Cold Wave Alert: తెలంగాణలో ఈ ఏడాది శీతాకాలం కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, ఇప్పుడు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చనుంది. రాష్ట్ర ప్రజలకు చలి హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. రాబోయే 8 నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో చలి తీవ్రత గణనీయంగా పెరగనుందని పేర్కొంది. నవంబర్ 11 నుంచి 19 వరకు తీవ్రమైన చలి వాతావరణం నెలకొంటుందని, నవంబర్ 13 నుంచి 17 మధ్య కాలంలో చలి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు. నవంబర్ నెలలో ఇంత సుదీర్ఘకాలం పాటు తీవ్రమైన చలిగాలులు వీయడం అరుదని నిపుణులు పేర్కొంటున్నారు.
వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం, ఈ చలి ప్రభావం ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాలపై ఎక్కువగా ఉండనుంది. ఆదిలాబాద్, కొమురం భీమ్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు (10°C కంటే తక్కువకు) పడిపోయే అవకాశం ఉంది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ నగరం సహా మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉదయం ఉష్ణోగ్రతలు 11°C నుండి 14°C మధ్య నమోదవుతాయి. ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దులో ఉన్న దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు చలి (14°C-17°C) ఉండే అవకాశం ఉంది.
తీవ్ర చలి నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. వెచ్చని దుస్తులు, స్వెటర్లు, దుప్పట్లు సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, నిరాశ్రయుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తెల్లవారుజామున, రాత్రి సమయాల్లో అనవసరంగా బయట తిరగకపోవడం మంచిది. రైతులు తమ పశు సంపదను చలి నుండి రక్షించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ 10 రోజుల చలి కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే నెలల్లో (డిసెంబర్, జనవరి) శీతాకాలం మరింత తీవ్రంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నవంబర్ స్పెల్, రాబోయే శీతాకాల తీవ్రతకు సూచనగా భావించి, ప్రజలు మానసికంగా సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.
చలికాలం ఎందుకు ఆలస్యమైంది..
ఈ ఏడాది (2025) తెలంగాణతో సహా దక్షిణ, మధ్య భారతదేశంలో శీతాకాలం ఆరంభం కాస్త ఆలస్యమైంది. సాధారణంగా అక్టోబర్ చివరి నాటికి మొదలయ్యే చలి, నవంబర్ మొదటి వారం వరకు కూడా పూర్తిస్థాయిలో రాలేదు. ఈ ఏడాది (2025) శీతాకాలం ఆలస్యం కావడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి, రుతుపవనాల తిరోగమనం ఆలస్యమై గాలిలో తేమ పెరగడం. ఇది రాత్రిపూట వేడి తగ్గకుండా అడ్డుకుంది. రెండు, ఉత్తరం నుండి చల్లని, పొడి గాలులను తీసుకువచ్చే “పశ్చిమ కల్లోలాలు” చురుకుగా లేకపోవడం. ఈ కారణాల వల్లే నవంబర్ ఆరంభంలో చలి ప్రభావం కనిపించలేదు.