AP Politics: వైసీపీలో అభ్యర్థుల ఎంపిక నుంచి సోషల్ మీడియాలో ప్రచారం వరకూ అన్నీ తామై నడిపించిన ఐ ప్యాక్ ను ఆ పార్టీ ప్యాక్ చేసినట్లేనా? పీకే సారథ్యంలోని ఐప్యాక్ టీమ్ వైసీపీని ఒకసారి అధికారంలో నిలబెట్టింది. తర్వాత ప్రశాంత్‌కిషోర్ సైడ్ అవ్వడంతో గత ఎన్నికల్లో అదే ఐప్యాక్ టీమ్‌ను నమ్ముకున్న వైసీపీ పూర్తిగా చతికిల పడింది. మరి ఆ ఆనుభవం నేర్పిన పాఠాలతో జగన్ సొంత యాక్షన్ ప్లాన్ చేసుకుంటున్నారంట. గ్రౌండ్ లెవెల్ లో పార్టీని బలోపేతం చేసుకుని ముందుకు సాగాలని, ఇక ఏ ప్యాక్ లు అవసరం లేదని భావిస్తున్నారంట.. ఆ దిశగా జగన్ తన సైన్యాన్ని సిద్దం చేసుకోవాలని చూస్తున్నారంట. అసలు వైసీపీ అధ్యక్షుడి నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి?
2019లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఐప్యాక్ టీమ్
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో వైసీపీని 2019లో అధికారంలోకి తీసుకు వచ్చింది ఐ ప్యాక్ టీమ్.. ఆ తర్వాత పీకే ఆ సంస్ద నుంచి బయటకు వెళ్లటంతో రిషిరాజ్ సింగ్ సారధ్య భాద్యతలు తీసుకున్నారు.. ప్రశాంత్ కిషోర్ ఉన్నప్పుడు ఐ ప్యాక్ వర్క్ స్టైల్ ఓ రకంగా ఉంటే రిషిరాజ్ సింగ్ చేతికొచ్చాక మరో రకంగా మారిపోయింది.. వై నాట్ 175 అంటూ అనే నివాదంతో వైసీపీని ఎన్నికలకు తీసుకువెళ్లిన ఆ సంస్ద వ్యూహాలు పూర్తిగా విఫలమై.. వైసీపీ గత ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. వైసీపీకి జస్ట్ 11 సీట్లు మాత్రమే రావటానికి ఐ ప్యాక్ అత్యుత్యాహంతో చేసిన క్యాంపెయిన్ లే కారణం అనే అభిప్రాయాలు కూడా వైసీపీ కీలక నేతలు సహా పార్టీ శ్రేణుల నుంచి వినిపించాయి..
పార్టీ క్యాడర్ వ్యవహారశైలిపై ఐప్యాక్ టీమ్ ఆంక్షలు
2019 లో వర్కవుట్ అయిన ఐ-ప్యాక్ వ్యూహం 2024 ఎన్నికలకు వచ్చేసరికి వైసీపీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది.. కార్యకర్తల నుంచి కీలక నేతల వరకూ అంతా తాము చెప్పినట్లే వ్యవహరించాలి.. తమ వ్యూహం ప్రకారమే వెళ్లాలని ఐ ప్యాక్ ఆంక్షలు.. క్షేత్రస్దాయిలో పూర్తిస్దాయి అంచనాలు వేయలేకపోవటం కూడా వైసీపీని దారుణంగా దెబ్బతీశాయనే అంచనాలున్నాయి.. మొత్తానికి అటు ఐప్యాక్ వ్యూహాలు, ఇటు జగన్ సొంతగా ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థ కలిసి ఆయన కొంపముంచాయి. ఎన్నికల ఫలితాల అనంతరం విజయవాడలోని ఐ ప్యాక్ టీమ్ తమ కార్యాలయం ఖాళీ చేసి దుకాణం ఎత్తేసింది. గత జనవరిలో ఐ ప్యాక్ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైనా పార్టీ శ్రేణుల తీవ్ర వ్యతిరేకత రావటంతో ఆ సంస్ధకు నో చెప్పేసింది వైసీపీ అధిష్టానం..
క్యాడర్‌ను యాక్టివేట్ చేసేందుకు జగన్ ప్రయత్నాలు
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిపైగా గడిచిపోయింది. వైసీపీ కార్యకర్తలు, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారి నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్ వరకూ అందర్నీ వరుస కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. అయితే పార్టీ అధ్యక్షుడ జగన్ ఎక్కడ పర్యటనలకు వెళ్లినా భారీగా పార్టీ శ్రేణుల తరలింపుతో హడావుడి చేస్తున్నారు . దీనికి జగన్ గట్టి వ్యూహమే కారణమని భావిస్తున్నారు.. ఫలితాల అనంతరం వెంటనే బౌన్స్ బ్యాక్ అయిన జగన్ మొదటి నెల నుంచే వ్యూహం మార్చారు.. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సమావేశాలు నిర్వహించారు. కేడర్ నుంచి లీడర్ వరకూ యాక్టివ్ చేసేందుకు అన్నీ ప్రయత్నాలు చేశారాయన.
30 అనుబంధ సంఘాలను ఫుల్ యాక్టివ్ చేసే ప్రయత్నం
వైసీపీలో తొలిసారి పీఏసీ పేరుతో జంబో కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కమిటీల నుంచి అనుభంద సంఘాల వరకూ నియామకాలు పూర్తి చేసే పనిలో పడ్డారు.. దాంతో పాటు అనుబంధ విభాగాలపై పూర్తి ఫోకస్ పెట్టారు.. పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్‌పై సీరియస్ గా దృష్టిపెట్టారు.. బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్దాయి వరకూ అన్నీ నియామకాలు పూర్తి చేయనున్నారు.. పార్టీకి సంబందించిన రాష్ట్ర, జిల్లా కమిటీలతో పాటు 30 అనుబంధ సంఘాలను ఫుల్ యాక్టివ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.. గ్రామ, మండల స్దాయి నుంచి అన్నీ కమిటీల్లో నియామకాలు పూర్తయితే 14 లక్షల నుంచి 18 లక్షల మంది జగన్ సైన్యం సిద్దమవుతారని అంచనా వేస్తుంది వైసీపీ.. అనుబంధ విభాగాలు కమిటీల నియామకాలు త్వరితగతిన పూర్తిచేసి పార్టీని ఫుల్ స్వింగ్ లోకి తీసుకు రావాలని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తున్నారు.
Also Read: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా
గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవడానికి సన్నాహాలు
రాష్ట్ర కార్యవర్గం బలంగా ఉంటే బలంగా ప్రజల్లోకి పార్టీ ఇమేజ్ తీసుకెళ్ళవచ్చని అంచనా వేస్తుంది వైసీపీ.. అప్పుడు ఫైనల్‌గా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధుల విజయం సాధిస్తారని లెక్కలు వేస్తుంది.. గ్రౌండ్ లెవెల్ పునాదులు గట్టిగా ఉంటే ఆటోమేటిక్ గా ఫలితాలు కూడా బాగుంటాయని.. ఎన్నికలకు మరో నాలుగేళ్లు సమయం ఉన్నందున గ్రామస్దాయిలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఐ ప్యాక్ అత్యుత్సాహంతో పాటు వాలంటీర్ల వల్ల పార్టీ అధినాయకత్వానికి.. కార్యకర్తలకు గ్యాప్ వచ్చిందని భావిస్తున్న వైసీపీ ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా సొంత సైన్యాన్ని సిద్దం చేస్తుంది.. సొంత పార్టీ కార్యకర్తలు యాక్టివ్ గా ఉంటే పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా గతంలో లాగా ఫుల్ యాక్టివ్ అవుతుంది.. ఎన్నికలు ఎప్పడు వచ్చినా ధీటుగా ఎదుర్కోవచ్చు అని భావిస్తుంది వైసీపీ.. మరి పార్టీ లెక్కలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తాయా.. బయటి వారిని నమ్మకోవటం కంటే సొంత పార్టీ కార్యకర్తలను నమ్ముకోవటం మేలన్న ఆ అభిప్రాయం సరైనదేనా.. జగన్ సైన్యం ఆ పార్టీకి ఎంత వరకూ ప్లస్ అవుతుందనేది చూడాలి..
Story By Rami Reddy, Bigtv