ఇంగ్లాండ్ లోని ఓ చిన్న గ్రామం. ప్రజలంతా పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంతలో ఇద్దరు వింత పిల్లలు కనిపించారు. ఆకుపచ్చ చర్మంతో, వింత బట్టలు ధరించి, వింత భాష మాట్లాడుతూ ఉన్నారు. ఇదేదో కథ కాదు. 800 సంవత్సరాల క్రితం జరిగిన నిజమైన కథ. ఇంతకీ ఎవరీ పిల్లలు? ఎక్కడి నుంచి వచ్చారు? ఆకుపచ్చ రంగులో ఎందుకు ఉన్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
12వ శతాబ్దంలో జరిగిన వింత కథ
గ్రీన్ చిల్డ్రన్ ఆఫ్ వూల్ పిట్ కథ 12వ శతాబ్దంలో ఇంగ్లాండ్ సఫోల్క్ లోని వూల్ పిట్ అనే గ్రామంలో జరిగింది. కింగ్ హెన్రీ II కాలంలో, వూల్ పిట్ లోని రైతులు పంట కాలంలో తమ పొలాల్లో పని చేస్తున్నారు. తోడేళ్ళను పట్టుకోవడానికి ఉపయోగించే గొయ్యి దగ్గర ఇద్దరు చిన్న పిల్లలు కనిపించారు. వారిలో ఒకరు అబ్బాయి. మరొకరు అమ్మాయి ఇద్దరు అసాధారణంగా ఉన్నారు. వారి చర్మం ఆకు పచ్చగా ఉంది. వింత దుస్తులు ధరించారు. ఎవరికీ అర్థంకాని భాష మాట్లాడుతున్నారు. ఇద్దరు పిల్లలను ఆ ఊరి సమీపంలో నివసించే సర్ రిచర్డ్ డి కాల్నే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లారు కూలీలు. అతడు వారిని తన దగ్గరే ఉంచుకున్నారు.
ముందు వాళ్లు ఆ గ్రామస్తులు తినే ఫుడ్ తినడానికి ఇష్టపడలేదు. బ్రెడ్, మాంసంను తినలేదు. కానీ, వాళ్లు బీన్స్ చూసి ఎంతో ఇష్టంగా తినడం మొదలుపెట్టారు. నెమ్మదిగా ఇతర ఆహారం తినడం మొదలుపెట్టారు. వారి ఆకుపచ్చ చర్మం కాస్తా మారిపోయింది. అందరిలాగే సాధారణంగా కనిపించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత బాలుడు అనారోగ్యానికి గురై చనిపోయాడు. ఆ అమ్మాయి నెమ్మదిగా పెరిగి పెద్దయ్యింది. ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకుంది. గ్రామస్తులతో కలిసి నివసించింది. కొందరు ఆమె పేరు ఆగ్నెస్ అని పిలవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆమె రిచర్డ్ బారే అనే వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.
వింత విషయాన్ని చెప్పిన ఆగ్నెస్
కొంతకాలం తర్వాత ఆగ్నెస్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పింది. ఆమె చెప్పే విషయాలు చాలా వింతగా అనిపించింది. తాను, తన సోదరుడు ‘సెయింట్ మార్టిన్స్ ల్యాండ్’ నుంచి వచ్చినట్లు చెప్పింది. ఈ ప్రదేశం భూగర్భంలో ఉందని, అక్కడ సూర్యుడు ఎప్పుడూ ప్రకాశించలేదని, ప్రతిదీ మసకబారిన, సంధ్యా కాంతిలో ఉంటుందని వివరించింది. ఓసారి గుహ నుంచి శబ్దం రావడాని గమనించి రావడం మొదలు పెట్టినట్లు చెప్పింది. చివరకు వూల్ పిట్ కు వచ్చినట్లు చెప్పింది. అక్కడ సూర్యకాంతి తమను బయపెట్టిందని, తిరిగి వెల్లే మార్గాన్ని కనిపెట్టలేక అక్కడే ఉండిపోయినట్లు వెల్లడించింది.
నిజంగా ఆ పిల్లలు ఎక్కడి నుండి వచ్చారు?
నిజానికి ఆ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారో, వారి చర్మం ఎందుకు పచ్చగా ఉందో ఎవరికీ కచ్చితంగా తెలియదు. కొందరు చరిత్రకారులు ఈ పిల్లలు ఫ్లెమిష్ వలసదారుల పిల్లలై ఉండవచ్చని, ఆ కాలంలో ఇంగ్లాండ్ లో జరిగిన యుద్ధాల వల్ల అనాథలై ఉండవచ్చని భావిస్తారు. వారి ఆకుపచ్చ చర్మం రావడానికి కారణం పోషకాహార లోపం కావచ్చంటున్నరు. వూల్ పిట్ గ్రీన్ చిల్డ్రన్ అనేది అందరినీ ఆశ్చర్యపరిచే కథ. ఇది నిజమా? ఊహల మిశ్రమమా? అనేది తెలియదు. ఈ కథ హెర్బర్ట్ రీడ్ రాసిన ‘ది గ్రీన్ చైల్డ్’ పుస్తకంలో ఈ కథను ప్రస్తావించారు. ఇంగ్లండ్ ప్రజలు ఇప్పటికీ ఈ కథను నిజమే అని నమ్ముతారు.
Read Also: మొసలిని మోసుకెళ్లి మరో మొసలి.. ఇంతకీ దానికి ఏమైనట్టు?