Chennai LoveStory Review : కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ తీస్కొచ్చిండు. మొన్న ‘బేబీ’తో థియేటర్లల్ల మనల్ని ఎక్కి ఎక్కి ఏడిపించిన సాయి రాజేష్ అన్న, ఇప్పుడు రవి నంబూరిని డైరెక్టర్‌గా పెట్టి గీ కత వండిండు. మరి ఈ కత మనకు ఎక్కిందా? కిరణ్ అన్న హిట్టు కొట్టిండా? లాజిక్కులు ఉన్నాయా లేదా మొత్తం మ్యాజిక్కేనా? సెగలు రేపే మన రివ్యూల సూసేద్దాం రాన్రి!
మన హీరోయిన్ నివి (గౌరీ ప్రియ).. పాపం పచ్చల పందిరి, పెళ్లి పీటల దాకా వచ్చాక మన త్రిగుణ్ గాడు ‘నేను చేసుకోనంతే.. నాకు మూడ్ లేదు’ అని హ్యాండ్ ఇస్తాడు. ఇగ పిల్లకు బ్రేకప్ అయితే ఏమైతది? సీదా వైన్ షాప్ కాడికి ఉరుకుతది, మందు గ్లాస్ పట్టుకుంటది. అట్ల ఫుల్లుగా తాగి, ఫుల్లుగా బాధల మునిగిపోయిన పిల్లకి, చెన్నై బీచ్‌ల మన స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) తగులుతాడు.
ఆడు ఎవరంటే.. రాజమౌళి రేంజుల డైరెక్టర్ కావాలని పిచ్చోడిలా కలలు కనేటోడు. ఫస్ట్ వీళ్ళ మధ్య ఇసకల కిరికిరి, ఆ తర్వాత నెమ్మదిగా లవ్. సరే ఇగ అంతా సెట్ అయింది కదా, తాళి కట్టేసుకుందాం రా అని ఫిక్స్ అయితారు. అసలు ఈ స్టీవెన్ శంకర్ మెగాఫోన్ పట్టిండా? వీళ్ళ పెళ్లికి ఎవర్రా బ్రేకులు ఏసింది? గిదే అసలు కత! మిగతాది తెల్వాలంటే మీ జేబులల్ల పైసలు పెట్టి బిగ్ స్క్రీన్ దిక్కు చూడాల్సిందే. డైరెక్టర్ సాబ్ గిర్రున తిప్పిండు..
సాయి రాజేష్ కత, మన మణిశర్మ మామ మ్యూజిక్ అనంగనే జనాలు ఎగిరెగిరి థియేటర్లకి ఉరికిన్రు. ఫస్ట్ హాఫ్ మాత్రం మన పల్లెవెలుగు బస్సు లెక్క కాకుండా, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లెక్క సుయ్ మని కతలోకి ఎల్లిపోయిండు డైరెక్టర్. బ్రేకప్, మందు, లవ్.. భలే మంచిగనే నడిచిందిరా బాయ్ అనిపిస్తది. ఇక ఇంటర్వెల్ దగ్గర గట్టి షాక్ ఇద్దామనుకుంటే… మన సోషల్ మీడియా బ్యాచ్ ముందే ట్విట్టర్లల్ల కూసేసిండ్రు. దాంతో ఆడియెన్స్‌కి థియేటర్ల ఫ్యూజులు ఎగరలే.
ఇక సెకండ్ హాఫ్ కొచ్చేసరికి.. డైరెక్టర్ గారు ఏ గల్లీల పోతున్నాడో ఆయనకే ఎరుక! ‘సినిమాకి లాజిక్కులు వద్దు, అంతా మ్యాజిక్కే’ అనుకుంటూ మనల్ని గిర్రు గిర్రున తిప్పేసిండు. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన కిక్ కాస్తా, సెకండ్ హాఫ్‌ల దిగిపోయింది. కథను కన్ఫ్యూజ్ చేసిండో, లేక పబ్లిక్‌ని పిచ్చోళ్లను చేద్దామనుకున్నాడో కానీ.. సాగదీసిన ఫీలింగ్ అయితే పక్కా అస్తది. కానీ రొటీన్ లవ్ స్టోరీలకు కొంచెం వెరైటీగా ట్రై చేసిండు. లవ్ స్టోరీలంటే పడిచచ్చేటోళ్లకు ఇది కొంచెం ఎక్కుతది.అనుకుంటా
యాక్టింగ్ ముచ్చట చూస్తే.. కిరణ్ అబ్బవరం స్టీవెన్ శంకర్ క్యారెక్టర్‌ల ఇరగదీసిండు. ఆడికి ఇసొంటి క్యారెక్టర్లు మంచినీళ్లు తాగినంత ఈజీ కదా, ఇగ అందులో జీవించేశాడు. ఇక గౌరీ ప్రియ అయితే ఏడుపు సీన్లలో గట్టిగా పండించింది, గ్లిజరిన్ డబ్బాలు బాగానే వాడినట్టున్నరు, సినిమాకి అసలు సిసలు బలం ఆ పిల్లే. సిరి హనుమంతు, త్రిగుణ్ గిట్ల ఎవరికి వాళ్ళు వాళ్ళ పరిధిల కష్టపడ్డరు.
కానీ ఈ సినిమాకి అసలు సిసలు హీరో ఎవరంటే.. మన మణిశర్మ అప్పా! ‘మణిశర్మ ఈజ్ బ్యాక్’ అనే రేంజుల కొట్టిండు మ్యూజిక్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే థియేటర్లల్ల గూస్‌బంప్స్ తెప్పిస్తది. సినిమాని తన భుజాల మీద వేసుకొని మోసిండు.
మణిశర్మ బీజీఎమ్: సినిమాకి ఆక్సిజన్ గిదే. తాత కుమ్మి పడేసిండు!
ఫస్ట్ హాఫ్: సుత్తి లేకుండా ఎలక్ట్రిక్ ట్రెయిన్ లెక్క పోయే స్క్రీన్ ప్లే.
గౌరీ ప్రియ: ఏడుపులు, యాక్టింగ్.. పిల్ల ప్రాణం పెట్టి చేసింది.
కిరణ్ అబ్బవరం: తన మార్క్ యాక్టింగ్ తో న్యాచురల్ గా లాగించేసిండు.
*. సెకండ్ హాఫ్ సాగదీత: కూర్చున్న సీట్లకు రంధ్రాలు పడతాయేమో అనిపిస్తది.
*. బామ్ రెడీ పెట్టుకోవాల్సిందే!
లీక్ అయిన ఇంటర్వెల్ ట్విస్ట్: ముందే తెలిసిపోవడంతో ఆ కిక్ మిస్ అయింది.
*.లాజిక్ లెస్ సీన్లు: లాజిక్కులు గాలికి వదిలేసి మ్యాజిక్ అని చెప్పే కన్ఫ్యూజన్ సీన్లు.
అంతూ చింతూ లేని ముచ్చట ఎందుకు గానీ, ఫైనల్ గా మన చెప్పేదేందంటే.. ‘చెన్నై లవ్ స్టోరీ’ ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ రైడ్. ఫస్ట్ హాఫ్ కిక్ ఇచ్చినా, సెకండ్ హాఫ్‌ల కొంచెం ఓపిక ఉండాలి. బ్రేకప్ బాధలు, లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నోళ్ళు టిష్యూ పేపర్లు పట్టుకొని ఒక్కసారి ఎల్లేసి రావొచ్చు.
BIGTV Rating : 2.5/5