తెలంగాణ ప్రభుత్వం సినీ ప్రముఖులకు నిన్న గద్దర్ అవార్డులను ప్రదానం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై అవార్డులను అందుకున్నారు. అందులో దక్షిణాదికి చెందిన బడా హీరోలు, తారామణులు, నిర్మాతలు, దర్శకులు ఇతర నటీనటులు ఉన్నారు.హైదరాబాద్ హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తొలిసారి 2025 ఏడాదికి గాను గద్దర్ అవార్డులను ప్రదానం చేసింది.ఉమ్మడి ఏపీలో తెలుగు చిత్ర పరిశ్రమను గౌరవించుకోవాలని నాటి ప్రభుత్వాలు నంది అవార్డులను ప్రకటించేవి.చిత్ర పరిశ్రమ ద్వారా చాలా మందికి ఉపాధితో పాటు రాష్ట్రానికి ఆదాయం కూడా వచ్చేది.రాష్ట్ర అభివృద్ధిలో సినీ పరిశ్రమ భాగస్వామ్యం ఉన్నందున గత ప్రభుత్వాలు నంది అవార్డులతో వారిని సత్కరించేవి.
2025లో తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ఇవ్వాలని ప్రతిపాదన చేసింది.ప్రజాయుద్ధనౌక, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ గతేడాది అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.తెలంగాణ రాష్ట్రానికి గద్దర్ అందించిన సేవలకు గాను ఆయన త్యాగాలను స్మరించుకోవాలని రేవంత్ సర్కార్ ఆయన పేరిట సినీ రంగానికి అవార్డులను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది.అందుకు సినీ ప్రముఖుల నుంచి సైతం ప్రశంసలు వెల్లువెత్తాయి.ఈ క్రమంలోనే గతేడాది రాష్ట్ర ప్రభుత్వం వివిధ నామినేషన్ల వారీగా పురస్కారాలను ప్రకటించింది. వాటిని గురవారం సాయంత్రం సినీ ప్రముఖులకు అందజేసింది.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా హాజరై అవార్డులను అందజేశారు.
2014లో రెండు రాష్ట్రాల విభజన కారణంగా రెండేండ్ల పాటు విభజన ప్రక్రియ, ఆస్తులు, ఉద్యోగాల పంపకాల ప్రక్రియ సాగింది. ఆ తర్వాత 2017లో నాటి ప్రభుత్వం 2014-2016 సంవత్సరానికి గాను నంది అవార్డులను ప్రకటించింది. అయితే, ఈ అవార్డుల ప్రకటనలో రాజకీయ ప్రాధాన్యతలు, కులపరమైన వివక్షలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఉదా.. 2014 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడిగా నందమూరి బాలకృష్ణను ప్రకటించారు. అది కాస్త పెద్ద దుమారమే లేపింది. ఆయనకు అవార్డు ఎలా ఇస్తారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఇదే విషయాన్ని నిన్న మెగాస్టార్ చిరంజీవి పరోక్షంగా ప్రస్తావించారు.
GHMC: మూడు కార్పొరేషన్లకు కొత్త బ్యాంక్ ఖాతాలు.. ప్రాపర్టీ ట్యాక్స్, లైసెన్స్ ఫీజులపై కొత్త విధానం
గద్దర్ అవార్డుల్లో భాగంగా చిరంజీవి ఎన్టీఆర్ లెజెండరీ అవార్డును సీఎం రేవంత్ చేతుల మీదుగా అందుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం సినీపరిశ్రమ బాగోగుల గురించి ఆలోచించడం, తమకు అందిస్తున్న సహాయ సహకారాలు బాగున్నాయని మెచ్చుకున్నారు. గ్లోబల్ వేదిక మీద సినీ పరిశ్రమ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించడం చాలా మంచి పరిణామమని కొనియాడారు. చిత్ర రంగంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం సానుకూల ధృక్పథంలో ఆలోచన చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇక గత ప్రభుత్వంలో నంది అవార్డుల విషయంలో కొంత తప్పులు జరిగాయని మెగాస్టార్ వ్యాఖ్యానించారు.గతంలో ప్రకటించిన నంది అవార్డుల విషయంలో రాజకీయ జోక్యం ఉందని టాలీవుడ్ ప్రముఖులు సైతం పరోక్షంగా విమర్శించిన విషయం తెలిసిందే. మొత్తానికి గత ప్రభుత్వం చేసిన తప్పులను చిరంజీవి మరోసారి గుర్తుచేయడంతో దీనిపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది.