Underground Cabling: స్వేచ్చ బ్యూరో: హైదరాబాద్ నగర విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధునికీకరించే లక్ష్యంతో చేపట్టిన అండర్‌గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీఎస్పీడీసీఎల్) లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ మెట్రో జోన్ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో ఓవర్‌హెడ్ విద్యుత్ లైన్ల స్థానంలో భూగర్భ కేబుళ్లను ఏర్పాటు చేయాలని టీజీఎస్పీడీసీఎల్ ప్రణాళిక రూపొందించింది. భారీ స్థాయిలో చేపట్టనున్న ఈ పనులకు సంబంధించి ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్లు ఆహ్వానించింది. సుమారు రూ.5,756 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈనెల 12 నాటికి టెండర్ల సమర్పణ గడువు ముగియడంతో తదుపరి ప్రక్రియపై అధికారులు దృష్టిసారించారు. 35కు పైగా సంస్థలు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. కాగా వచ్చిన బిడ్లకు సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్, అర్హతల ధృవీకరణ ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
టెండర్లలో పాల్గొన్న సంస్థలు సమర్పించిన సాంకేతిక, ఆర్థిక అర్హత పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో ఇలాంటి విద్యుత్ మౌలిక సదుపాయాల పనులు చేపట్టిన అనుభవం, ఆర్థిక సామర్థ్యం, అవసరమైన సాంకేతిక వనరులు, టెండరు నిబంధనల అనుసరణ వంటి అంశాలను పరిశీలించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం అర్హత సాధించిన సంస్థల బిడ్లపై తదుపరి చర్యలు చేపట్టనున్నారు. అయితే సంస్థల సంఖ్య, అర్హత సాధించిన బిడ్డర్ల వివరాలు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కింద 33 కేవీ, 11 కేవీ, లోటెన్షన్(ఎల్టీ) విద్యుత్ కేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టు ప్రణాళిక ప్రకారం 33 కేవీ కేబుళ్లు సుమారు 311 కిలోమీటర్లు, 11 కేవీ కేబుళ్లు 5,772 కిలోమీటర్లు, ఎల్టీ భూగర్భ కేబుళ్లు 1,718 కిలోమీటర్ల మేర వేయనున్నారు. అదనంగా 6,251 కిలోమీటర్ల మేర ఎల్టీ ఏరియల్ బంచ్డ్(ఏబీ) కేబుళ్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మొత్తం 11 డివిజన్ల పరిధిలోని సుమారు 136 విద్యుత్ ఉపకేంద్రాలకు ఈ ప్రాజెక్టు ప్రయోజనం చేకూరనుంది.
విద్యుత్ పంపిణీలో రింగ్ మెయిన్ నెట్వర్క్ వ్యవస్థ కీలకంగా పనిచేయనుంది. ఒక మార్గంలో సాంకేతిక లోపం ఏర్పడినా ప్రత్యామ్నాయ మార్గం ద్వారా సరఫరాను కొనసాగించే అవకాశం ఉంటుంది. దీంతో అంతరాయాల వ్యవధిని తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. అలాగే స్కాడా సాంకేతికతతో కూడిన రింగ్ మెయిన్ యూనిట్ల(ఆర్ఎంయూ) ద్వారా నెట్‌వర్క్‌ను దూరం నుంచే పర్యవేక్షించడం, నియంత్రించడం సాధ్యమవుతుంది. లోపాలను వేగంగా గుర్తించి మరమ్మతు చర్యలు చేపట్టేందుకు ఈ వ్యవస్థ దోహదపడనుంది. ప్రాజెక్టులో భాగంగా సుమారు 4,555 స్కాడా ఆధారిత ఆర్ఎంయూలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటిలో 33 కేవీ స్థాయిలో 210, 11 కేవీ స్థాయిలో 4,345 యూనిట్లు ఉంటాయి. అదనంగా 11 కేవీ స్థాయిలో 9,946 కాంపాక్ట్ ఆర్‌ఎంయూల ఏర్పాటును ప్రణాళికలో చేర్చారు.
Also read: వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!
ప్రస్తుతం విద్యుత్ తీగలపై చెట్లు పడటం, బలమైన గాలులు వీయడం, వర్షాల సమయంలో లైన్లు దెబ్బతినడం వంటి కారణాలతో సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. భూగర్భ కేబులింగ్ ద్వారా ఇలాంటి బాహ్య కారణాల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే భూగర్భ కేబుళ్లలో లోపాలు తలెత్తినప్పుడు వాటిని గుర్తించి మరమ్మతు చేయడానికి ప్రత్యేక సాంకేతిక చర్యలు అవసరమవుతాయి. భూగర్భ కేబుళ్ల ఏర్పాటుతో పాటు రహదారుల పునరుద్ధరణ, అవసరమైన చోట హారిజాంటల్ డైరెక్షనల్ డ్రిల్లింగ్ సాంకేతికత వినియోగం వంటి పనులు కూడా చేపట్టాల్సి ఉంటుంది.
ప్రాజెక్టు వ్యయంపై రూపొందించిన వివరాల ప్రకారం, తొలుత రూ.4,051 కోట్లకు పరిపాలనా అనుమతి లభించింది. నవంబర్ 2025 ప్రకారం అప్పటి షెడ్యూల్ ఆఫ్ రేట్స్(ఎస్ఎస్ఆర్) ఆధారంగా ఈ ప్రాథమిక అంచనాను రూపొందించారు. అనంతరం రూట్వారీ సర్వేలు, క్షేత్రస్థాయి పరిశీలనలు, తాజా మార్కెట్ ధరలు, సాంకేతిక అవసరాలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) అంచనాను రూ.5,756 కోట్లుగా రూపొందించినట్లు టీజీఎస్పీడీసీఎల్ తెలిపింది. తాజా 2026-27 షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ప్రకారం డీపీఆర్‌ను సిద్ధం చేసినట్లు వివరించింది. కేబుళ్లు, లోహ పదార్థాల ధరల మార్పులు, తవ్వకాలు, కేబుల్ వేయడం, జాయింటింగ్, ఆర్‌ఎంయూల ఏర్పాటు, ఎస్సీఏడీఏ కమ్యూనికేషన్ వ్యవస్థల అమలు వంటి అంశాలను వ్యయ అంచనాలో పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది. అలాగే తవ్విన రహదారులను పునరుద్ధరించడం, రోడ్లకు నష్టం తగ్గించేందుకు హారిజాంటల్ డైరెక్షనల్ డ్రిల్లింగ్(హెచ్డీడీ) సాంకేతికతను వినియోగించడం, సామగ్రి రవాణా, నిల్వ, బీమా, భద్రతా ఏర్పాట్లకు నిధులు కేటాయించినట్లు తెలిపింది. క్షేత్రస్థాయి అవసరాల మేరకు అదనపు ఎల్టీ ఏబీ కేబుళ్లను కూడా ప్రణాళికలో చేర్చినట్లు వివరించింది.
నగర విస్తరణ, మెట్రో రైలు అభివృద్ధి, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు టీజీఎస్పీడీసీఎల్ తెలిపింది. భూగర్భ కేబుళ్లు, ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థలు, ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా మార్గాల ద్వారా నగర విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌ను మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టు పూర్తయితే విద్యుత్ అంతరాయాల ప్రభావం తగ్గడం, ప్రజల భద్రత మెరుగుపడటం, వీధుల్లో విద్యుత్ తీగల రద్దీ తగ్గడం వంటి ప్రయోజనాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రాజెక్టు లక్ష్యాలు ఆచరణలో ఎంతవరకు నెరవేరుతాయన్నది పనుల నాణ్యత, అమలు వేగం, నిర్వహణ సామర్థ్యంపై ఆధారపడి ఉండనుంది. కాగా టెండర్ల పరిశీలన, కాంట్రాక్టుల ఖరారు, పనుల ప్రారంభం అనంతరం నిర్ణీత గడువులో ప్రాజెక్టును పూర్తి చేయడం సంస్థకు కీలకం కానుంది.
Also read: ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!