Primebook 3 Max: మార్కెట్లోకి రోజుకో కొత్త ల్యాప్‌టాప్ వస్తూనే ఉంది. ముఖ్యంగా స్టూడెంట్స్, తక్కువ బడ్జెట్లో మంచి ల్యాప్‌టాప్ కోరుకునే వారి కోసం కంపెనీలు సరికొత్త మోడళ్లను పరిచయం చేస్తున్నాయి. ఈ కోవలోనే ప్రముఖ బ్రాండ్ ప్రైమ్‌బుక్ తాజాగా భారత్‌లో ఓ కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకువచ్చింది. అదే Primebook 3 Max. చూడటానికి చాలా ట్రెండీగా ఉంటూనే.. రోజూవారీ అవసరాలకు సరిపడేలా దీన్ని డిజైన్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ Primebook 3 Max ధరను కంపెనీ రూ.35,990గా ఫిక్స్ చేసింది. అక్టోబర్ 1 నుంచి ఇది అమ్మకాలకు అందుబాటులోకి రానుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ప్రైమ్‌బుక్ అధికారిక వెబ్‌సైట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అలాగే ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఎంపిక చేసిన స్టోర్లలో ఇది లభిస్తుంది. ముఖ్యంగా పాయ్ ఇంటర్నేషనల్ స్టోర్ల ద్వారా నేరుగా వెళ్లి తీసుకోవచ్చు. పండగ సీజన్ సేల్స్‌లో దీనిపై మరిన్ని డిస్కౌంట్లు లభించే అవకాశం ఉంది.
Also Read: యాపిల్‌కి చెక్ పెట్టిన శాంసంగ్ ఫోల్డబుల్.. అమ్మకాల్లో దూసుకుపోతున్న Galaxy Z Fold 8!
ఇక స్క్రీన్ విషయానికి వస్తే.. Primebook 3 Maxలో 15.6 అంగుళాల పెద్ద డిస్ప్లే ఇచ్చారు. ఆంటీ గ్లేర్ కోటింగ్ ఉండటం వల్ల కళ్ల మీద ఎక్కువ ప్రభావం పడదు. ఇక బ్యాటరీ పరంగా చూసుకుంటే.. ఇందులో 60.3Wh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఫుల్‌ఛార్జ్ చేస్తే దాదాపు 12 గంటల వరకు బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి తోడు 36 వాట్ల యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది.
ఈ ల్యాప్‌టాప్ పనితీరు కోసం మీడియాటెక్ జెనియో 720 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను వాడారు. దీనివల్ల పాత మోడళ్లతో పోలిస్తే పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది. ఇందులో 8GB ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128GB యూఎఫ్ఎస్ స్టోరేజ్ ఇస్తున్నారు. ఒకవేళ స్టోరేజ్ సరిపోకపోతే మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా ఏకంగా 1TB వరకు పెంచుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.
ఇక సాఫ్ట్‌వేర్ పరంగా ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రైమ్‌ఓఎస్‌పై ఇది పనిచేస్తుంది. ఆఫీస్ పనికోసం ప్రైమ్‌ఆఫీస్, లైనక్స్ సపోర్ట్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఇందులో ఇచ్చిన ప్రైమ్ ఏజెంట్ అనే ఏఐ ఫీచర్ ల్యాప్‌టాప్ వాడకాన్ని మరింత సులభం చేస్తుంది. క్లౌడ్ ద్వారా విండోస్ యాప్స్‌ను కూడా వాడుకోవచ్చు. పెద్ద స్క్రీన్, మంచి బ్యాటరీ లైఫ్ కోరుకునే బడ్జెట్ యూజర్లకు ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.
Also Read: స్టోర్ల ముందు క్యూ కట్టాల్సిన పనిలేదు.. నిమిషాల్లో మీ చేతికి కొత్త iPhone 18 Pro, ఎలాగంటే?