Hyderabad: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న మంత్రి కొండా సురేఖ కూతురు వ్యవహరం కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై మరోసారి కొండా సురేఖ స్పందించారు. నా కూతురు మాట్లాడిన దానికి నాపై చర్యలు తీసుకోవద్దని అన్నారు. మహిళలు స్వతంత్రంగా బతకాలని రాహుల్ చెబుతున్నారని, నాపై చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలన్నారు. పదేళ్లు తాను సీఎంగా ఉంటానని అంటున్నారని, అది క్రమ శిక్షణా చర్యల కిందకు రావా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు లేవనెత్తారు.
బుధవారం మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూతురు చేసిన వ్యాఖ్యలపై నాపై చర్యలు తీసుకోవడం ఎంతవరకు సబబు అని అన్నారు. తనకంటే ముందు ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని హాట్ కామెంట్స్ చేశారు. పదేళ్లపాటు తాను సీఎంగా ఉంటానని చెబుతున్నారని, ఈ విషయంలో మంత్రులు, నేతలు అసంతృప్తిగా ఉన్నారని మనసులోని మాట బయటపెట్టారు. నన్ను రాజీనామా చేయమని ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదని అన్నారు.
బీసీలకు ఒక న్యాయం.. ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా? పలువురు మంత్రులపై అనేక ఆరోపణలు ఉన్నాయని, వాటికి ఏం సమాధానం చెబుతారు? ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. కూతురు చేసిన వ్యాఖ్యల విషయంలో అధిష్ఠానానికి అన్ని రాతపూర్వకంగా తెలియజేశానని చెప్పుకొచ్చారు. ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానుని చెప్పుకొచ్చారు మంత్రి కొండ సురేఖ. కూతురు వ్యాఖ్యలపై నేను వివరణ ఇచ్చానని, పార్టీలో నాపై చర్యలు తీసుకుంటే రాష్టంలో బీసీలు ఏకమవుతారని వ్యాఖ్యానించినట్టు వెల్లడించారు.
ALSO READ: సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ దొరకలేదన్నారు. నా కూతురు మాట్లాడిన వ్యాఖ్యలపై నాపై చర్యలు తీసుకోవద్దని తెలిపానని, అయినా నాకూతురిపై మాట్లాడకుండా, నా విషయంపై ఎందుకు మాట్లాడుతున్నారని వాపోయారు. పార్టీలో చాలామంది నేతలు ముఖ్యమంత్రిని విమర్శించారని గుర్తు చేశారు. కావాలనే తనను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నట్లుగా చెప్పారు. పార్టీలో చాలా మంది ఉన్నత వర్గానికి చెందిన నేతలు మాట్లాడరని వారిపై క్రమశిక్షణా కమిటీ ఎందుకు స్పందిచలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఢిల్లీలో తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు ఉన్నారు. మరి కొండా సురేఖ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.