Rain and Heavy traffic jam in Hyderabad: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో భారీగా కురుస్తుండడంతో లోతుట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి వరద వచ్చి చేరుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్. దీంతో వారు సతమతమవుతున్నారు. వర్షం కురుస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ జామ్ అయ్యిందో అక్కడ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అటు ఇతర విభాగాలకు సంబంధించిన సిబ్బంది కూడా అలర్ట్ గా ఉంటూ రోడ్లపైకి వస్తున్న వరద నీరును ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు.
వర్షం కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు నగర వాసులకు కీలక సూచనలు చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటకు రావొద్దని చెబుతున్నారు. అదేవిధంగా వర్షం కురుస్తున్నందున ట్రాన్స్ ఫార్మార్ల వద్ద, కరెంట్ స్తంభాల వద్ద, విద్యుత్ సరఫరా అయ్యే యంత్రాలు, వస్తువుల వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read: అక్కకు జరిగిన అవమానం అది.. వకీలుగా తమ్ముడు కోర్టుకు ఈడుస్తాడు : ఎంపీ రఘునందన్
మూసాపేట్, నిజాంపేట్, కూకట్ పల్లి, బేగంపేట, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, ఈఎస్ఐ, ట్యాంక్ బండ్, సెక్రటేరియేట్, హిమాయత్ నగర్, బషీర్ బాగ్, అబిడ్స్, నాంపల్లి, కోఠి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో భారీగా కురుస్తోంది. దీంతో వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చేరుతుంది. వరద నీరు కారణంగా కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
పంజాగుట్ట, అమీర్ పేట దారుల్లో అయితే రోడ్లు చెరువులను తలపిస్తూ వరద నీటితో దర్శనమిస్తున్నాయి. మోకాళ్ల లోతు వరకు వరద నీరు వచ్చి చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే, సాధారణంగా ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో కొద్దిగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ప్రస్తుతం రోడ్లపై వరద నీరు వచ్చి చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొన్నది. వాహనాలు కనీసం రెండు అడుగులు ముందుకు కదలాలంటే కనీసం పది నుంచి 15 నిమిషాలకు పైగా సమయం పడుతుంది. ఇటు పాదచారులు కూడా భయాందోళన చెందుతున్నారు. ఎటు చూసినా రోడ్లపై వరద నీరు కనిపిస్తుందని, ఈ క్రమంలో కాలు తీసి వేయాలంటేనే భయంగా ఉందంటున్నారు.
అదేవిధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రజలకు సంబంధిత అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటున్నారు. ఎక్కడైనా వరద నీరు భారీగా ప్రవహిస్తే అక్కడ రాకపోకలు సాగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.