Bhu Bharati: స్వేచ్చ బ్యూరో: వందేళ్ల నాటి నిజాం కాలపు రికార్డులు శిథిలావస్థకు చేరినందున, రైతులకు పక్కా భూ యాజమాన్య హక్కులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి డిజిటల్ రీసర్వేతో భూ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభిస్తుందని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కరీంనగర్ జిల్లా సహాయ సంచాలకులు (ఏడీ) కిషన్ రావు స్పష్టం చేశారు. మండల పరిధిలోని కాట్రపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ పెరుమాండ్ల హైమావతి-భిక్షపతి అధ్యక్షతన గురువారం భూభారతి రీసర్వేపై రైతులకు విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏడీ కిషన్ రావు మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తొలి విడతగా 70 గ్రామాలను నోటిఫై చేయగా, హుజూరాబాద్ మండలంలో ఇది రెండవ గ్రామసభ అని తెలిపారు. హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో ఇప్పటికే విజయవంతంగా సర్వే పూర్తయిందని వెల్లడించారు. 1920 నాటి సర్వే అండ్ బౌండరీస్ చట్టం ప్రకారం తయారైన నక్షాలు, సేత్వార్లు, టిప్పన్లు ప్రస్తుతం చిరిగిపోయే స్థితిలో ఉన్నందున క్షేత్రస్థాయిలో విస్తీర్ణాల తేడాలు వస్తున్నాయన్నారు. ఈ సమస్యలను అధిగమించడానికి సరికొత్త రోవర్ సాంకేతిక పరిజ్ఞానంతో అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా రీసర్వే చేపడుతున్నట్లు వివరించారు.
Also read: ఆరు ముఖాలు కలిగిన బొమ్మ..గాడ్ ఆఫ్ వార్ పై త్రివిక్రమ్ అప్డేట్!
కాట్రపల్లి పరిధిలో 1,283 ఎకరాల 8 గుంటల విస్తీర్ణంలో 337 సర్వే నంబర్లు, 845 ఖాతాలు ఉన్నాయని, రీసర్వే పూర్తయ్యేసరికి సుమారు వెయ్యి వరకు కొత్త సర్వే నంబర్లుగా మారే అవకాశం ఉందని తెలిపారు. తొలుత గ్రామ శివారు హద్దులు, ఆ తర్వాత 17 ప్రభుత్వ భూములకు సంబంధించిన 124 ఎకరాల 9 గుంటలు, మూడు శిఖం భూములకు చెందిన 25 ఎకరాల 24 గుంటలు, ఏడు ఎకరాల 13 గుంటల గ్రామకంఠం (ఆబాదీ) భూములను సర్వే చేస్తామని చెప్పారు. అనంతరం పట్టా భూముల కొలతలు చేపడతామని వెల్లడించారు. ఒక్కో యంత్రం ద్వారా రోజుకు 25 నుంచి 30 ఎకరాల చొప్పున కొలుస్తారని, క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో రైతులు తమ సరిహద్దుల వద్ద పక్క రైతులతో కలిసి హాజరై సరిహద్దులు చూపించాలని కోరారు.
సర్వే పూర్తయిన తర్వాత ప్రతి రైతుకు భూధార్ కార్డుతో పాటు క్యూఆర్ కోడ్‌తో కూడిన ల్యాండ్ పార్సెల్ మ్యాప్ (ఎల్‌పీఎం) జారీ చేస్తారని తెలిపారు. ఆధార్ తరహాలోనే భూధార్ కార్డు ద్వారా బ్యాంక్ రుణాలు, ఎరువులు, విత్తనాలు పొందడం సులభతరమవుతుందని, ఇతరులు కబ్జా చేయడానికి ఆస్కారం ఉండదని వివరించారు. క్షేత్రస్థాయి కొలతల్లో తేడాలు ఉంటే 9(2) నోటీసుల ద్వారా రైతులకు తెలియజేస్తామని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకోవడానికి 60 రోజుల గడువు ఉంటుందని స్పష్టం చేశారు. రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, అనుభవ వివరాలు, ఫోన్ నంబర్లను అధికారులకు సమర్పించి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ నరేందర్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే వెంకటరత్నం, మండల సర్వేయర్ వంశీ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఐ) లక్ష్మారెడ్డి, జీపీవో, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also read: తెలంగాణ యాంకర్ల పారితోషికం ఎంతో తెలుసా? ఒక్కొక్కరు ఎంత సంపాదిస్తున్నారంటే!