Four Bin System: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ప్రతి రోజూ పోగయ్యే సుమారు పది వేల మెట్రిక్ టన్నుల చెత్తను సిటీలోని జనవాసాల మధ్య నుంచి విలైనంత త్వరగా ట్రాన్స్ ఫర్ స్టేషన్ కు అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు తరలించటంతో పాటు చెత్త ఉత్పత్తి అయ్యే దశలోనే తడి, పొడి, శానిటరీ, హజర్డ్ చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసేందుకు వీలుగా ప్రతి ఇంట్లో నాలుగు బిన్ల వినియోగాన్ని మస్టుగా అమలు చేసేందుకు మూడు కార్పొరేషన్లు రంగం సిద్దం చేస్తున్నాయి. ఇప్పటికే పాత జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాలవాసులకు తడి, పొడి చెత్తపై పూర్తిగా అవగాహన కల్గి ఉన్నా, వీటికి తోడు శానిటరీ, హజర్డ్ వ్యర్థాలను ఎలా వేరు చేయాలన్న విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని మున్సిపల్ కార్పొరేషన్లు భావిస్తున్నాయి. వీటిలో హజర్డ్ చెత్తను వేరు చేయట, దానికి కేటాయించిన బిన్ లో వేసే ప్రక్రియ చాలా జాగ్రత్తగా చేపట్టాల్సి ఉన్నందున, దీనిపై క్షేత్ర స్థాయిలో పూర్తి అవగాహన అవసరమని అధికారులంటున్నారు.
పదేళ్ల క్రితం అప్పటి జీహెచ్ఎంసీ పరిధిలో సమగ్ర కటుంబ సర్వే ప్రకారం గుర్తించిన సుమారు 22 లక్షల గృహా సముదాయాల్లోని చెత్తను ఇంట్లోనే తడి, పొడి చెత్తగా వేర్వేరు చేసేందుకు వీలుగా జీహెచ్ఎంసీ రెండు రకాల బిన్లను ఉచితంగా అందించింది. కానీ ప్రస్తుతం ప్రతి ఇంట్లో చెత్త ఉత్పత్తి అవుతున్న ప్రాంతంలోనే రెండు రకాలుగా కాకుండా నాలుగు రకాలుగా చెత్తను వేరు చేసుకునేందుకు వీలుగా ప్రతి కుటుంబం నాలుగు రకాల డస్ట్ బిన్లను సొంతగా సమకూర్చుకోవాలని త్వరలోనే మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఆదేశాలు జారీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో జీహెచ్ఎంసీ ఉచితంగా పంపిణీ చేసిన ఈ రెండు బిన్లను చాలా మంది చెత్త కు కాకుండా ఇతర అవసరాల కోసం వినియోగిస్తూ, చెత్తను ప్లాస్టిక్ కవర్లలో స్వచ్ఛ ఆటో టిప్పర్ డ్రైవర్లకు ఇవ్వటం వంటి పరిణామాలతో ఈ సారి నాలుగు రకాల బిన్లు ప్రజలే తమ సొంత ఖర్చుతో సమకూర్చుకుంటే పూర్తి స్థాయిలో సద్వినియోగమవుతుందని అధికారులు భావిస్తున్నారు.
Also read: ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు షాకింగ్ న్యూస్.. చిక్కుల్లో వెబ్ సైట్..?
మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో నాలుగు రకాలుగా చెత్తను వేరు చేసే అంశంపై నిరక్ష్యరాస్యులకు సైతం అర్థమయ్యేలా బిన్లపై చిత్రాలను ఏర్పాటు చేయనున్నారు. త్వరలో మల్కాజ్ గిరి లోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న ఈ నాలుగు బిన్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి చదువులే ని వారికి సైతం ఏ రకం చెత్త ఏ బిన్ లో వేయాలన్న విషయం స్పష్టంగా తెలిసేలా బిన్లపై చిత్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఇంట్లో నాలుగు రకాలుగా చెత్తను వేరు చేసే విధానాన్ని తప్పకుండా అమలు చేయాలని, వచ్చే మార్చి నెలాఖరుకల్లా దేశంలోని అన్ని మహానగరాలు, పట్టణాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని సుప్రీం కోర్టు గడువు కూడా విధించిన నేపథ్యంలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు మూడు మున్సిపల్ కార్పొరేన్లు వేర్వేరుగా వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. వచ్చే మార్చి నెలాఖరు తర్వాత దేశ వ్యాప్తంగా అన్ని మహానగరాలు, పట్టణాల్లో నాలుగు బిన్ల విధానం సక్రమంగా అమలు కాని పక్షంలో సుప్రీం కోర్టు నేరుగా కార్పొరేషన్లకు పెనాల్టీలను విధించే అవకాశమున్నట్లు సమాచారం.
చెత్తను నాలుగురకాలుగా వేరు చేసేందుకు వీలుగా నాలుగు బిన్లను అమలు చేయటంలో మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ వేగంగా అడుగులు వేస్తుంది. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 490 ప్లేస్ లలో ఈ నాలుగు బిన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు, వీటిలో తొలుత 190 పబ్లిక్ ప్లేస్ లలో వీటిని ఏర్పాటు చేసి, వాటిని చూపుతూ, కరపత్రాలను ముద్రించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు మల్కాజ్ గిరి మున్సిపల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి స్వేచ్ఛతో చెప్పారు. పబ్లిక్ ప్లేస్ లలో వీటి వినియోగాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూనే మిగిలిన మరో 300 ప్రాంతాల్లో కూడా ఈ నాలుగు బిన్లను ఏర్పాటు చేసి, పక్కాగా అమలయ్యే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు కమిషనర్ తెలిపారు. ముఖ్యంగా చదువుకున్న వారు నాలుగురకాలుగా చెత్తను వేరు చేసి ఎందులో ఏ రకమైన చెత్తను వేయాలో అవగాహన ఉంటుంది. కానీ నిరక్షరాస్యులు ఈ బిన్లను వినియోగించుకుంటున్న తీరును క్షేత్ర స్థాయి పరిశీలించి, వారిలో నూటికి నూరు శాతం అవగాహన కల్పించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
Also read: భర్తనే నమ్మలేని పరిస్థితి… అమెరికా రాజకీయాల్లో మరో భారీ కుట్ర… ఓటీటీలో తాజా సీజన్ రచ్చ