Hyderabad: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పదవుల కోసం గాంధీభవన్‌కు వచ్చేవారికి చెక్ పెట్టారు. పదవులు ఆశించి వచ్చేవారికి అపాయింట్‌మెంట్లు ఇవ్వొద్దని ముఖ్యనేతలకు సూచన చేశారు. జూలై 20 నుంచి ఆగష్టు 3 వరకు నేతలు గాంధీభవన్‌కు రావద్దని తేల్చిచెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం-తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు ఆగస్టు 3 వరకు పొడిగించింది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-సర్‌పై ఆదివారం జామ్ మీటింగ్ నిర్వహించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ సమావేశానికి పార్టీకి చెందిన కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ భేటీలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి.
ముఖ్య నేతలకు కీలక సూచనలు-జూలై 20 నుంచి ఆగస్టు 3 వరకు నేతలు గాంధీభవన్‌కు రావొద్దని తేల్చిచెప్పారు. కొందరు నేతలు హైదరాబాద్‌లో కూర్చొంటున్నారని, పార్టీ వ్యవహారాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈసీ పొడిగించిన ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. ఛైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని గాంధీభవన్ చుట్టూ తిరగొద్దని తేల్చే చెప్పేశారు.
ఆగస్టు మూడు వరకు గాంధీభవన్ కు రావొద్దు-పదవుల కోసం వచ్చేవారికి గాంధీభవన్‌లో అపాయింట్‌మెంట్లు ఇవ్వొద్దని ముఖ్యనేతలకు ఆదేశించారు. ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా, ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలన్నారు. ఇన్‌ఛార్జిలుగా ఉన్న చోట ఎంపీలు పని చేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు.
టార్గెట్ కేవలం 10 రోజులు-పార్టీ పరంగా సర్ ఇన్‌ఛార్జిలుగా ఉన్నవారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని తేల్చిచెప్పారు. రాబోయే 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో ప్రతి నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేయాలన్నారు. సోమవారం నుంచి అన్ని జిల్లాల్లో ఇన్‌చార్జ్ మంత్రులతో ఎస్‌ఐఆర్ సమీక్షా సమావేశాలు నిర్వహించాలని తేల్చి చెప్పారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు క్షేత్రస్థాయిలో ఉండాలని, హైదరాబాద్‌లో కూర్చోవడం కుదరదని స్పష్టం చేశారు. బీఎల్‌ఓ రిపోర్టులపై ఆధారపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ పరంగా పని చేస్తున్న బీఎల్‌ఏలను నేతలు సమర్థంగా ఉపయోగించుకోవాలన్నారు. ఎస్‌ఐఆర్ పూర్తి బాధ్యత ఇన్‌చార్జ్ మంత్రులదేనని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.
ALSO READ: వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?
ఈనెల 30న మరోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామని, అసెంబ్లీ వారీగా పనితీరుపై నివేదికలు ఉంటాయన్నారు. ఉత్తమంగా పనిచేసే 100 మంది బీఎల్‌ఏలకు రాహుల్ గాంధీని కలిసి ఫోటో దిగే అవకాశం ఉందని వెల్లడించారు. సర్‌పై 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో 489 భేటీలు జరిగాయని తెలిపారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని సమన్వయం పని చేయాలన్నారు.