Corporation Appointments: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన నామినేటెడ్ పదవులను దక్కించుకునేందుకు చాలా మంది నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే పదవులు పొందిన నేతలు రెన్యువల్ కోసం ప్రయత్నిస్తుండగా.. కొత్త నేతలు “ఈ ఒక్కసారికి మాకు అవకాశం ఇవ్వండి. పార్టీ కోసం కష్టపడ్డాం” అంటూ పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు. అధిష్టానం వద్ద, గాంధీభవన్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పదవుల గురించిన చర్చలే నడుస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ పదవుల కోసం ఇప్పటివరకు సుమారు 100కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో పార్టీ విజయం కోసం క్షేత్రస్థాయిలో చెమటోడ్చిన నాయకులతో పాటు, ఇటీవల పార్టీలో చేరిన కొందరు ముఖ్యులు కూడా ఈ రేసులో ముందంజలో ఉన్నారు. దీంతో ఏ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
పదవుల భర్తీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.. ఈ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ముఖ్య నేత మీనాక్షి నటరాజన్‌ల ఆధ్వర్యంలో ఒక హై లెవల్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, తుది జాబితాను ఖరారు చేయనున్నారు. పార్టీ పట్ల నిబద్ధత, సామాజికసమీకరణాలు, క్షేత్రస్థాయిలో ఉన్న పట్టును ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
Also read: షాబాద్‌లో ఆరుగురు హత్యలు.. వెలుగులోకి కొత్త విషయాలు, పదునైన కత్తితో- రెండు గంటల్లో
అధిష్టానం ఈసారి సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ జెండా మోస్తూ, కష్టకాలంలో పార్టీని వీడని పాత నేతలకు తగిన ప్రాధాన్యత ఇస్తూనే.. ఎన్నికల సమయంలో పార్టీ మైలేజ్ పెంచిన కొత్త నేతలకు కూడా అవకాశాలు కల్పించేలా సమతుల్యతను పాటిస్తున్నారు. పాత, కొత్త కలయికతో రూపొందుతున్న ఈ ‘ఫైనల్ లిస్ట్’ దాదాపు సిద్ధమైందని, ఈ నెల 15న జరిగే హైలెవల్ మీటింగ్ తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కష్టకాలంలో పార్టీతోనే ఉన్న పాత కాంగ్రెస్ నాయకులకు పెద్దపీట వేయనున్నారు.దీనితో పాటు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తూ, సామాజిక సమీకరణాల్లో బలం ఉన్న కొత్త ముఖాలకు అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.మరో వైపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లాలకు, సామాజిక వర్గాలకు సమన్యాయం చేయాలని సీనియర్ నాయకులు ప్రయత్నిస్తున్నారు.ఇక కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరడంతో, ఆశావహుల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆ ‘లక్కీ లీడర్స్’ ఎవరనేది ఈ నెల 15 తర్వాత తేలనుంది.
Also read: నేను చనిపోయి ఐదేళ్లయింది.. కానీ ఇంకా బ్రతికే ఉన్నాను! ఒక అంతుచిక్కని మైండ్-బెండింగ్ మిస్టరీ