HYDRAA Demolitions: హైదరాబాద్‌లో హైడ్రా పేరు చెబితేనే అక్రమ నిర్మాణదారులు వణికిపోతున్న తరుణంలో, తాజాగా ఓ బస్తీ ప్రజల ఆగ్రహం చూసి అధికారులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. MS, BS మక్తా కాలనీల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టబోతోందనే వార్తలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. తమ సొంతిళ్లను ఎక్కడ కూల్చేస్తారోనన్న భయంతో బస్తీవాసులంతా ఒక్కతాటిపైకి వచ్చి తెగించి పోరాడారు. ఉదయం పూట వారు చేపట్టిన ఉధృత నిరసన సెగలు, సాయంత్రానికల్లా ఉన్నతాధికారులు దిగివచ్చేలా చేశాయి.
రోడ్డెక్కిన బస్తీవాసులు..
తమ ఇళ్లకు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో మక్తా కాలనీ నివాసితులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చారు. మహిళలు, వృద్ధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘హైడ్రాను రద్దు చేయాలి’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తమ బస్తీని హైడ్రా నుంచి కాపాడుకునేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. తరతరాలుగా నివసిస్తున్న ఇళ్లను కూల్చివేస్తే తాము రోడ్డున పడతామని, ప్రాణాలైనా ఇస్తాం కానీ ఇళ్లను వదులుకోబోమని తెగేసి చెప్పారు. ఈ ఆందోళనలతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కూల్చివేతలు లేవు.. భయపడకండి: రంగనాథ్ భరోసా
బస్తీవాసుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెంటనే స్పందించారు. సాయంత్రానికి ఆయన స్వయంగా రంగంలోకి దిగి స్థానికులకు పెద్ద ఊరటనిచ్చారు. మక్తా కాలనీలో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు. “మీ ఇళ్లను హైడ్రా కూల్చదు.. ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదు” అని బస్తీవాసులకు గట్టి భరోసానిచ్చారు. దీంతో ఉదయం నుంచి టెన్షన్‌తో ఉన్న స్థానికులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ఆ నోటీసులతో హైడ్రాకు సంబంధం లేదు!
ప్రస్తుతం జరుగుతున్నది రోడ్డు విస్తరణ పనులని, దానికి హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. రోడ్డు విస్తరణ కోసం R&B శాఖ ఎవరికైతే నోటీసులు ఇచ్చిందో, వారికి నిబంధనల ప్రకారం 4 రెట్ల పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, హైడ్రా పేరు చెప్పి ఎవరైనా మిమ్మల్ని బెదిరించినా, లేదా తప్పుడు నోటీసులు ఇచ్చి భయపెట్టాలని చూసినా వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితుల పక్షాన ప్రభుత్వం ఉంటుందని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు.
Also Read: సుప్రీం కోర్ట్ సీజేఐపై పేపర్లు విసిరి, దుర్భషలాడుతూ.. పిటీషనర్ హంగామా, వీడియో వైరల్