High Court: వీధి కుక్కల సంరక్షణ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని.. ఈ విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ హైకోర్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులను ఆదేశించింది. వీధి కుక్కల సమస్యపై ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. ఆస్రా (ASRA) అనే సంస్థ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఆస్రా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌లో వీధి కుక్కల జనాభా నియంత్రణ, వాటి సంరక్షణకు సంబంధించి ప్రభుత్వం, GHMC అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని.. ఇది ప్రజలకు, జంతువులకు కూడా ఇబ్బంది కలిగిస్తుందని పేర్కొంది. వీధి కుక్కల విషయంలో కేంద్ర జంతు సంక్షేమ బోర్డు, సుప్రీంకోర్టు విధించిన నియమ నిబంధనలను, ముఖ్యంగా జంతు జనన నియంత్రణ (Animal Birth Control – ABC) కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయడంలో GHMC వైఫల్యం చెందిందని సంస్థ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.
దీనిపై స్పందించిన హైకోర్టు, కేవలం కుక్కలను పట్టుకుని తరలించడం లేదా చంపడం వంటి చర్యలకు బదులుగా.. సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా శాస్త్రీయ పద్ధతిలో కుక్కలకు జనన నియంత్రణ శస్త్రచికిత్సలు (ABC) చేసి, రేబిస్ టీకాలు (Anti-Rabies Vaccination – ARV) వేయించే కార్యక్రమాన్ని GHMC యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో తీసుకున్న చర్యలు, పురోగతిపై సమగ్ర నివేదికను త్వరలో కోర్టుకు సమర్పించాలని GHMC, ఇతర సంబంధిత ప్రభుత్వ విభాగాలను ఆదేశిస్తూ కేసు విచారణను వాయిదా వేసింది. వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో ప్రభుత్వ యంత్రాంగం ఇకనైనా చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు నొక్కి చెప్పింది.
ALSO READ: UP News: ఇది మామూలు షాక్ కాదు భయ్యో.. అత్తగారింట్లో అడుగుపెట్టిన 20 మినిట్స్‌లోనే..?