున్నాడట. నేనొకటినుకుంటే.. వీడొకటి పెంట పెంట చేసి పెడతాడని తిట్టిపోస్తున్నాడట. ఇక్కడ బండి సంజయ్ చేష్టలకు కూడా కిషన్‌రెడ్డి కస్సుబుస్సు మంటుండట.
మేము డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం అగచాట్లు పడుతుంటే.. నువ్వేమో…. గల్లీ ఫైట్ చేసుకుంట.. గలీజ్ గలీజ్ చేస్తున్నవని అక్షింతలేస్తున్నడట. పనిలో పని ఢిల్లీ పెద్దలతో కూడా మొరపెట్టుకుంటున్నాడట. ఇగ ఇట్ల చేస్తే నేనేం చేసేది? జర మీరన్నా చెప్పాలె! అని వేడుకుంటున్నాడట. సరే.. సర్లే.. ఇంకా చాలా సమయమే ఉంది కదా! జనం ఇవన్నీ యాది పెట్టుకుంటర.. అన్నీ మరిచిపోతరు తియ్..! నేనున్న కదా! ఆడ కుర్చీ ఏసుకుని కుసుండి సెట్ చేస్త అన్నీ! అని మోటుభాయ్ లైట్ తీసుకుంటుండంట. ఇవి తెలంగాణలో ఆ రెండు పార్టీల పొత్తు, చిత్తు, ఎత్తు, మత్తు ముచ్చట్లు..!