Artificial Gold: బంగారం. ప్రపంచంలో అత్యంత విలువైన లోహాలలో ఒకటి. దీని ధర రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం రికార్డు ధర పలుకుతోంది. తులం ధర ఏకంగా రూ. లక్ష దాటింది. ఇంకా పరుగులు తీసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం బంగారాన్ని గనుల నుంచి వెలికి తీసి శుద్ధి చేసి, మార్కెట్లోకి తీసుకొస్తున్నారు.
‘న్యూక్లియర్ ట్రాన్స్ మ్యూటేషన్’ ద్వారా బంగారం తయారీ
చాలా మంది బంగారాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యమేనా? అనే ఆలోచన చేస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగాయి కూడా. బంగారం ల్యాబ్ లో తయారు చేయడం సాధ్యమే అయినప్పటికీ, ఆచరణలో చాలా కష్టం. అంతేకాదు, అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీనిని అణు రసాయన శాస్త్రంలో ‘న్యూక్లియర్ ట్రాన్స్ మ్యూటేషన్’ అనే ప్రక్రియ ద్వారా తయారు చేయవచ్చని పరిశోధకులు నిరూపించారు. ఈ ప్రక్రియలో ఇతర మూలకాల అణువులను(ఉదాహరణకు పాదరసం, లెడ్) న్యూట్రాన్ బాంబార్డ్‌మెంట్, ఇతర అణు ప్రతిచర్యల ద్వారా బంగారం (ఆటమిక్ నంబర్ 79)గా మార్చవచ్చన్నారు.
కృత్రిమ బంగారం తయారీలో కీలక విషయాలు
⦿ అణు సంలీనం (Nuclear Fusion): పాదరసం లాంటి మూలకాలను బంగారంగా మార్చడానికి అణు సంలీనం అనే ప్రక్రియను నిర్వహిస్తారు. ఇది పరమాణు స్థాయిలో ప్రోటాన్లు, న్యూట్రాన్ల సంఖ్యను మార్చడం ద్వారా జరుగుతుంది. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మారథాన్ ఫ్యూజన్ అనే స్టార్టప్ తమ టోకమాక్ ఫ్యూజన్ రియాక్టర్ ద్వారా పాదరసం నుంచి బంగారం తయారు చేయవచ్చని నిరూపించింది. ఒక గిగావాట్ థర్మల్ పవర్ తో ఏడాదికి 2 నుంచి 5 టన్నుల బంగారం ఉత్పత్తి చేయవచ్చని వెల్లడించింది. అణు సంలీనం, విచ్ఛిత్తి ప్రక్రియలకు అధునాతన సౌకర్యాలు, రియాక్టర్లు, శక్తి వనరులు అవసరం, ఇవి సాధారణంగా లభ్యం కావు.
⦿ ఖర్చు, సాధ్యాసాధ్యాలు: వాస్తవానికి కృత్రిమంగా బంగారం తయారు చేయడం అనే ప్రక్రియ అత్యంత ఖరీదైనది. ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. ఈ ప్రక్రియ ద్వారా తయారు చేసిన బంగారం వాణిజ్యపరంగా లాభదాయకం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే బంగారం తయారీకి అయ్యే ఖర్చు దాని విలువ కంటే ఎక్కువ అవుతుందంటున్నారు. మారథాన్ ఫ్యూజన్ సంస్థ ప్రాథమిక స్థాయిలో విజయం సాధించినట్లు తెలిపింది. కానీ, ఈ సాంకేతికత వాణిజ్యపరంగా ఉపయోగపడేందుకు ఇంకా చాలా పరిశోధనలు అవసరమన్నది. ఈ ప్రక్రియ శాస్త్రీయంగా ఆసక్తికరమైనప్పటికీ, ఆర్థికంగా లాభదాయకం కావడానికి ఇంకా అనేక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని తెలిపింది.
⦿ చారిత్రక పరిశోధనలు: గతంలో, రసవాదం(Alchemy) ద్వారా ఇతర లోహాలను బంగారంగా మార్చడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ, అవి శాస్త్రీయంగా విఫలమయ్యాయి. ఆధునిక శాస్త్రం ద్వారా అణు స్థాయిలో ఇది సాధ్యమైనప్పటికీ, ఆచరణీయం కాదనే వాదనలూ ఉన్నాయి. 1941లో, శాస్త్రవేత్తలు పాదరసం నుంచి బంగారాన్ని కృత్రిమంగా సృష్టించారు. కానీ, ఈ ప్రయోగం కేవలం అకడమిక్ పరిశోధన కోసమే జరిపారు. మొత్తంగా కృత్రిమంగా బంగారం తయారు చేయడం శాస్త్రీయంగా సాధ్యమే అయినప్పటికీ, ఇది అత్యంత ఖరీదైన, సంక్లిష్టమైన ప్రక్రియ. ప్రస్తుతం, ఈ సాంకేతికత వాణిజ్యపరంగా లాభదాయకం కాదు. ప్రస్తుత పరిస్థితులలో బంగారం సహజంగా గనుల నుంచి వెలికితీసి శుద్ధి చేయడం ద్వారానే లాభం ఉంటుందంటున్నారు పరిశోధకులు.
Read Also: 25 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదా? ఆ దేశంలో చెట్టుకు కట్టేసి.. ఆ పొడి చల్లేస్తారు, ఎందుకంటే?