Red Alert: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్, కామారెడ్డి జిల్లాలు విలవిలలాడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు ప్రజలను నానా ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులపైకి భారీ వరద నీరు వచ్చి చేరడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
మరో రెండు రోజుల పాటు సెలవులు
ఇవాళ కూడా కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఉదయం నుంచి వర్షం పడుతోంది. సిద్దిపేటలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. కోమటిచెరువు నాలా ఉప్పొంగడంతో సిద్దిపేట ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం వర్షం పడుతోంది. ఈ క్రమంలోనే కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న అత్యంత భారీ వర్షాల మూలంగా మరో రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ALSO READ: Rain update: అత్యంత భారీ వర్షాలు.. ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్.. అప్రమత్తంగా ఉండండి..!
కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు…
ఈ రోజు, రేపు కూడా కామారెడ్డి, మెదక్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరి కాసేపట్లో జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.. 62 నుంచి 87 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. లోతట్టు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. భారీ వర్షాలకు బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
ALSO READ: PGCIL Notification: పీజీసీఐఎల్‌లో 1543 ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు..!
వరదల్లో చిక్కుకున్న ఆ గ్రామం..
రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లింగంపల్లి వద్ద కామారెడ్డి – ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఉన్న పాముల వాగు వంతెన నీటి ప్రవాహనికి వరదల్లో కొట్టుకుపోయింది. ఇక్కడ కోమట్ పల్లి గ్రామానికి మూడు వైపులా చెరువులు ఉండడంతో.. వరద నీరంతా గ్రామంలో వచ్చి చేరింది. దీంతో కోమట్ పల్లి గ్రామం వరదల్లో చిక్కుకుపోయింది. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గ్రామ ప్రజలు అధికారులను, ప్రభుత్వానికి కోరుతున్నారు.
అదే విధంగా సజ్జన్పల్లి- శట్పల్లి, సంగారెడ్డి గ్రామాల మధ్య కల్వర్టు వద్ద రహదారి పూర్తిగా కొట్టుకుపోవడంతో స్థానిక అధికారులు మట్టి బస్తాలతో మరమ్మతు పనులు చేయించారు. మండలంలోని జల్దిపల్లి చెరువు, కన్నాపూర్ చెరువులకు గండ్లు పడి వందల ఎకరాల్లో వేసిన వరినాట్లు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. లింగంపేట మండల కేంద్రం నుంచి కామారెడ్డి, ఎల్లారెడ్డి, మెదక్, నాగిరెడ్డిపేట తదితర పట్టణాలకు రాకపోకలు నిలిచిపోయాయి.