BigTV English

Rahul Gandhi: ఏక్ అకేలా రాహుల్‌.. బీజేపీకి టన్నుల్లో భయం!

Rahul Gandhi: ఏక్ అకేలా రాహుల్‌.. బీజేపీకి టన్నుల్లో భయం!
rahul modi

Rahul Gandhi: ఏక్ అకేలా మోదీ పర్.. అంటూ గతంలో రాజ్యసభలో వన్ మ్యాన్ షో చేశారు ప్రధాని మోదీ. ఛాతిపై చరుచుకుంటూ.. విపక్షంపై నిప్పులు చెరిగే ఆ ప్రసంగం.. ఇప్పటికీ సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా వైరల్ అవుతూనే ఉంటుంది. ఒంటరినైన తనపై ప్రతిపక్ష నేతలంతా మూకుమ్మడి దాడి చేస్తున్నారని.. తానుమాత్రం దేశం కోసం పని చేస్తున్నానంటూ పార్లమెంట్‌లో ఓ రేంజ్‌లో స్పీచ్ ఇచ్చారు మోదీ. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే…


ఏక్ అకేలా రాహుల్ పర్.. అంటూ మోదీ స్పీచ్‌ను రాహుల్‌గాంధీకి అన్వయించు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. సోషల్ మీడియాలో రాహుల్‌కు సపోర్ట్‌గా రకరకాల పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అనర్హత వేటు తొలగించగానే.. ఎంపీగా మళ్లీ లోక్‌సభలో రాహుల్ గాంధీ అడుగుపెట్టడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యమైన విషయం.

ఏక్ అకేలా రాహుల్ పర్.. అధికార బీజేపీ ఎంతగా దాడి చేసినా.. ఆయన మాత్రం మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా.. కాంగ్రెస్ మొనగాడిగా నిలిచిన తీరు ఆసక్తికరం. మోదీ ఇంటి పేరు ఉన్నవారంతా దొంగలే అంటూ రాహుల్ చేసిన ఓ రొటీన్ స్టేట్‌మెంట్‌ను పట్టుకుని.. పెద్ద పొలిటికల్ గేమే ఆడింది కమలదళం. కోర్టులో కేసు వేయించడం.. ఆ తీర్పు రాహుల్‌కు వ్యతిరేకంగా వచ్చి, రెండేళ్ల జైలు శిక్ష విధించిన వెంటనే.. ఆయనపై పార్లమెంట్ సభ్యుడిగా వేటు వేయడం.. అంతా జెట్ స్పీడ్‌తో జరిగిపోయింది. గంటల వ్వవధిలోనే అంతటి సంచలన నిర్ణయం తీసుకున్న తీరు తీవ్ర విమర్శల పాలైంది. అరే, అంత తొందరేంటి? జైలు శిక్షపై ఇంకా అప్పీల్‌కే వెళ్లలేదు.. అంతలోనే వేటు వేయాల్సిన అత్యవసరం ఏముంది? అంటూ ప్రజాస్వామ్యవాదులు గొంతెత్తారు. గోవా ఎన్సీపీ ఎంపీ విషయంలోనూ ఇలానే వేటు వేసి చేతులు కాల్చుకున్నా.. గుణపాఠం నేర్వలేదు.


రాహుల్ నుంచి ఎంపీ పదవిని లాగేసుకుంటే.. కాంగ్రెస్ శ్రేణులంతా భయపడిపోతారనుకున్నారేమో. కానీ, అలా జరగలేదు. నేలకు కొట్టిన బంతిలా మరింత ఎగిశారు రాహుల్‌గాంధీ. సమస్యల నుంచి అవకాశాలను అందిపుచ్చుకున్నవారే నిజమైన లీడర్. రాహుల్ అలానే చేశారు. పదవి పోవడంతో తనకు అదనపు సమయం కలిసివచ్చిందని అనుకున్నారు. నేరుగా ప్రజల దగ్గరకే వెళ్తున్నారు. బైక్ ఎక్కుతున్నారు. బైక్ రిపేర్ చేస్తున్నారు. బస్ జర్నీ చేస్తున్నారు. లారీలో ప్రయాణిస్తున్నారు. పొలాల్ల రైతులతో కలిసి వరినాట్లు వేస్తున్నారు. మార్కెట్‌లో కలియ తిరిగుతున్నారు. డౌన్ టు ఎర్త్ మాదిరి.. సామాన్యుల్లో ఒకరిగా.. ప్రజల కష్టసుఖాలు శ్రద్ధగా వింటున్నారు. రాహుల్ ఎంపీ పదవిపై వేటు వేసి.. ఆయన్ను మరింత ఎదిగేలా చేసింది కమలదళమే అంటున్నారు.

ఇప్పుడే కాదు.. మొదటి నుంచి రాహుల్‌గాంధీని వెంటాడుతూనే ఉంది బీజేపీ. ఆయన రాజకీయంగా యాక్టివ్ అయిన తొలినాళ్లలో అమూల్ బేబీ అంటూ చీప్ పాలిటిక్స్ చేసింది. నిండు సభలో ప్రధానిని హగ్ చేసుకుని.. మోదీకే షాక్ ఇచ్చేలా రాటు దేలారు. అమేథీలో ఓడించినా.. వయనాడ్‌లో నెగ్గుకొచ్చారు. ఇక భారత్ జోడో యాత్ర.. కమలనాథులకు మైండ్ బ్లాంక్ చేసిందనే చెప్పాలి. ఆసేతు హిమాచలం కాలి నడకన చుట్టేసి.. విధ్వేష రాజకీయాలను ప్రేమతో దగ్గర చేశారు. దేశాన్ని కాంగ్రెస్‌తో అనుసంధానం చేయడంలో సక్సెస్ అయ్యారు. ఆ జోడో యాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని ఎన్నో కుట్రలు కూడా చేసింది కేంద్రం. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అంటూ చెక్ పెట్టాలని చూసింది. ఇక, ఆ సమయంలో లేని కరోనా ప్రమాదాన్ని ఉన్నట్టుగా చూపించి.. నాలుగు పాజిటివ్ కేసులకే కేంద్ర ఆరోగ్య శాఖ అత్యవసర సమావేశం నిర్వహించి.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిలిపేయాలంటూ లేఖలు రాసి కంగారు పెట్టించింది. బీజేపీ కుతంత్రాలను ఏమాత్రం వెరవకుండా.. వెనకడుగు వేయకుండా.. హిమాలయాలను ముద్దాడే వరకూ భారత్ జోడో యాత్రను జోర్దార్‌గా కొనసాగించారు రాహుల్.

రాహుల్‌కు ప్రజాక్షేత్రంలో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే.. జైలు శిక్షను కారణంగా చూపించి.. ఉన్నపళంగా పార్లమెంట్‌కు దూరం చేసి తాను నెగ్గామనుకున్నారు కమలనాథులు. కానీ, ఓపిగ్గా పోరాడి.. సుప్రీంకోర్టులో గెలిచి.. మళ్లీ అదే లోక్‌సభలో.. ఎంపీగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. నిండు సభలో రాహుల్‌గాంధీని చూసి.. కాషాయ నేతలు తలదించుకున్నారో లేదో కానీ.. ప్రజాస్వామ్యం మాత్రం సగర్వంతో తలెత్తుకుని నిలిచింది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×