Gazette Notification : నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ రోజు ఉదయం 11 గంటల లోపు నోటిఫికేషన్ వెలువడనుండగా.. 11 గంటల నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. నోటిఫికేషన్‌కు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత 119 నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు నామినేషన్లు స్వీకరిస్తారు.
నవంబర్ 3 నుంచి 10 వరకు అభ్యర్థులు ప్రతి రోజూ ఉదయం 11 నుంచి.. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన ఉండగా.. 15వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. నవంబర్ 30న పొలింగ్ నిర్వహించి, డిసెంబర్ 3న ఓట్లలెక్కింపు చేపడుతారు. డిసెంబర్ 5లోపు ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తారు.
ఈసారి అభ్యర్థులు నామినేషన్లను ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని ఈసీ అధికారులు తెలిపారు. ఈసీ అందుబాటులోకి తీసుకొచ్చిన సువిధ పోర్టల్ ద్వారా ఆ సదుపాయం ఉందని.. అయితే ఆన్‌లైన్‌లో నామినేషన్ సమర్పించినా అభ్యర్థి ఆ ప్రతిపై సంతకంచేసి నిర్ధిష్ట గడువులోగా రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉంటుంది.
ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుండగా.. ఇంకా అన్ని పార్టీలు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. బీఆర్ఎస్ గోషామహల్, నాంపల్లి సీట్లను ఖరారు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా వంద సీట్లకే అభ్యర్థులను అనౌన్స్ చేసింది. ఇంకో 19 నియోజకవర్గాలపై కసరత్తు కొనసాగుతున్నది. బీజేపీ 88 మందిని, బీఎస్పీ 63 మందిని ప్రకటించాయి.
మరోవైపు ఎన్నికలు జరగనున్న మిజోరం, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ముగియగా.. రాజస్థాన్‌లో ఈ నెల ఏడుతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. చత్తీస్‌గడ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 7న చత్తీస్‌గఢ్ మొదటి విడత, మిజోరంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక నవంబర్ 17న చత్తీస్‌గడ్ రెండో విడత.. మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న రాజస్థాన్, నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి.