Big Stories

Bandi Sanjay: బండి డైరెక్షన్ లో ఈడీ, సీబీఐ?.. ఆయన చెప్పినట్టే జరుగుతోందేంటి?

Bandi Sanjay: తెలంగాణలో ఆసక్తికర పరిణామం జరుగుతోంది. కేసీఆర్ సర్కారును జాతీయ దర్యాప్తు సంస్థలు మాగ్జిమమ్ కార్నర్ చేస్తున్నాయి. వరుసబెట్టి దాడులు జరుగుతున్నాయి. మంత్రులు, ఎంపీలు.. లేటెస్ట్ గా ఎమ్మెల్యేకూ ఈడీ నోటీసులు వచ్చాయి. దాడులన్నీ బీజేపీ ప్రేరేపిత ప్రతీకార చర్యలే అనేది టీఆర్ఎస్ విమర్శ. అధికార పార్టీ ఆరోపిస్తున్నట్టే.. బీజేపీ నేతలు మొదట వార్నింగులు ఇస్తున్నారు.. ఆ తర్వాత ఈడీ, ఐటీ, సీబీఐలు తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తున్నాయి.

- Advertisement -

ఢిల్లీలో లిక్కర్ స్కాం జరిగింది. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ స్కాం బయటికి వచ్చినప్పుడు సిసోడియా పేరు మాత్రమే తెర మీదకు వచ్చింది. కానీ, ఒక రోజు గడిచే సరికి.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు కవిత ఉందంటూ బండి సంజయ్ ప్రచారం మొదలుపెట్టేశారు. అదేంటి.. ఢిల్లీలో స్కాంకు కవితకు లింకేంటి? అనుకున్నారంతా. ఇది కేవలం రాజకీయ ఆరోపణ మాత్రమేనని భావించారు. కానీ, బండి సంజయ్ మాత్రం కవితపై కామెంట్లు ఆపలేదు. కట్ చేస్తే, నెల రోజుల తర్వాత బండి సంజయ్ అన్నట్టుగానే.. ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టులో కవిత పేరు కనిపించింది. సీబీఐ నోటీసులు ఇవ్వడం.. రోజంతా ప్రశ్నించడం కలకలం రేపింది. అంటే, అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కాం బయటకి రాగానే.. ఆ స్కాంలో కవిత ఉన్నట్టు బండి సంజయ్ కి ముందే ఎలా తెలిసింది? అంటే, టీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టే.. కేంద్రం-బీజేపీ కనుసన్నల్లోనే సీబీఐ నడుస్తోందా? అనే అనుమానం.

- Advertisement -

కవిత కేసు మాత్రమే కాదు.. లేటెస్ట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎపిసోడ్ కూడా అంతే. అంతా మర్చిపోయిన బెంగళూరు డ్రగ్స్ కేసును బండి సంజయే మళ్లీ తవ్వారు. డ్రగ్స్ కేసును రీఓపెన్ చేయాలని.. రోహిత్ రెడ్డి ప్రమేయాన్ని తేల్చాలంటూ కొన్నిరోజులుగా బండి డిమాండ్ చేస్తున్నారు. ఆయన అన్నట్టుగానే.. తాజాగా బెంగళూరు డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడం ఆసక్తికరం. ఏడాది క్రిందటి కేసులో.. సడెన్ గా బండి సంజయ్ డిమాండ్ చేయగానే ఈడీ అధికారులు పైలెట్ రోహిత్ రెడ్డికి నోటీసులకు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఈడీ.. బండి డైరెక్షన్ లో నడుస్తోందా? మంత్రి హరీష్ రావు సైతం ఇదే అనుమానం వ్యక్తం చేశారు. పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు వస్తాయని నాలుగు రోజులు ముందుగానే బండి సంజయ్ కి ఎలా తెలిసిందని.. ఇవి పక్కా బీజేపీ ప్రతీకార చర్యలేనని మండిపడ్డారు.

మొయినాబాద్ ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీరోల్ పైలెట్ రోహిత్ రెడ్డిదే. ఆ కేసులో ఏకంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ చిక్కుకోవడాన్ని కమలనాథులు తట్టుకోలేకపోతున్నారు. తమకే రివర్స్ అవుతారా? అంటూ పైలెట్ రోహిత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. బహుషా అందుకేనేమో.. బెంగళూరు డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి ఫ్రెష్ గా ఈడీ నోటీసులు ఇవ్వడానికి బీజేపీ నేతల ప్రెజరే కారణమంటున్నారు. తమకు అడ్డుగా ఉన్న వారందరినీ, జాతీయ దర్యాప్తు సంస్థలతో టార్గెట్ చేయడాన్ని టీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అయినా, చేసేదేముంది? తప్పు చేస్తే కేసులు పెట్టరా? అంటూ కమలనాథులు కౌంటర్ ఇస్తున్నారు.

అటు కవిత కేసు కానీ, ఇటు పైలెట్ రోహిత్ రెడ్డి గానీ.. ఆయా కేసుల్లో వారికి శిక్ష పడే అవకాశం తక్కువే అంటున్నా.. అప్పటివరకూ వారిని దర్యాప్తు సంస్థలతో వెంటాడి, వేటాడటమే బీజేపీ ఎత్తుగడ అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News