మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ విషయంలో మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్‌రావు మండిపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి డబ్బులు తీసుకున్న వారే మహిళా అని చూడకుండా మంత్రిపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేశారని దుయ్యబట్టారు.
మరోవైపు ట్రోలింగ్‌పై కేవలం ట్వీట్ పెడితే సరిపోదని, మహిళా మంత్రికి క్షమాపణ చెప్పాలని ఆయన మాజీ మంత్రి హరీశ్‌రావును డిమాండ్ చేశారు. జిల్లాకు వచ్చిన మంత్రికి అధికారిక కార్యక్రమంలో సత్కారం చేస్తే ఇలా దారుణంగా పోస్టులు పెడతారా అంటూ నిలదీశారు.
also read : మూసీలో అక్రమ కట్టడాలను గుర్తించాలని కేసీఆర్ ఆదేశించలేదా?: మంత్రి శ్రీధర్ బాబు
కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డితో పాటు లోకల్ ఎంపీగా ఉన్న నేను సన్మానం చేస్తే తప్పేంటన్నారు. వేలాది మంది జనం సమక్షంలో జరిగిన కార్యక్రమాన్ని బూతద్దంలో చూపించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఇలాంటి విమర్శలు చేసే వారిని చూస్తే బాధనిపిస్తోందన్నారు. ట్రోలింగ్ చేసిన వారి వివరాలు సేకరించి పోలీసులకు కంప్లైంట్ చేశానని వివరించారు.
కొండా సురేఖను ఉద్దేశిస్తూ అక్కకు జరిగిన అవమానానికి ఒక తమ్ముడిగా తాను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఎంపీ రఘునందన్ అన్నారు. అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తానని రఘునందన్‌రావు అల్టిమేటం ఇచ్చారు. కేటీఆర్, హరీశ్‌రావు దీనిపై స్పందించాలని, ఈ మేరకు సోషల్ మీడియాను నియంత్రించి మంత్రికి క్షమాపణ చెప్పాలన్నారు.