Kiran Kumar Reddy: ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై, తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో దేశ, ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలను ప్రస్తావిస్తూ బీజేపీ వైఖరిని ఎండగట్టారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక డిమాండ్లను ఆయన తెరపైకి తెచ్చారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ధ్వజం
డీలిమిటేషన్ బిల్లుపై లోతైన చర్చ జరపకుండా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయవద్దని కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటిస్తూనే.. ప్రజాస్వామ్యం గురించి బీజేపీ నీతులు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. అయోధ్య రామమందిరం పేరుతో సేకరించిన ప్రజా విరాళాలు దుర్వినియోగం అయ్యాయని, దీనిపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని కోరారు. అలాగే, నీట్ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్, పశ్చిమాసియా యుద్ధ వాతావరణం, ఇథనాల్ వాడకం వెనుక ఉన్న లొసుగులపై పార్లమెంట్‌లో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చర్చ చేపట్టాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబు, నితీష్ కుమార్ మద్దతుతోనే మోడీ ప్రధాని అయ్యారని, విదేశాల్లో ఫోజులు కొట్టడం తప్ప ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు.
తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యం
తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలను ఆయన కేంద్రం ముందుంచారు. రాష్ట్ర ప్రజల సుదీర్ఘ నిరీక్షణ అయిన రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. విభజన హామీల్లో భాగమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని, దీనికోసం బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ కృషి చేయాలన్నారు. మూసి నది సుందరీకరణ, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కేటాయింపులతో పాటు తెలంగాణకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఐటీఐఆర్ ప్రాజెక్టులను సాధించుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
Also Read: ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!
కేటీఆర్, బీఆర్ఎస్ టార్గెట్‌గా విమర్శలు
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ‘గుండు సున్నా’ ఇచ్చి సరైన బుద్ధి చెప్పారని కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. కనీసం ఆ పార్టీకి ఉన్న రాజ్యసభ సభ్యులు కూడా పార్లమెంట్ సమావేశాలకు రావడం లేదని మండిపడ్డారు. కేటీఆర్, ఆయన కుటుంబ పాలనను ప్రజలు పదేళ్లు చూశారని, అప్పుడు చేయని పనులను ఇప్పుడు ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని పగటి కలలు కంటున్నారని, ఎక్కడ పడితే అక్కడ చౌరస్తాల్లో నిలబడి మాట్లాడటం ఆయన అలవాటుగా మారిందని ఘాటుగా విమర్శించారు.