Congress Strategy: స్వేచ్చ బ్యూరో: ‘రెండోసారి ఎమ్మెల్యేలుగా ఎలా గెలవాలి’? అనే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలుగా గెలిచినోళ్లకు టీపీసీసీ ప్రత్యేక స్ట్రాటజీలు తయారు చేయనున్నది. రాజకీయాల్లో ఒకసారి గెలవడం ఒక ఎత్తయితే, గెలిచిన స్థానాన్ని నిలబెట్టుకుని రెండోసారి విజయం సాధించడం అంతకంటే పెద్ద సవాలే.ముఖ్యంగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన యువ ఎమ్మెల్యేలకు ఇది మరింత క్లిష్టమైన పరీక్ష. ఈ నేపథ్యంలోనే, తెలంగాణలో సుదీర్ఘ కాలం అధికారంలో ఉండటమే లక్ష్యంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక సరికొత్త, వ్యూహాత్మక అంతర్గత నిర్ణయాన్ని తీసుకుంది. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలను ‘నెక్స్ట్ జనరేషన్ లీడర్లు’గా తీర్చిదిద్దేందుకు, వారిని రెండోసారి గెలిపించేందుకు పార్టీలోని సీనియర్లతో ప్రత్యేక ట్రైనింగ్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది.మొదటిసారి గెలిచినప్పుడు ఉండే సానుకూల పవనాలు అంటే పార్టీ వేవ్ తో పాటు ఓటర్లలో ఉండే కొత్తదనం రెండోసారి ఎన్నికల నాటికి ఉండవనేది పార్టీ అభిప్రాయం . ఐదేళ్ల పాలనపై ప్రజల్లో కొంత వ్యతిరేకత , అసంతృప్తి వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని అధిగమించి మళ్లీ జెండా ఎగరేయాలంటే పక్కా క్షేత్రస్థాయి వ్యూహం అవసరం.ఈ నేపథ్యంలోనే టీపీసీసీ యువ ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా స్ట్రాటజీలు అందచేయాలని రూప కల్పన చేస్తున్నట్లు సమాచారం.
నియోజకవర్గంలో కేవలం పర్యటనలకే పరిమితం కాకుండా, ప్రతి గ్రామంలోనూ, ప్రతి డివిజన్‌లోనూ ప్రజలతో మమేకం అయ్యేలా ఆయా ఎమ్మెల్యేలపై పార్టీ ముఖ్యులు మరింత ఒత్తిడి తీసుకురానున్నారు. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటనలు కొనసాగేలా పార్టీ ప్రణాళికలు తయారు చేస్తుంది. ఇక ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే, ఎమ్మెల్యేగా తమకంటూ ఒక ప్రత్యేకమైన, క్లీన్ ఇమేజ్‌ను సొంతం చేసుకోవాలని పార్టీ సూచించింది. మరోవైపు ఐదేళ్ల కాలంలో తమపై లేదా ఆయా ఎమ్మెల్యేల అనుచరులపై వచ్చే చిన్న చిన్న అసంతృప్తులను ముందే పసిగట్టి, ఎన్నికల నాటికి వాటిని చక్కదిద్దుకోవాలని పార్టీ కోరింది. దీనిలో భాగంగానే సీనియర్ల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకోనున్నారు. రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ నేతలకు నియోజకవర్గాలను ఎలా మేనేజ్ చేయాలి? సంక్షోభ సమయాల్లో ఎలా వ్యవహరించాలి? అనే అంశాలు బాగా తెలుసు. ఈ నేపథ్యంలోనే ఐదారు సార్లు గెలిచిన సీనియర్ మంత్రులు, సీనియర్ లీడర్లతో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలని టీపీసీసీ భావిస్తున్నట్లు తెలిసింది.
Also read: కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో భేటీ సీఎం రేవంత్‌రెడ్డి.. జూన్ సెకండ్ వీక్‌లో కేబినెట్ విస్తరణకు అవకాశం
ఎమ్మెల్యేలుగా గెలవాలంటే తప్పనిసరిగా ఎన్నికల మేనేజ్‌మెంట్ అవసరం. దీంతో బూత్ స్థాయి నెట్‌వర్క్‌ను ఎలా బలోపేతం చేయాలి? ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలి? అనే అంశాలను పార్టీ వివరించనున్నది. దీంతో పాటు ప్రజాపరిష్కారాలపై కూడా ఫోకస్ పెట్టాలని సూచించనున్నది. ప్రధానంగా సచివాలయం, కలెక్టరేట్ స్థాయిలో ఫైళ్లను ఎలా కదిలించాలి? నియోజకవర్గానికి ఎక్కువ నిధులు ఎలా రాబట్టాలి? అనే అంశాలపై కూడా బ్రీపింగ్ ఇవ్వనున్నారు. దీంతో పాటు విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ, తాము చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి డిజిటల్ రూపంలో ఎలా తీసుకెళ్లాలి? అనే దానిపై స్పష్టమైన ప్లాన్ ను పార్టీ తెలియజేయనున్నది. వాస్తవానికి గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొందరు కొత్త ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల తదుపరి ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ తప్పులు మళ్లీ పునరావృతం కాకూడదనేదే ఈ అంతర్గత నిర్ణయం ముఖ్య ఉద్దేశం.ప్రభుత్వ పథకాలు ఎంత బాగున్నా, ఎమ్మెల్యే వ్యక్తిగత ప్రవర్తన, లభ్యత సరిగ్గా లేకపోతే ఓటర్లు తిరస్కరిస్తారని పార్టీ నమ్ముతోంది. అందుకే గ్రూపు రాజకీయాలకు తావులేకుండా, క్యాడర్‌ను ఎలా కలుపుకుపోవాలో ఈ శిక్షణలో సీనియర్లు క్లాస్ తీసుకోనున్నారు.
కాంగ్రెస్ పార్టీ కేవలం ఈ ఐదేళ్ల పాలన కోసమే కాకుండా, రాష్ట్రంలో సుదీర్ఘ కాలం అధికారంలో ఉండాలని టార్గెట్‌గా పెట్టుకుంది.మినిమం పదేళ్ల పాటు సంపూర్ణంగా ఉండాలని టార్గెట్ పెట్టుకున్నది. దీంతో భవిష్యత్తులో పార్టీని నడిపించేది, కాపాడేది ఇప్పుడున్న యువ ఎమ్మెల్యేలే అని పార్టీ బలంగా నమ్ముతుంది. ఈ నేపథ్యంలోనే యువతతో కనెక్ట్ కావడం రాష్ట్రంలోని మెజారిటీ ఓటర్లయిన యువత, నిరుద్యోగులతో నిరంతరం టచ్‌లో ఉండాలని యువ ఎమ్మెల్యేలకు పార్టీ ఆదేశించింది. నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగేలా పట్టు సాధించడం వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నది. యువ ఎమ్మెల్యేలు రెండోసారి కూడా భారీ మెజారిటీతో గెలిస్తే, అది పార్టీకి తిరుగులేని బలాన్ని ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ విజయకేతనానికి ఈ ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలే పునాది కానున్నారు.దీంతోనే ఈ అంశంపై సీరియస్ గా దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు ద్వారా తెలిసింది.
Also Read: స్నానం చేసేటప్పుడు జుట్టురాలిపోతోందా? నువ్వుల నూనెలో ఈ ఒక్కటి కలిపి పట్టిస్తే జుట్టుకి ఎంతో బలం