CM Chandra Babu: తాజాగా టీడీపీకి చెందిన 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు క్రమశిక్షణ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నిసార్లు చెప్పినా కొందరు తీరు మార్చుకోకపోవడం, ప్రజలతో మమేకమయ్యేందుకు అవకాశమున్న కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమాల్లో ఇకపై ఎవరైనా పాల్గొనకపోతే వెంటనే తన దృష్టికి తేవాలని, అలాంటి ఎమ్మెల్యేల పై చర్యలకు వెనకాడబోమని చంద్రబాబు హెచ్చరించారు.
పింఛన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, కార్యకర్తల కుటుంబాలకు బీమా సొమ్ము పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ కార్యకర్తల బీమా లేఖలు ఇంకా అందజేయని శాసనసభ్యుల వివరాలు తనకు ఇవ్వాలని, పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి తాను క్రమం తప్పకుండా హాజరవుతున్నానని, అయినా పలువురు ఎమ్మెల్యేలు ఆయా కార్యక్రమాలకు గైర్హాజరు అవుతుండటంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా నాయకులూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయ కులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోనని హెచ్చరించారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న పార్టీ శ్రేణులను పక్కనబెట్టి కొత్తగా వైసీపీ నుండి వచ్చిన వారికి కొందరు ఎమ్మెల్యేలు ప్రాధాన్యత ఇస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నానని, సీనియర్లను, పార్టీ శ్రేణులను పక్కనబెట్టి కొత్తగా బయట నుంచి వచ్చిన వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని మండిపడ్డారు. ఎమ్మెల్యేలకు నచ్చిన కార్యకర్తలే కాకుండా పార్టీలోని సీనియర్స్‌ను కూడా కలుపుకొని పోవాలని సూచించారు. ప్రతి రోజు కార్యాచరణను అమలు చేసి, వారానికోసారి విశ్లేషించి, నెలకోసారి సమీక్షించి, ప్రజల అభిప్రాయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నానని, ప్రతిఒక్కరి పనితీరుకు సంబంధించిన సమాచారం తన వద్ద ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి అనూహ్య స్పందన, విశేష ఆదరణ లభించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి ప్రతి నాయకుడు ప్రత్యేక సమయం కేటాయించాలని కోరారు. ఇక నుండి ప్రతి ప్రజాప్రతినిధి వారంలో ఒకరోజు ఖచ్చితంగా ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి ప్రత్యక్షంగా అర్జీలు స్వీకరించాలని సూచించారు.
అర్జీల పరిష్కారాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించుకోవాలని ప్రజప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లాకు నియమించిన ఇంఛార్జి మంత్రులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న గ్రీవెన్స్ వివరాలను తెప్పించుకొని జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని సమస్యల పరిష్కారం వేగవంతం చేయాలని ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయిలో, అక్కడా పరిష్కారం చూపకపోతే రాష్ట్ర స్థాయిలో పరిష్కారం చూపించే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని గుర్తు చేశారు.
పార్టీ నేతలు జవాబుదారీతనంతో వ్యవహరిస్తే ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం రెట్టింపు అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం గ్రామ, వార్డు స్థాయిలో పార్టీ శ్రేణులను చైతన్యం చేయడంపై నాయకులు దృష్టి సారించాలని కోరారు. కూటమి నాయకులతో సమన్వయం, పార్టీలో క్రమశిక్షణ, సేవా దృక్పథంతో వ్యవహరించడం ద్వారా ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని మరింత బలపరచాలని సూచించారు.
వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం వల్ల పేదలకు నాణ్యమైన వైద్యం అందడంతో పాటు పేద విద్యార్ధులకు మెరుగైన విద్య అందుతుందన్నారు. శరవేగంగా మెడికల్ కాలేజీలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అసత్యాలతో అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొంథా తుఫాను సమయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు, ప్రజలకు అండగా నిలబడితే జగన్మోహన్ రెడ్డి విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
Story by Apparao, Big Tv