World Test Championship 2025: పాకిస్తాన్ జట్టుకే ఎందుకిలా జరుగుతోంది. ఒక దాని తర్వాత ఒకటి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇప్పటికే బంగ్లా తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ ల ఓటమితో పరువు పోయి ఏడుస్తున్న జట్టుకి ఐసీసీ టెస్టు ర్యాంకులు పిడుగులా పడ్డాయి. దీంతో పాకిస్తాన్ మరింత కుదేలైపోయింది.
ఇంతకీ విషయం ఏమిటంటే, వచ్చే ఏడాది వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ జరగనుంది. అక్కడికి చేరాలంటే టాప్ 2 ప్లేస్ లో ఉండాలి. కానీ ఇప్పుడు వచ్చిన ర్యాంకులను బట్టి చూస్తే పాకిస్తాన్ ఏకంగా 8వ స్థానానికి పడిపోయింది. అంటే తన కింద మరొక జట్టు మాత్రమే ఉంది. నిజానికి బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ముందు పాక్ ఆరో స్థానంలో ఉండేది. అయితే వరుసగా రెండు ఓటములతో రెండు స్థానాలు కిందకు పడిపోయిందని ఐసీసీ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం 76 పాయింట్లతో పాకిస్థాన్ 8వ ర్యాంకులో ఉండగా, ఆస్ట్రేలియా (124 పాయింట్లు), భారత్ (120), న్యూజిలాండ్ (108) ఇంగ్లాండ్ (108) టాప్-4లో పాయింట్ల పరంగా ఉన్నాయి.
Also Read: ఐపీఎల్‌లోకి రీ ఎంట్రీ.. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా ద్రవిడ్
ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే, తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. అందులో కూడా పాకిస్తాన్ 8వ స్థానానికి పడిపోయింది. వరల్డ్ ఛాంపియన్ షిప్, ఇటు టెస్ట్ ర్యాంకింగ్స్ లో కూడా కిందనే ఉండటంతో తల ఎక్కడ పెట్టుకోవాలో తెలీక పాక్ తల్లడిల్లుతోంది. ఆ మాయదారి టెస్టు ర్యాంకులు ఇప్పుడే ఐసీసీ విడుదల చేయాలా? అని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.
ఇకపోతే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ పరంగా భారత్ (68.52 శాతం), ఆస్ట్రేలియా (62.50 శాతం)తో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇక న్యూజిలాండ్ (50) మూడో స్థానానికి పరిమితమవ్వగా, బంగ్లాదేశ్ జట్టు ఏకంగా (45.83) నాలుగో స్థానానికి చేరుకుంది. శ్రీలంకపై గెలిచిన ఇంగ్లండ్ (45) ఐదో స్థానానికి చేరింది.
ఇక పాకిస్తాన్ (19.05) పాయింట్లతో ఘోరంగా 8వ స్థానానికి పడిపోయింది. ఏదేమైనా వచ్చే ఏడాది జూన్ నాటికి ఏ రెండు జట్లు మొదటి రెండు స్థానాల్లో ఉంటాయో వాటి మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ పోటీలు జరగనున్నాయి.