ప్రజా సమస్యలొకదిక్కు. పరిపాలన మరో దిక్కు. పరస్పర ఆరోపణల రాజకీయాల్లో మాత్రం బాగా రాణిస్తున్నారు నేతలు.. అని అనుకుంటన్నారు జనం ప్రస్తుత పరిస్థితులు చూసి. కేసీఆర్, కేటీఆర్ ఫామ్‌హౌజ్‌లకు వద్దకు పోలోమని బస్సులేసుకుని బస్సు యాత్రలు చేసిన కాంగ్రెస్ నేతలు తీరును చూసి అంతా తిట్టెటోళ్లే. తిట్టని నోళ్లు లేవంటే నమ్మండి. ఇది మరీ ఓవర్ యాక్షన్ గురూ..! అని ఆ పార్టీకి చెందిన నేతలే అసహనం ప్రకటించే స్థాయి నిరసన రూపమన్నమాట ఇది.
రేవంత్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఫామ్‌హౌజ్‌లో అక్రమాలు జరిగాయని. భూములు లాక్కున్నారని. విచారణకు నెల రోజులు డెడ్‌లైన్ కూడా పెట్టారు అధికారులకు. మరి మధ్యలో మీ అత్యుత్సాహేందీ నాయకా? అని అడుగుతున్నారు జనం. రామయణంలో పిడకల వేటలా.. కాంగ్రెస్ నేతల బస్సుయాత్రపై సర్వత్రా విమర్శలే వస్తున్నాయి. ఇది రేవంత్ సర్కార్ ఓవర్ యాక్షన్‌గా చూస్తున్నారంతా.
ప్రతిపక్షం ఆందోళనలు చేయడం సహజం. హామీలపై నిలదీయడం మామూలే. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. అధికార పార్టీ.. ప్రతిపక్షంతో పోటీలు పడి మరీ ఎదురు నిరసనలకు దిగుతోంది. అంతకు మించే చేస్తోంది. ఈ క్రమంలో అతి కూడా చేస్తోంది.. అనే విమర్శలను కూడా మోస్తోంది.
ఈ బస్సు యాత్రకు ఎవరు ప్లాన్ చేశారో..? దీనికి సీఎం ఎందుకు పర్మిషన్ ఇచ్చారో తెలియదు కానీ, పనిపాటా లేని తంతుగానే జనం దీన్ని చూస్తున్నారు. ఇది రేవంత్‌కు తెలియదా అంటే.. తెలుసు. కానీ ఇప్పుడు పెద్ద ప్రోగ్రాములు కూడా ఏమీ లేవనుకున్నారో.. జనంఈ వైపునే దృష్టంతా పెడితే బాగుండని భావించారో.. పదేళ్ల పాటు జరిగింది ఫామ్‌హౌజ్‌ల పాలన అని ప్రపంచమంతా తెలియాలని అనుకున్నారో తెలియదు గానీ.. కాంగ్రెస్ నేతల బస్సుయాత్ర మాత్రం అభాసుపాలే అయ్యింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లయ్యింది. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్పటికీ ఇంకా ప్రతిపక్షం వెంట పడుతూనే ఉంటారా? ఈ భూముల లెక్కలేంటో అప్పుడు తెలియవా? ఇప్పుడే సర్కార్ వీటిని కనిపెట్టిందా…? ఇలా మళ్లీ ఎన్నికల దాకా ఈ ప్రతిపక్షం పై దాడుల ఎపిపోడ్‌లను కొనసాగిస్తూనే ఉంటుందా? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.
ఓ వైపు ఎల్‌నినో కరువు ప్రభావం ఉందంటున్నారు. పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కూలీలకు చేతి నిండా పని కూడా దొరకని పరిస్థితులున్నాయి. కానీ రాష్ట్రంలో మాత్రం… తల్లులను తిట్టుడు… అంటరానితనం ప్రదర్శనలు చేసుడు..పసుపు నీళ్లు జల్లుడు.. క్షుద్రపూజల ఇష్యూలతో హడలెత్తించుడు.. చావు డప్పులు కొట్టుడు.. ఫామ్‌హౌజ్‌ల చుట్టూ బస్సుయాత్ర పేర చక్కర్లు కొట్టుడు.. ఇదీ ప్రజాపాలనలో మూడేండ్ల తరువాత కూడా జరుగుతున్న పురోగతి అప్‌డేట్స్.. ! అంటూ వ్యంగ్యంగా చర్చించుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో.