OTT Movie : 2018లో శ్రీకాకుళం మత్స్యకారులు పాకిస్తాన్ జలాల్లోకి పొరపాటున చొరబడి రెండేళ్లపాటు జైలు శిక్ష అనుభవించిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన సిరీస్ ‘అరేబియా కడలి’ ఈ సిరీస్ గ్రిప్పింగ్ సర్వైవల్ డ్రామాగా ఆకట్టుకుంటోంది. ఇదివరకే ‘తండేల్’ సినిమా ఇలాంటి స్టోరీతోనే రిలీజ్ అయింది. ‘అరేబియా కడలి’ కథ కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. కానీ ఈ రెండు స్టోరీలు ప్రేక్షకుల మనసును దోచాయి. ఈ సిరీస్ స్టోరీ ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
‘అరేబియా కడలి’ 2025లో విడుదలైన తెలుగు సర్వైవల్ డ్రామా వెబ్ సిరీస్. సత్యదేవ్, ఆనంది ప్రధాన పాత్రల్లో, క్రిష్ నిర్మాణ సారథ్యంలో ఇది తెరకెక్కింది. ఈ సిరీస్ ను వి.వి. సూర్య కుమార్ దర్శకత్వం వహించారు. ఎనిమిది ఎపిసోడ్‌ల ఈ సిరీస్ 2025 ఆగస్ట్ 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అందుబాటులో ఉంది. IMDbలో 7.6/10 రేటింగ్ ని కూడా పొందింది.
కథలోకి వెళ్తే
శ్రీకాకుళం జిల్లాలోని చేపలవాడ, మత్స్యవాడ అనే రెండు పరస్పర విరుద్ధ గ్రామాల మత్స్యకారులు, పేదరికం, స్థానిక జెట్టీ లేకపోవడంతో గుజరాత్‌లో సీజనల్ పని కోసం వెళతారు. అయితే చేపలవాడ నుండి వచ్చిన బదిరి అనే మత్స్యకారుడు, మత్స్యవాడ గ్రామానికి చెందిన ధైర్యవంతమైన గంగ అనే యువతితో ప్రేమలో ఉంటాడు. ఆమె జీవితాన్ని మెరుగుపరచాలని కలలు కంటాడు. ఒక ఫిషింగ్ ట్రిప్‌లో, బదిరి, చిన్న, శేఖర్, ముఖలింగం అనే వ్యక్తులతో కలిసి అరేబియా సముద్రంలో ప్రమాదవశాత్తూ పాకిస్తాన్ జలాల్లోకి చొరబడతారు. తుఫాను కారణంగా వీళ్ల పడవ పాడైపోతుంది. పాకిస్థాన్ కోస్ట్ గార్డ్స్ వీళ్లను అరెస్ట్ చేసి, బాంబు దాడి ఆరోపణలతో జైలుకు పంపిస్తారు. ఈ సినిమా మొదటి భాగం సముద్ర సీన్లలో అద్భుతమైన విజువల్స్, తుఫాను ఇంటెన్సిటీతో ఆకట్టుకుంటుంది.
ఇప్పుడు జైలులో ఉన్న బదిరి తన మనుషులను కాపాడేందుకు కోర్టులో పోరాడుతాడు. కానీ ఈసమయంలో ఒక పెద్ద కుట్ర బయటపడుతుంది. ఇది రాజకీయ ఒత్తిళ్లు, అవినీతితో ముడిపడి ఉంటుంది. ఇండియాలో, గంగ తన గ్రామంలో అధికారులను ఎదిరిస్తూ, సోషల్ మీడియా ద్వారా ప్రజల సపోర్ట్ తో బదిరి విడుదల కోసం పోరాటం చేస్తుంది. డాక్టర్ ఫాతిమా అనే పాకిస్తానీ, బదిరి బృందానికి సహాయం చేస్తుంది. రెండు గ్రామాల మత్స్యకారులు జైలులో కలిసి ఐక్యంగా పోరాడటం, వారి గత శత్రుత్వాన్ని అధిగమించడం కథలో ఎమోషనల్ హైలైట్ అవుతుంది. ఇక క్లైమాక్స్ ఊహించని ట్విస్ట్‌లతో ముగుస్తుంది. చివరికి పాకిస్థాన్ నుంచి వీళ్ళంతా ప్రాణాలతో బయట పడతారా ? గంగను బదిరి కలుస్తాడా ? గంగ ఎలాంటి పోరాటం చేస్తుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : అర్దరాత్రి అపహరణ… డేంజరస్ సిటీలో పోలీసులకు చెమటలు పట్టించే కేసులు… ఒక్కో ట్విస్ట్ కు మెంటలెక్కాల్సిందే