పార్టీ ఫిరాయింపుల కేసు మళ్లీ మొదటికి వచ్చింది.గత ఏడాదిగా ఈ కేసు ఎటువంటి కొలిక్కి రావడం లేదు. ఇటీవల ఫిరాయింపుల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన తుది నిర్ణయం ప్రకటించారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మందికి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, మరల ఈ అంశాన్ని హైకోర్టులో బీఆర్ఎస్, బీజేపీ సవాల్ చేసింది.దీంతో మరోసారి ఈ కేసులో వాదనలు కొనసాగనున్నట్టు తెలుస్తున్నది. చివరలో విచారణ ఎదుర్కొన్న స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లకు హైకోర్టు నోటిసులు జారీ చేసింది.వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల కడియం,దానం నాగేందర్ పిటిషన్లను విచారించి వారిద్దరికీ క్లీన్‌చిట్ ఇచ్చారు. వారు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు సరైన ఆధారాలను పిటిషనర్లు చూపలేకపోయారని పేర్కొంటూ పిటిషన్లను కొట్టివేశారు. దీంతో బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రతివాదులను ప్రశ్నించగా.. దానం,కడియం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారిద్దరి అనర్హత పిటిషన్లను విచారించారని.. క్లీన్ చిట్ ఇచ్చారని గుర్తుచేశారు. దీనిపై ఇంకా విచారణ జరపాల్సిన అవసరం లేదని కోర్టుకు విన్నవించారు. ఏజీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం అనర్హత పిటిషన్లను విచారించకుండా పక్కన బెట్టేసింది.
సుప్రీం కోర్టు చర్యల అనంతరం కడియం, దానంలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే పిటిషన్లను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం దీనికి కౌంటర్లు దాఖలు చేయాలని కడియం, దానంలకు నోటీసులు అందజేసింది. వారు దాఖలు చేసే అఫిడవిట్లతో న్యాయస్థానం సంతృప్తి చెందుతుందా? లేదా మరల విచారణకు ఆదేశిస్తుందా? అనేది తెలియాల్సి ఉన్నది. ఒకవేళ మరోసారి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశిస్తే ఈ అంశం మళ్లీ మొదటికే రానుంది.ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఆదేశించే చాన్స్ లేకపోలేదు. ఇకపోతే దానం, కడియం ఫిరాయింపులకు పాల్పడినట్టు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని గులాబీ, కమలం పార్టీలు చెబుతున్నాయి.
Census Preparation: ఈసారి జరిగే జనగణనలో సరికొత్త రూల్.. ప్రతి ఇంటిలో ఇది ఉంటేనే కుటుంబంగా నిర్ధారణ
కాగా,సుప్రీం కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు సైతం అనర్హత పిటిషన్లను పక్కన పెడుతుందా? లేదా పిటిషనర్లు సమర్పించే ఆధారాలతో సంతృప్తి చెంది వారిపై చర్యలకు ఆదేశిస్తారా? అనేది తెలియాల్సి ఉన్నది. కాగా, దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ గుర్తుమీద ఎమ్మెల్యేగా గెలిచి మరల ఫిరాయింపులకు పాల్పడి..కాంగ్రెస్ పార్టీ గుర్తుమీద పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫాం మీద ఎంపీగా పోటీ చేసిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరి సైతం బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత తన కూతురు కడియం కావ్యకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇప్పించుకుని…ఆమె విజయం కోసం కాంగ్రెస్ కండువా వేసుకుని ప్రచారం నిర్వహించారని, దీనికి సంబంధించిన ఫుటేజ్ తమ వద్ద ఉందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాగా, ఫిరాయింపుల అంశంలో హైకోర్టు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.