Trump tariff: మన ఆక్వా రంగంపై ట్రంప్ గట్టి దెబ్బే కొట్టేశాడు. మన రొయ్యల్ని మధ్యలోనే రోస్ట్ చేసి పడేస్తున్నాడు. మొదట 25 ఆ తర్వాత 25 సుంకాలతో బాదేశాడు. దీంతో మన ఆక్వా ఇండస్ట్రీ షేక్ అవుతోంది. 24 వేల కోట్ల వ్యాపార నష్టాలను ఎదుర్కొంటోంది. అమెరికన్ ఎకానమీకి పెద్దగా ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతూ.. కొన్ని రంగాలపై టారిఫ్ లు బాదారు ట్రంప్. ఇంతకీ మన రొయ్యలపై పడే ఎఫెక్ట్ ఎంత?
నేల చూపులు చూస్తున్న రొయ్యలు
అవును.. 50 శాతం టారిఫ్ లతో ట్రంప్ కొట్టిన దెబ్బకు మన సీ ఫుడ్ ఇండస్ట్రీ షేక్ అవుతోంది. ముఖ్యంగా రొయ్యలు నేల చూపులు చూస్తున్నాయ్. టారిఫ్ లు పెరగడంతో మనదేశం నుంచి ఆర్డర్లు తగ్గుతున్నాయ్. అసలే ఎగుమతులపైనే ఆధారపడే మన ఆక్వా ఇండస్ట్రీ ఇప్పుడు అమెరికా టారిఫ్ లతో షేక్ అవుతున్నాయి. ఈ రంగంపై ఆధారపడిన చాలా మందిపై ఎఫెక్ట్ చూపిస్తోంది. ఎంతలా అంటే భారత సీ ఫుడ్ ఎక్స్ పోర్ట్ ఇండస్ట్రీ.. 50 శాతం సుంకాలతో ఏకంగా 24 వేల కోట్ల రూపాయల వ్యాపార నష్టాన్ని ఎదుర్కొంటోంది. దీంతో అందరిపైనా ప్రభావం కనిపిస్తోంది.
అమెరికా మార్కెట్ పైనే ఎక్కువ ఆధారం
మన సీ ఫుడ్ ఇండస్ట్రీ అమెరికా మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఈ ఎఫెక్ట్ తగ్గించేందుకు ఈ ఇండస్ట్రీ ప్రభుత్వ సహాయం కోరుతోంది. అదే సమయంలో ఆల్టర్నేట్ గా ఏయే దేశాలకు ఎక్స్ పోర్ట్స్ చేస్తే కొంతలో కొంత నష్టాన్ని తగ్గించుకోవచ్చో ఆలోచన చేస్తున్నారు. ఇది సీఫుడ్ రంగానికి డూమ్స్‌డే లాంటిదిగా అనుకుంటున్నారు. ఆక్వా రైతుల దగ్గర్నుంచి ఎక్స్ పోర్ట్ వరకు మధ్యలో ఉన్న వారంతా ప్రభావితం అవుతారని సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు పవన్ కుమార్ అంటున్నారు. అంతేకాదు ప్రభుత్వం నుంచి సహాయం అవసరమంటున్నారాయన.
ఈక్వెడార్ ఉత్పత్తులపై అమెరికా ఫోకస్
అమెరికాకు సీ ఫుడ్ ఎగుమతుల్లో భారత్ కు పోటీగా ఈక్వెడార్ ఉంది. ఇండియాతో పోలిస్తే ఈక్వెడార్, అమెరికాకు భౌగోళికంగా దగ్గరగా ఉంది. అమెరికా మార్కెట్‌లో కేవలం 10% దిగుమతి సుంకం చెల్లిస్తోంది. ఇండోనేషియా 19%, వియత్నాం 20% చెల్లిస్తూ ఎక్స్ పోర్ట్స్ చేస్తున్నాయి. ఇండియా ఎగుమతి చేసే సముద్ర ఉత్పత్తుల్లో 40% వాటా అమెరికాకే ఉంది. భారత సీఫుడ్ ఇండస్ట్రీ విలువ సుమారు 60 వేల కోట్లు. ఇందులో దాదాపు 40% ఎగుమతులు అమెరికాకు వెళ్తాయి. చెప్పాలంటే భారత్ కు అతిపెద్ద సీఫుడ్ ఎగుమతి మార్కెట్ అమెరికానే. 40 వేల కోట్ల ఆదాయం వస్తుంది. అందుకే ఇంత ఆందోళన.
ఏపీలోని 3 లక్షల మంది ఆక్వా రైతులపై ఎఫెక్ట్
నిజానికి మన సీ ఫుడ్ ఎక్స్ పోర్ట్స్ పై 4.5% యాంటీ-డంపింగ్ డ్యూటీ, 5.8% కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ ఉన్నాయి. సో ఈక్వెడార్, ఇండోనేషియా, వియత్నాంలతో పోలిస్తే భారత్ ఉత్పత్తులు కొనేందుకు అమెరికన్ మార్కెట్లు ఉత్సాహం చూపవు. ఎందుకంటే ఎక్కువ రేటు పెట్టాల్సి వస్తుంది. తక్కువ ఎక్కడి నుంచి వస్తాయో అక్కడే కొంటాయి. దీంతో మన ప్రొడక్ట్స్ కు డిమాండ్ తగ్గుతుంది. సో ఈ పరిణామం ఎటు దారి తీస్తుందంటే.. అదనపు టారిఫ్‌ను ఎగుమతిదారులు భరించలేరు. ఇది ఇండస్ట్రీని నిలిపేస్తుంది. ఈ టారిఫ్‌లు 2 కోట్ల మంది జీవనోపాధిని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఏపీలోని 3 లక్షల మంది ఆక్వా రైతులపై ఎఫెక్ట్ పెరుగుతుంది.
ధరలు తగ్గించాలంటున్న అమెరికన్ కంపెనీలు
టారిఫ్‌ల కారణంగా అమెరికా దిగుమతిదారులు ధరలను తగ్గించమని ఆల్రెడీ ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఎక్స్ పోర్టర్స్ 10శాతం ధర తగ్గింపుతో అందిస్తున్నారు. ఇది లాభాలను చాలా వరకు తగ్గిస్తుంది. అదే సమయంలో రైతులకు చెల్లించే ధరలపైనా ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం భారత్ నుంచి అమెరికాకు సుమారు 1,500 కోట్ల రూపాయల విలువైన సీఫుడ్ కంటైనర్‌లు ఇప్పటికే షిప్పింగ్‌లో ఉన్నాయి. అయితే భారత్‌పై అమెరికా బుధవారం ప్రకటించిన ఈ అదనపు 25 శాతం టారిఫ్‌ను వెంటనే వర్తింపజేయబోమని ట్రంప్ సర్కార్ స్పష్టం చేసింది. ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి వచ్చిన 21 రోజుల తర్వాత ఈ అదనపు 25 శాతాన్ని భారతీయ ఉత్పత్తులపై వర్తింపజేస్తారు. ఇప్పటికే షిప్పుల్లోకి ఎక్కించిన సరుకుపై ఈ అదనపు 25 శాతం సుంకాన్ని విధించబోరు. అలాగే బుధవారం అర్ధరాత్రిలోపు అమెరికా చేరుకునే ఉత్పత్తులపైనా ఈ అదనపు భారం మోపబోరు. ఆగస్ట్ 27 వరకు అదనపు వడ్డింపు ఉండదు. ఇదొక్కటి కొంత ఊరటనిచ్చే విషయం.
టారిఫ్‌ల ఎఫెక్ట్ స్టడీ చేసేందుకు ఏపీ చర్యలు
సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ టారిఫ్‌లను తగ్గించేందుకు అమెరికాతో చర్చలు జరుపుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టారిఫ్‌ల ప్రభావాన్ని స్టడీ చేయడానికి ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. చైనా వంటి ఇతర మార్కెట్‌లకు ఎగుమతులను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. జీరో ఫర్ జీరో టారిఫ్ వ్యూహాలు కూడా తెరపైకి వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి. మన రొయ్యలకు మంచి రోజులు వస్తాయా చూడాలి. సీ ఫుడ్స్ పై టారిఫ్ ల మోతతో అందరికంటే ఎక్కువ ఏపీపై ప్రభావం చాలా ఉంటోంది. ఎందుకంటే మనదేశంలో ఆక్వా ప్రొడక్ట్స్ లో మెజార్టీ వాటా ఆంధ్రప్రదేశ్ దే. ఇప్పటికే ప్రాన్స్ కు రోగాల బెడద తప్పిందనుకుంటే ట్రంప్ రూపంలో మరో గండం వచ్చి పడింది. ఇలాగైతే కోలుకునేదెలా అని ఏపీ ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
ఎకరాకు రూ.4-5 లక్షల వరకు పెట్టుబడి
ఏపీ వ్యాప్తంగా 4.68 లక్షల ఎకరాల్లో రొయ్యల చెరువులున్నాయి. రైతులు ఎకరాకు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టి సాగుచేస్తున్నారు. 450 పైగా రొయ్యల హాచరీలు, 50పైగా ఫీడ్ మిల్లులు, 250 పైగా ప్రాసెసింగ్ ప్లాంట్లు, 6 వేలకు పైగా పడవలు, నౌకల ద్వారా వేలాదిమందికి జీవనోపాధి లభిస్తోంది. ఓవరాల్ గా చూస్తే ఏపీలో రొయ్యల పరిశ్రమ.. ఉపాధికల్పనలో కీ రోల్ పోషిస్తోంది. ట్రంప్ అలా టారిఫ్ లు ప్రకటించారో లేదో.. ఇలా రేట్లు తగ్గిపోతూనే ఉన్నాయి. ఇది రొయ్యల పెంపకం దారుల్లో ఆందోళన పెంచుతోంది.
రొయ్యల సాగు, ఎగుమతుల్లో ఏపీ కీలకం
రొయ్యల సాగు, ఉత్పత్తి, ఎగుమతుల్లో దేశంలో ఏపీ ఫస్ట్ ప్లేస్. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం చాలా కీలకంగా ఉంది. GSDPలో రొయ్యల పరిశ్రమ వాటా 11 శాతం. అయితే ప్రధానంగా ఈ రంగం ఎగుమతులపైనే ఆధారపడుతోంది. 2023-24లో భారత్ నుంచి 4.88 బిలియన్ డాలర్ల విలువైన రొయ్యలు ఎగుమతి అయ్యాయి. మొత్తం ఎగుమతుల్లో ఇది 66 శాతం కంటే అధికం. భారత రొయ్యలకు అతి పెద్ద మార్కెట్ అమెరికానే. అమెరికా తర్వాత చైనా, వియత్నాంలకు 35 శాతం రొయ్యల ఉత్పత్తులు మన దేశం నుంచి వెళ్తున్నాయి. తిరిగి ఈ రెండు దేశాలూ తాము దిగుమతి చేసుకున్న రొయ్యల్లో చాలా భాగం USకే ఎక్స్ పోర్ట్ చేస్తున్నాయి.
నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీ ఏది?
పరిస్థితులు చక్కబడే వరకు.. ట్రంప్ వెనక్కు తగ్గే వరకు ఆగుదామంటే.. రొయ్యలు త్వరగా పాడవుతాయి. సుంకాల కారణంగా కొంతకాలం సాగునీటి వనరుల్లో నిల్వ చేద్దామంటే తగిన కోల్డ్ స్టోరేజ్ వసతులు లేవు. దీంతో ప్రాసెసింగ్ కష్టమై లక్షల మంది ఉపాధిని కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నారు. ట్రంప్ విధించిన టారిఫ్‌లు ఏపీలోని సముద్ర ఉత్పత్తులు, ముఖ్యంగా రొయ్యలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ టారిఫ్‌లు ఆంధ్రప్రదేశ్‌లోని సుమారు 6.5 లక్షల ఆక్వా రైతులు అలాగే 10 లక్షల కుటుంబాల జీవనోపాధిని ప్రభావితం చేస్తోంది. అమెరికాకు ఎగుమతి అయ్యే రొయ్యల్లో 75 శాతం ఆంధ్రా నుంచే వెళ్తున్నాయి. అలాగే ఇండియా సీ ఫుడ్ ఎక్స్ పోర్ట్స్ లో ఏపీ వాటా 33 శాతం అంటే 19 వేల 428 కోట్లుగా ఉంది. అయితే ఇప్పుడిది అధిక టారిఫ్ లతో మారిపోతుంది. అదే సమయంలో ఆక్వా రైతులకు ఇబ్బందిగా మారబోతోంది.
స్టాక్స్ కొనడం ఆపేసిన ఎగుమతి దారులు
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలలో పెద్ద ఎత్తున ఆక్వా కల్చర్ పై వ్యాపారం జరుగుతుంది. రొయ్యలు, క్రాబ్‌లు, చేపలు, ఇతర ఉత్పత్తులు ఉంటాయి. ఈ స్థాయి టారిఫ్ లు భరించడం ఆక్వా రైతుల వల్ల కాదని అంటున్నారు. అధిక సుంకాలతో ఎగుమతిదారులు స్టాక్‌లను కొనడం ఆపేశారంటున్నారు రైతులు. కొత్త టారిఫ్‌లు, యాంటీ-డంపింగ్, కౌంటర్‌వెయిలింగ్ డ్యూటీలతో ఎగుమతిదారులను ఆర్థికంగా దెబ్బతీస్తాయంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ ఆనం వెంకట రమణా రెడ్డి ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. టారిఫ్ ల ఎఫెక్ట్ స్టడీ చేస్తున్నామన్నారు. చైనా, జపాన్ వంటి ఇతర దేశాల మార్కెట్‌లకు ఎగుమతులను పెంచే ప్రయత్నాలు చేస్తామంటున్నారు.
వ్యవసాయ ఉత్పత్తులపైనా ప్రభావం
ఒక్క సీ ఫుడ్స్, రొయ్యలే కాదు.. భారత్ నుంచి అమెరికాకు చాలా వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఎగుమతి అవుతున్నాయి. 2024లో భారత్ అమెరికాకు 5 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇందులో బాస్మతి నాన్-బాస్మతి రైస్, సీ ఫుడ్స్, గోధుమలు, మాంసం, ప్రాసెస్డ్ ఫుడ్, సుగర్, డైరీ ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు, స్పైసెస్ వంటి ఉత్పత్తులు 46 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ టారిఫ్‌లు వ్యవసాయ ఎగుమతులపై కూడా ప్రభావం చూపుతాయి. రేట్లు పెరిగితే భారత బాస్మతి బదులు చౌకైన రైస్ బ్రాండ్‌లకు జనం మారవచ్చు.
Also Read: హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా.. ఆట కట్టించిన ఈగల్ టీం
టారిఫ్‌ల కారణంగా ఎగుమతి ఆర్డర్‌లు తగ్గుతాయి. దీనివల్ల ఎగుమతిదారులు ధరలను తగ్గించవలసి వస్తుంది. లాభాలు తగ్గుతాయి. రైతులకు చెల్లించే ధరలు తగ్గవచ్చు. అమెరికన్ ఇంపోర్టర్స్.. ఈక్వెడార్, వియత్నాం, థాయిలాండ్ వంటి తక్కువ టారిఫ్ రేట్లు ఉన్న దేశాల నుంచి ఎగుమతులను పెంచవచ్చు. దీనివల్ల ఇండియా మార్కెట్ షేర్ దీర్ఘకాలంలో తగ్గవచ్చు. మరోవైపు రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మోడీ అంటున్నారు. ట్రంప్ టారిఫ్ లకు సూటి మెసేజ్ ఇచ్చారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.
Story By Vidya sagar, Bigtv