హైదరాబాద్, స్వేచ్ఛ: మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ దూకుడుగా వెళ్తోంది. రెడ్ మార్క్ వేసిన ఇళ్ల కూల్చివేతను ప్రారంభించింది. చాదర్‌ఘాట్, మూసానగర్, శంకర్ నగర్‌లో కూల్చివేతలను స్టార్ట్ చేశారు అధికారులు. ఇరుకు రోడ్లు కావడంతో కొన్నిచోట్లకు బుల్డోజర్లు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూలీలతో ఇళ్లను నేలమట్టం చేయిస్తున్నారు అధికారులు. మంగళవారం ఉదయమే ఈ ప్రక్రియ మొదలైంది. కూల్చివేస్తున్న ఇళ్లన్నీ స్వచ్ఛందంగా ఖాళీ చేసినవాళ్లవే.
Also Read: మూసీలో అక్రమ కట్టడాలను గుర్తించాలని కేసీఆర్ ఆదేశించలేదా?: మంత్రి శ్రీధర్ బాబు
కొనసాగుతున్న తరలింపు
ఓవైపు కూలచివేతలను ప్రారంభించిన అధికారులు, ఇంకోవైపు నిర్వాసితుల తరలింపు కూడా చేస్తున్నారు. చంచల్‌గూడ డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయానికి కొందరిని తరలించగా, మరికొందరిని తీసుకెళ్లేందుకు, సామగ్రిని తరలించేందుకు వాహనాలను అందుబాటులో ఉంచారు. స్వచ్ఛందంగా ముందుకొస్తున్న వారిని వెంటనే తరలిస్తున్నారు. ఇళ్ల పట్టాలు అందజేస్తున్నారు. ఇంకోవైపు, మిగిలినవారితో చర్చలు జరుపుతున్నారు.
హైడ్రాకు సంబంధం లేదు
మూసీ ప్రాజెక్ట్‌తో హైడ్రాకు సంబంధం లేదు. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతలు రెవెన్యూ, మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారుల నేతృత్వంలో జరుగుతున్నాయి. మూసీ సుందరీకరణ పేరుతో 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని ప్లాన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇళ్లకు మార్కింగ్ చేసి వాటిలో ఉన్న వారిని తరలిస్తున్నారు. మొత్తం 40 వేల ఆక్రమణలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఇంకోవైపు, కొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు.
Also Read: పెట్రోల్ బంకులను కూడా హైడ్రా కూల్చివేయాలి: మైనంపల్లి