GHMC: స్వేచ్ఛ, బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ప్రజలకు పౌర, అత్యవసర సేవలందిస్తున్న మూడు కార్పొరేషన్లలో కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు వచ్చే నెలలో కొత్త బ్యాంక్ ఖాతాలు సమకూరనున్నాయి. గత నవంబర్ 25వ తేదీన సర్కారు ఆదేశాల మేరకు కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీన ప్రక్రియ మొదలైన నాటి నుంచి మూడు కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత నుంచి నేటి వరకు ఈ మూడు కార్పొరేషన్ల ఆర్థిక లావాదేవీలు జీహెచ్ఎంసీ ఖాతా ద్వారానే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గత నెల 11వ తేదీన మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి హద్దులు నిర్ణయించిన నాటి నుంచి ఈ మూడు కార్పొరేషన్లలో విధులు నిర్వహిస్తున్న సుమారు మూడున్నర వేల మంది పర్మినెంట్ ఉద్యోగులతో పాటు మరో 20 వేల మంది ఔట్ సోర్స్ ఉద్యోగులకు జీతభత్యాలను కూడా జీహెచ్ఎంసీ ఖాతా నుంచే చెల్లిస్తున్నారు.
మూడు కార్పొరేషన్లు ఏర్పాటైన నాడే కొత్త కార్పొరేషన్లకు కొత్త బ్యాంకు ఖాతాల ప్రస్తావన వచ్చినా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు కేవలం నెలన్నర రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటం, జీహెచ్ఎంసీ పాత పరిధిలో అభివృద్ది కోసం చేసిన అప్పుల్లో ఇంకా మిగిలి ఉన్న రూ. 4786 కోట్ల అప్పును కూడా మూడు కార్పొరేషన్లకు పంచాల్సి ఉన్నందున సర్కారు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ ఖాతా నుంచే లావాదేవీలను కొనసాగిస్తున్నారు. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగిసినా, మార్చి, ఏప్రిల్ నెలల జీతాలను జీహెచ్ఎంసీ ఖాతా నుంచే చెల్లించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఏప్రిల్ మాసంలో ప్రాపర్టీ ట్యాక్స్ ను ముందస్తుగా వసూలు చేసుకునేందుకు చెల్ల్లింపు దారులకు అయిదు శాతం రాయితీనిస్తూ అమలు చేయనున్న ఎర్లీ బర్డ్ స్కీమ్ ను మరింత సమర్థవంతంగా అమలు చేసి, ట్యాక్స్ కలెక్షన్ తో భారీగా ఆదాయం వచ్చే అవకాశాలున్నందున, ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏప్రిల్ మాసం జీతాలను కూడా ఈ జీహెచ్ఎంసీ ఖాతా నుంచే చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జీహెచ్ఎంసీ బ్యాంక్ ఖాతా ఉంది. మిగిలిన సైబరాబాద్, మల్కాజ్ గిరి కార్పొరేషన్లు కూడా సర్కారు ఆదేశాల మేరకు జాతీయ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఖాతాలు తెరుస్తాయా? లేక ఇతర బ్యాంక్ లను సంప్రదిస్తాయా? అన్నది వేచి చూడాలి.
Also Read: Indian Railways: రైల్వేలో 5349 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే జాబ్
ముఖ్యంగా గత సంవత్సరం నవంబర్ 25న కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానయి సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసిన వెంటనే నవంబర్ నెల జీతాలను కూడా జీహెచ్ఎంసీ నుంచే చెల్లించారు. ఆ తర్వాత గత నెల 11న మూడు కార్పొరేషన్లు ఏర్పాటైనప్పటికీ, ఖాతాలు వేర్వేరుగా లేకుండానే ట్యాక్స్ కలెక్షన్, ప్లానింగ్ ఆదాయం, ఇతర ట్రేడ్ లైసెన్స్ ఛార్జీలు, అడ్వర్ టైజ్ మెంట్ ఆదాయం మొత్తాన్ని జీహెచ్ఎంసీ ఖాతాలోనే జమ చేస్తూ వస్తున్నారు. నవంబర్ నుంచి వచ్చే ఏప్రిల్ మాసం వరకు మొత్తం ఆరు నెలల జీతాల లెక్కలతో పాటు సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వచ్చిన భవన నిర్మాణ అనుమతులతో పాటు ఇతర ఆదాయ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఖాతాలు తెరిచిన తర్వాత లెక్కలు వేసి తేల్చనున్నట్లు తెలిసింది. దీనికి తోడు పాత జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ది పనుల కోసం చేసిన అప్పుల్లో ఇంకా మిగిలిన రూ. 4786 కోట్ల రీపేమెంట్ కోసం సర్కారు హామీ ఇచ్చినా, లెక్క పత్రాల కోసం ఈ అప్పులను కూడా మూడు కార్పొరేషన్లకు పంచనున్నట్లు తెలిసింది. మూడు కార్పొరేషన్ల పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వ భవనాలకు సర్కారు ఏళ్ల తరబడి ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలున్నందున, ఆ బకాయిలను అప్పులకు చెల్లించేందుకు సర్కారు అంగీకరించినట్లు తెలిసింది. అప్పులను పంచిన తర్వాత సర్కారు మూడు కార్పొరేషన్ల వారీగా వార్షిక బడ్జెట్ లను కేటాయించి, ఈ అప్పులను చెల్లించనున్నట్లు తెలిసింది.
రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో రూ. 10 వేల కోట్లను కేటాయించాలని పాత జీహెచ్ఎంసీ గతంలోనే సర్కారుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. కానీ ఆ తర్వాత పట్టణ స్థానిక సంస్థల విలీనం, గత నెల 11న మూడు కార్పొరేషన్ల ఏర్పాటు వంటి పరిణామాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ అభ్యర్థించిన రూ. 10 వేల కోట్లను కూడా మూడు కార్పొరేషన్లకు పంచనున్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ ఆర్జించిన రూ. 10 వేల కోట్లలో జీహెచ్ఎంసీకి రూ. 4 వేల కోట్లు, కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.3 వేల కోట్లు, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ కు మరో రూ.3 వేల కోట్లను కేటాయించే అవకాశమున్నట్లు తెలిసింది.
Also Read: Niharika Konidela: పవన్ కళ్యాణ్ నాగబాబుపై పొలిటికల్ ట్రోల్స్.. నిహారిక రియాక్షన్ ఇదే!