Australia World Record : ప్రపంచ క్రికెట్ లో ఆస్ట్రేలియాకి బలమైన జట్టుగా పేరుంది. ఇప్పుడు క్రికెట్ ఆడే దేశాల్లో అన్ని జట్లపై కూడా ఘనమైన రికార్డుంది. అంతేకాదు వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ లో భారత్ ను ఓడించి ట్రోఫీ కూడా గెలిచింది. అలాంటి ఆస్ట్రేలియా ఇప్పుడు స్కాట్లాండ్ లాంటి చిన్నజట్టుపై ఆడి ప్రపంచ రికార్డ్ నమోదు చేసింది.
విషయం ఏమిటంటే.. స్కాట్లాండ్ తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్.. పవర్ ప్లే లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. 6 ఓవర్ల పవర్ ప్లేలో ఆస్ట్రేలియా ఏకంగా 113 పరుగులు సాధించింది. ఇది అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ప్రపంచ రికార్డ్ గా నమోదైంది. ఇక ఐపీఎల్ లాంటి లీగ్స్ లో అయితే ఇది సెకండ్ హయ్యస్ట్ స్కోరు అని చెప్పాలి.
మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 9.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించి విజయ పతాకం ఎగరవేసింది.
Also Read: పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ
ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఇరగదీసి ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 12 ఫోర్లు, 5 సిక్స్ ల సాయంతో 80 పరుగులు చేసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరో ఓపెనర్ జాక్ ఫ్రేజర్ డక్ అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ మిచెల్ మార్ష్ కూడా ధనాధన్ ఆడాడు. 12 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో 39 పరుగులు చేశాడు. తర్వాత జోష్ ఇంగ్లిస్ (27), మార్కస్ స్టోనిస్ (8) లాంఛనం పూర్తి చేశారు. ఈ క్రమంలో ప్రపంచ రికార్డు నమోదైంది.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పవర్‌ప్లే సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా (113) ముందు వరుసలో ఉంటే సౌతాఫ్రికా (102)- వెస్టిండీస్‌పై, వెస్టిండీస్ (98) శ్రీలంక తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ లో జార్జ్ మున్సే (28), కెప్టెన్ రిచి బెర్రింగ్టన్ (23), మాథ్యూ క్రాస్ (27) వీళ్లు మోస్తరుగా ఆడటంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా బౌలింగులో అబాట్ 3, జేవియర్ 2, రిలీ మెరిడిత్ 1, ఆడమ్ జంపా 2, కెమరాన్ గ్రీన్ 1 వికెట్ పడగొట్టారు.