Revanth Reddy: ఆదివారం. రెండు హైలైట్స్. ఫిఫా వాల్డ్ కప్ లో అర్జెంటీనా సంచలన విజయం. మెస్సీ మరోసారి మేజిక్ చేశాడు. కళ్లు చెదిరే గోల్స్ తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఫ్రాన్స్ సైతం హోరాహోరీగా పోరాడింది. క్లైమాక్స్ వరకూ రెండు జట్లూ సమానంగా నిలిచినా.. మెరుపు గోల్ తో బంగారు బంతి అర్జెంటీనా ఖాతాలో పడింది. యావత్ ప్రపంచం మెస్సీకి జై కొట్టింది.
ఆదివారం. తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు. పార్టీ మీటింగ్ కు తాము రామంటూ.. కొందరు సీనియర్లు ముందే రెబెల్ జెండా ఎగరేశారు. కమిటీల్లో టీడీపీ నుంచి వచ్చిన వారికే ఎక్కువ పదవులు వచ్చాయంటూ బంతిని రేవంత్ రెడ్డి పోస్ట్ లోకి కొట్టేశారు. ఆ స్థాయిలో సీనియర్ల నుంచి అటాక్ ను ఊహించని రేవంత్.. వెంటనే బంతిని పాస్ చేయడం స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అనిల్ తో ప్రెస్ మీట్ పెట్టించి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముసుగు వీరుడంటూ, అంతా ఆయనే చేస్తున్నారంటూ కార్నర్ చేయించారు.
అంతకుముందు మల్లు రవి సైతం మీడియా ముందుకు వచ్చి.. టీడీపీ నుంచి వచ్చిన ఎంత మందికి కాంగ్రెస్ కమిటీల్లో పదవులు వచ్చాయో లెక్కేసి చెప్పారు. జస్ట్ 12 మంది టీడీపీ వలస వాదులకు మాత్రమే కాంగ్రెస్ కమిటీల్లో పదవులు దక్కాయనే మెసేజ్ ను బలంగా ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇలా మల్లు రవి, అనిల్ ల ఎదురుదాడితో ఈసారి బంతి మళ్లీ సీనియర్ల కోర్టులోకి వచ్చి పడింది.
అక్కడితో ఆగిపోలేదు రేవంత్ రెడ్డి మూవ్. ఈసారి పెనాల్టీ కార్నర్ గోల్ కొట్టేశారు. ఏ విషయంలోనైతే సీనియర్లు తిరుగుబాటు చేశారో.. ఆ మేటర్ ను చాలా ఈజీగా సెట్ చేసేశారు. కాంగ్రెస్ కమిటీల్లో పదవులు దక్కిన 12 మంది టీడీపీ వలస నేతలతో రాజీనామా ప్రకటన చేయించి.. ఫ్రీ కిక్ ను గోల్ గా మార్చేశారు. సీతక్క, వేంనరేందర్ రెడ్డి, విజయరామారావు, దొమ్మాటి సాంబయ్య, పటేల్ రమేశ్ రెడ్డి.. తదితరులు తమ పదవులకు రాజీనామా చేయడంతో.. సీనియర్లు షాక్. ఈ మూవ్ ను వాళ్లు ఎక్స్ పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. సీనియర్స్ ఏ పాయింట్ మీదైతే ఇష్యూను రైజ్ చేశారో.. ఇప్పుడు ఆ ఇష్యూనే లేకుండా చేయడంలో రేవంత్ సక్సెస్ అయ్యారని అంటున్నారు.
అక్కడితో ఆగలేదు రేవంత్ రెడ్డి. జనవరి చివరి వారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నట్టు ప్రకటించి.. బాల్ ను సేఫ్ గా గోల్ పోస్టుకు చేర్చారు. మెస్సీలా మెరుపు నిర్ణయాలు తీసుకుని.. చురుగ్గా కదలి.. తన జట్టును గెలిపించారని.. టి.కాంగ్ ఎపిసోడ్ ను ఫుట్ బాల్ వాల్డ్ కప్ తో పోలుస్తున్నారు. అయితే, సీనియర్లు ఇంకా ఓటమిని ఒప్పుకోకపోవడం.. ఎదురుదాడిని కంటిన్యూ చేస్తుండటంతో.. ఆట ఇంకా మిగిలే ఉంది.