TRAI New Rules: స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. లోన్ కావాలా? క్రెడిట్ కార్డు తీసుకుంటారా? అంటూ వచ్చే స్పామ్ కాల్స్‌తో చాలామంది యూజర్లు విసిగిపోతుంటారు. హాయిగా నిద్రపోతున్న సమయంలోనో, ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడో ఫోన్ మోగడం.. అవతల నుంచి రికార్డెడ్ వాయిస్‌తో మార్కెటింగ్ మెసేజ్‌లు వినిపించడం ఇప్పుడు కామన్‌గా మారిపోయింది. ఈ అనవసరమైన కాల్స్‌కు చెక్ పెట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మరింత కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.
ఇప్పటివరకు మొబైల్ నంబర్ల నుంచి వచ్చే స్పామ్, మార్కెటింగ్ కాల్స్‌పై దృష్టి పెట్టిన TRAI.. తాజాగా రోబో కాల్స్, ఆటోమేటెడ్ వాయిస్ కాల్స్, రికార్డెడ్ మెసేజ్‌లపైనా నిఘా పెంచుతోంది. ఈ చర్యలు అమల్లోకి వస్తే.. రోజూ స్పామ్ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్న మొబైల్ యూజర్లకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది.
ఎవరైనా సరే కమర్షియల్ కాల్స్ చేయాలంటే ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఒక నెంబర్ నుంచి మూడు కన్నా ఎక్కువసార్లు ఫిర్యాదులు వస్తే వెంటనే యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఏ నెంబర్లు ఎక్కువగా స్పామ్ కాల్స్ చేస్తున్నాయో టెలికాం కంపెనీలు ఇట్టే కనిపెట్టేస్తాయి.
ఒకవేళ ఐదు కంటే ఎక్కువ నెంబర్లు ఒకే సెండర్‌కు లింక్ అయి ఉండి, అవి స్పామ్ కాల్స్ చేస్తూ దొరికిపోతే.. ఆ నెంబర్ల కేవైసీని మళ్లీ వెరిఫై చేస్తారు. అంతేకాదు.. ఫిజికల్ వెరిఫికేషన్ చేసి మరీ అవుట్‌గోయింగ్ సర్వీసులు కట్ చేస్తారు. తప్పు మళ్లీ మళ్లీ చేస్తే ఆ టెలికాం రిసోర్స్‌ను పూర్తిగా రద్దు చేసి శాశ్వతంగా బ్లాక్ చేసేస్తారు.
Also Read: యాపిల్‌కి చెక్ పెట్టిన శాంసంగ్ ఫోల్డబుల్.. అమ్మకాల్లో దూసుకుపోతున్న Galaxy Z Fold 8!
ఇకపై కంపెనీలు నేరుగా మనుషులతో మాట్లాడకుండా.. ఆటో డయలింగ్ లేదా రోబోటిక్ వాయిస్ టెక్నాలజీని వాడితే ముందే ఆ వివరాలన్నీ టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌కు ముందే డిక్లేర్ చేయాలి. అసలు ఏ నెంబర్ల నుంచి ఈ కాల్స్ చేస్తారో ముందుగానే అధికారులకు రిజిస్టర్ చేయాలి.
ఇలాంటి ముందస్తు సమాచారం ఏమీ ఇవ్వకుండా ఎవరైనా కాల్స్ చేస్తే వాటిని నేరుగా స్పామ్ కింద లెక్కేస్తారు. అంతేకాదు.. ఇలా నిబంధనలు మీరే కంపెనీలపై నిమిషానికి ఐదు పైసల చొప్పున టెర్మినేషన్ ఛార్జీలను కూడా వసూలు చేస్తారు.
మార్కెటింగ్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన 140, 160 సిరీస్ నెంబర్ల నుంచి కాల్స్ వస్తే మాత్రం వాటిని యూజర్లు స్పామ్‌గా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ నెంబర్లన్నీ అధికారిక కమర్షియల్ కమ్యూనికేషన్స్ కింద వస్తాయని స్పష్టం చేశారు. అలాగే ఇంతకుముందు కస్టమర్లు ఇచ్చిన లెగసీ కన్సెంట్లను కూడా డిజిటలైజ్ చేయాలని TRAI ఆదేశించింది.
ఒకవేళ ఈ రూల్స్ ఏమైనా బ్రేక్ అయితే.. కస్టమర్లు వెంటనే TRAI డీఎన్డీ యాప్ ద్వారా లేదా నేరుగా 1909 నెంబర్‌కు కాల్ చేసి అప్పీల్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించారు. ఈ కొత్త రూల్స్‌తోనైనా మన ఫోన్లకు వచ్చే ఆ చిరాకు పుట్టించే స్పామ్ కాల్స్ పూర్తిగా తగ్గుతాయని కోరుకుందాం.
Also Read: రూ.36,000 లోపు ఏఐ టెక్నాలజీతో సూపర్ ల్యాప్‌టాప్ లాంచ్.. ఫీచర్స్ అదిరిపోయాయ్!