New Realme Smartphone: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ మళ్లీ సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు ఎప్పుడూ వినిపించని స్థాయిలో ఒక స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. తొలిసారి 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్టు సమాచారం. ఈ ఫోన్‌ను ఆగస్టు 27న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ హింట్ ఇచ్చింది. ఇప్పటికే సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అయితే ఫోన్ పేరును మాత్రం రహస్యంగానే ఉంచింది. ఆ పోస్టర్‌పై “1×000 బ్యాటరీ టెక్ పయోనీర్” అనే ఆకర్షణీయమైన ట్యాగ్‌లైన్ పెట్టడం గమనార్హం. దీంతో ఇది నిజంగానే స్మార్ట్‌ఫోనేనా? లేక వేరే కొత్త డివైస్‌ను రిలీజ్ చేయబోతున్నారా అన్న సందేహం ఆసక్తికరంగా మారింది.
రియల్ మీ కొత్త ప్రాజెక్ట్ చుట్టూ ఆసక్తి
ఇప్పటివరకు రియల్‌మీ విడుదల చేసిన ఫోన్లు పరిశీలిస్తే, ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనాలో జీటీ 7 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవి 7,200 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చాయి. కానీ అదే ఫోన్‌ను భారత్‌లో 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతోనే విడుదల చేసింది. ఇదే సమయంలో ఇతర ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు కూడా 6,000 నుంచి 7,000 ఎంఏహెచ్ బ్యాటరీల మధ్య కొత్త మోడళ్లను రిలీజ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు 10,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల ఫోన్ మాత్రం మార్కెట్లోకి రాలేదు. ఈ కారణంగానే రియల్ మీ కొత్త ప్రాజెక్ట్ చుట్టూ ఆసక్తి పెరిగింది.
ఛార్జింగ్ స్పీడ్ 320 వాట్స్..
ఇక కంపెనీ ఇచ్చిన మరికొన్ని సూచనలు కూడా పరిశీలిస్తే, ఆగస్టు 27న రాబోయే ఈ ఫోన్ కేవలం భారీ బ్యాటరీతోనే కాకుండా అత్యాధునిక ఛార్జింగ్ టెక్నాలజీతో రానుంది. ఛార్జింగ్ స్పీడ్ 320 వాట్స్‌గా ఉంటుందని రియల్ మీ చెబుతోంది. అంటే, ఛార్జింగ్ వేగం విషయంలో కూడా ఇది ఇప్పటివరకు ఏ ఫోన్‌కు అందని రేంజ్‌లో ఉంటుందని అర్థం. లాంచ్‌కు ముందు ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు లేదా కీలక వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశముంది.
Also Read: Hyderabad Police: డీజేలకు నో.. హైదరాబాద్ భక్తులకు పోలీస్ గైడ్ లైన్స్ ఇవే!
రెండు నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ
ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే.. రియల్‌మీ ఈ ఏడాది మే నెలలోనే 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 320W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రియల్ మీ జీటీ కాన్సెప్ట్ ఫోన్‌ను ప్రదర్శించింది. ఆ కాన్సెప్ట్ ఫోన్ 8.5 ఎంఎం మందంతో, కేవలం 200 గ్రాముల బరువు తో ఉందని తెలిపింది. వెనుక వైపు సెమీ ట్రాన్సపరెంట్ డిజైన్ కూడా చూపించింది. ఇకపోతే గతేడాది ఆగస్టులోనే 320W సూపర్ సోనిక్ ఛార్జ్ టెక్నాలజీని రియల్ మీ బయట పెట్టింది. కేవలం నాలుగు నిమిషాల 30 సెకన్లలో ఫోన్ 0 నుంచి 100 శాతం వరకూ ఛార్జ్ అవుతుందని, అప్పటికే డెమో ఇచ్చింది. ఒక్క నిమిషం ఛార్జ్ చేస్తే 26 శాతం, రెండు నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ నిండిపోతుందని తెలిపింది. కానీ ఇప్పటివరకు ఆ టెక్నాలజీ వాస్తవంగా వినియోగదారులకు అందుబాటులోకి రాలేదు.
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌నే కుదిపేసే సంచలనం
అయితే ఆగస్టు 27న లాంచ్ అయ్యే ఈ కొత్త డివైస్ నిజంగానే 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో, 320W సూపర్ సోనిక్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తే, అది ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌నే కుదిపేసే సంచలనం అవుతుంది. ఇప్పటివరకు రియల్ మీ జీటీ 7నే అతిపెద్ద బ్యాటరీ ఫోన్‌గా ఉంది. అది 7,200 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. కానీ ఈసారి రాబోయే కొత్త మోడల్ దాన్ని దాటేసి, స్మార్ట్ ఫోన్ టెక్నాలజీకి కొత్త స్థాయిని తీసుకురాబోతుందన్న ఆశలు పెరిగాయి.