Airtel Plans: టెలికాం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ (Airtel) వినియోగదారుల కోసం మరో సరికొత్త సంచలనానికి తెరతీసింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ‘5G నెట్‌వర్క్ స్లైసింగ్’ (5G Network Slicing) సాంకేతికతతో కూడిన సరికొత్త ‘ప్రియారిటీ పోస్ట్‌పెయిడ్’ (Priority Postpaid) ప్లాన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్, రద్దీ ఉన్నా నిరంతరాయమైన కనెక్టివిటీని కోరుకునే వారి కోసం కేవలం రూ. 449 ప్రారంభ ధరతోనే ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ సరికొత్త ప్లాన్స్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.
సాధారణంగా పబ్లిక్ నెట్‌వర్క్‌లో రద్దీ (Traffic) ఎక్కువగా ఉన్నప్పుడు ఇంటర్నెట్ వేగం తగ్గుతుంటుంది. కానీ ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన ఈ ‘నెట్‌వర్క్ స్లైసింగ్’ సాంకేతికత ద్వారా.. ఒకే 5G నెట్‌వర్క్‌లో ప్రియారిటీ వినియోగదారుల కోసం ఒక ప్రత్యేకమైన ‘వర్చువల్ లేన్’ (సెపరేట్ ట్రాక్) కేటాయించబడుతుంది. దీనివల్ల చుట్టుపక్కల ఎంత రద్దీ ఉన్నప్పటికీ ఈ ప్లాన్ తీసుకున్న వారికి హై-స్పీడ్ ఇంటర్నెట్, ఎటువంటి అంతరాయం లేని కనెక్టివిటీ లభిస్తుంది. భారతదేశంలో ఈ తరహా సాంకేతికతను కమర్షియల్‌గా ప్రవేశపెట్టిన మొదటి నెట్‌వర్క్ ఎయిర్‌టెల్ కావడం విశేషం.
ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన ఈ ప్రియారిటీ పోస్ట్‌పెయిడ్ పోర్ట్‌ఫోలియోలో ప్రారంభ ప్లాన్ ధర రూ. 449 గా నిర్ణయించారు. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు లభించే ప్రధాన ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి. అందులో కీలకమైనది.. ప్రేయారిటీ 5G నెట్‌వర్క్. రద్దీ సమయాల్లోనూ అత్యుత్తమ డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్స్ ను ఇది అందిస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్ 5G డేటాతో పాటు రోల్‌ఓవర్ సదుపాయం ఉన్న 40 GB ప్రైమరీ డేటాను యూజర్ పొందొచ్చు. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు ఫ్రీగా చేసుకోవచ్చు.
రూ. 449 ప్లాన్‌తో పాటు ఫ్యామిలీ కనెక్షన్లు, ఫ్రీ ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు కోరుకునే వారి కోసం ఎయిర్‌టెల్ రూ. 549, రూ. 699, రూ. 999 వంటి ఇతర ప్రీమియం ప్లాన్లను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ హై-ఎండ్ ప్లాన్లలో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి ప్రముఖ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా పొందొచ్చు. అలాగే కుటుంబ సభ్యుల కోసం అదనపు సిమ్ కార్డ్స్ కూడా తీసుకునే వీలుంది.
Also Read: Undersea Bullet Train: సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్ పరుగులు.. భారత రైల్వే చరిత్రలో మరో అద్భుతం!
5G నెట్‌వర్క్ స్లైసింగ్ సేవలు ప్రారంభం సందర్భంగా ఎయిర్ టెల్ ప్రతినిధులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలో డిజిటల్ విప్లవాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడంలో ఎయిర్‌టెల్ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఈ 5G నెట్‌వర్క్ స్లైసింగ్ సాంకేతికత ద్వారా ఆన్‌లైన్ గేమర్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులు, లైవ్ స్ట్రీమర్స్, హై-క్వాలిటీ వీడియోలు చూసే వారికి సరికొత్త ప్రీమియం అనుభూతి కలుగుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు లేదా కొత్తగా ఎయిర్‌టెల్‌లోకి మారాలనుకునే వారు థాంక్స్ యాప్ ద్వారా లేదా సమీపంలోని ఎయిర్‌టెల్ స్టోర్‌ను సందర్శించి ఈ ‘ప్రియారిటీ పోస్ట్‌పెయిడ్’ సేవలను యాక్టివేట్ చేసుకోవచ్చని ఎయిర్ టెల్ వర్గాలు సూచించాయి.