Blood Flow ECMO: అవయవ దానికి మరణం తర్వాత కొన్ని గంటలు చాలా కీలకం. నిర్ణీత సమయంలోగా అవయవాలను భద్రపరచకపోతే అవి చెడిపోతాయి. దిల్లీలోని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు నార్మోథెర్మిక్ రీజినల్ పెర్ఫ్యూజన్ అనే వైద్య ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. ఈ వైద్య ప్రక్రియ ద్వారా మరణించిన వారి అవయవాలను కొన్ని గంటల పాటు సురక్షితంగా ఉంచి అవయవదానానికి ఉపయోగించవచ్చు.
న్యూ దిల్లీ ద్వారకలోని HCMCT మణిపాల్ హాస్పిటల్ వైద్యులు.. మహిళ మరణం తర్వాత గుండె, ఊపిరితిత్తులను సురక్షితంగా ఉంచగలిగారు. వాటితో విజయవంతంగా అవయవ మార్పిడి సాధ్యమైంది. ఆసియాలోనే తొలిసారిగా ఈ తరహా వైద్య ప్రక్రియకు మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ చైర్మన్ డాక్టర్ శ్రీకాంత్ శ్రీనివాసన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నార్మోథెర్మిక్ రీజినల్ పెర్ఫ్యూజన్ (NRP) అనే సాంకేతికతతో మరణం తర్వాత రోగి అవయవాలకు రక్త ప్రసరణను పునరుద్ధరిస్తారు.
దిల్లీకి చెందిన 55 ఏళ్ల గీతా చావ్లా మోటార్ న్యూరాన్ వ్యాధి కారణంగా పక్షవాతానికి గురై నవంబర్ 5న శ్వాస సమస్యతో మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. మరుసటి రోజు సాయంత్రం ఆమె మరణించింది. ఆమె అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఆసుపత్రి వైద్యులు ఎన్ఆర్పీ ప్రక్రియను ప్రారంభించారు.
ఆసియాలో తొలిసారిగా వైద్యులు ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేటర్ (ECMO) ఉపయోగించి మరణించిన మహిళ శరీరంలో రక్త ప్రసరణను పునరుద్ధరించారు. దీంతో ఆమె అవయవాలు దాదాపు నాలుగు గంటల పాటు సజీవంగా ఉన్నాయి. ఈ సమయం నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (NOTTO)తో సమన్వయం చేసుకోవడానికి సహాయపడింది.
గీతా చావ్లా లివర్ ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ లో 48 ఏళ్ల వ్యక్తికి అమర్చారు. ఆమె కిడ్నీలను సాకేత్‌లోని మాక్స్ హాస్పిటల్‌లో 63 ఏళ్ల, 58 ఏళ్ల కిడ్నీ బాధితులకు అమర్చారు. గీతా చావ్లా కార్నియా, చర్మాన్ని కూడా దానం చేశారు. ఇవి ఎంతో మందికి ఉపయోగపడనున్నాయి.
భారత్ లో ఆర్గాన్ డొనేషన్ బ్రెయిన్ డెడ్ అయిన సందర్భాల్లో గుండె కొట్టుకుంటుండగానే పూర్తి చేస్తారని డాక్టర్ శ్రీనివాసన్ తెలిపారు. సర్క్యులేటరీ డెత్ తర్వాత గుండె ఆగిపోయిన వెంటనే వైద్యులు చర్యలు తీసుకోవాలి. NRPతో అవయవాలను సజీవంగా ఉంచేందుకు, విజయవంతంగా అవయవ మార్పిడి చేయడానికి ఈ ప్రక్రియను ఉపయోగిస్తున్నామన్నారు.
Also Read: Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం
2024లో మన దేశంలో 1,128 మంది బ్రెయిన్ డెడ్ సందర్భాల్లో అవయవదానం చేశారని వైద్యులు తెలిపారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదో స్థానంలో ఉందని అన్నారు. భారత్ లో అవయవదానాలను పెంచేందుకు హైబ్రిడ్ ECMO, ఎన్ఆర్పీ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 1.8 లక్షల మంది మూత్రపిండాల వైఫల్యంతో చికిత్స పొందుతున్నారు. కానీ 2023లో 13,426 కిడ్నీల మార్పిడి మాత్రమే జరిగాయి. ఏటా 25–30 వేల కాలేయ మార్పిడి అవసరమవుతున్నా.. గత ఏడాది కేవలం 4,491 కాలేయ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి.