Illegal Grounds: స్వేచ్ఛ బ్యూరో: నాలా కన్వర్షన్ లేదు.. ట్రేడ్ లైసెన్స్ లేదు. అయినా క్రికెట్ గ్రౌండ్లను కట్టేస్తున్నారు. వ్యవసాయ భూమిలో వాణిజ్య కట్టడాలు కట్టాలంటే నాలా కన్వర్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రేడ్ లైసెన్స్ విధిగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ లేకుండానే దర్జాగా క్రికెట్ గ్రౌండ్లను కడుతూ ప్రభుత్వ ఆదాయానికి కొందరు గండి కొడుతున్నారు. ఇదేమిటి అని ప్రశ్నిస్తే మీరు ఏం రాసుకుంటారో రాసుకోండి మా ఇష్టం అంటూ సమాధానం వస్తుంది.
మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ పరిధి శ్రీరంగవరంలో ఎలాంటి అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా క్రికెట్ గ్రౌండ్లు వెలుస్తున్నాయి. వ్యవసాయ భూమిలో క్రికెట్ గ్రౌండ్లను ఏర్పాటు చేస్తూ క్రికెట్ క్రీడాకారులకు అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకోవడం ప్రస్తుతం ట్రెండ్ గా మారింది. ఇందులో భాగంగా శ్రీరంగవరంలో సైతం సర్వే నెంబర్ 218 లో 5 ఎకరాల 4 గుంటల్లో క్రికెట్ గ్రౌండ్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా వ్యవసాయం స్థలంలో నిర్మాణం చేపడుతున్న క్రికెట్ గ్రౌండ్ కు నాలా కన్వర్షన్ చేసుకోలేదు.
కమర్షియల్ కోసం వాడే ఈ క్రికెట్ గ్రౌండ్ కు తప్పనిసరి ట్రేడ్ లైసెన్స్ అవసరం. కానీ ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండానే క్రికెట్ గ్రౌండ్ ని తయారు చేస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్ పొందాకే క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటుకు స్థానిక మున్సిపల్ నుండి అనుమతులు లభిస్తాయి. ట్రేడ్ లైసెన్స్ లేకపోవడం వల్ల ఇప్పటివరకు మున్సిపల్ నుండి ఎలాంటి అనుమతులు లభించలేదని తెలుస్తుంది. అయినా క్రికెట్ గ్రౌండ్ నిర్మాణం మాత్రం ఆగడం లేదు.
Also Read: డేంజర్ బెల్స్.. రాష్ట్రంలో తగ్గుతున్న భూగర్భ జలాలు
ప్రస్తుతం నిర్మాణం చేపడుతున్న క్రికెట్ గ్రౌండ్ స్థలానికి రైతుబంధు నిధులు సైతం విడుదల అయినట్లు తెలుస్తోంది. రైతుబంధు నిధులను తీసుకుంటూ ఆ స్థలాన్ని కమర్షియల్ కోసం వినియోగించడం నేరమంటూ అధికారులు పేర్కొంటున్నారు.
శ్రీరంగవరంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న రెండు క్రికెట్ గ్రౌండ్ల ను ఆ గ్రామ కార్యదర్శి రవీందర్ రెడ్డి అడ్డుకున్నారు. నాలా కన్వర్షన్, ట్రేడ్ లైసెన్స్ పొందాకే క్రికెట్ గ్రౌండ్లను నిర్మించాలి అంటూ గ్రౌండ్ నిర్మాణ పనులను కార్యదర్శి రవీందర్ రెడ్డి అడ్డుకున్నారు.
Also Read: దేశంలో ప్రభుత్వ బస్సులు లేని రాష్ట్రాలు ఇవే.. అంతా ప్రైవేట్ చేతుల్లోనే ప్రజారవాణా..!