Education Reforms: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో పాఠశాల విద్యా సంస్కరణలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో విద్యాశాఖ ఉన్నతాధికారుల బృందం వియత్నాం దేశంలో వారం రోజుల పాటు పర్యటించింది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ బీ వెంకట నరసమ్మ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈనెల 11న వియత్నాం పర్యటనకు వెళ్లింది. ఈనెల 17 వరకు వియత్నాంలో విద్యా విషయక మార్పిడి కార్యక్రమంలో పాల్గొగనుంది. ఈ పర్యటనలో భాగంగా బృందం వియత్నాం ఎడ్యుకేషన్ స్ట్రాటజీ అండ్ పాలసీ ఇన్స్టిట్యూట్ అధికారులతో సమావేశమై, అక్కడి పాఠశాలలు, విద్యా సంస్థలను సందర్శించింది. వియత్నాం విద్యా విధానం, పాఠ్యప్రణాళిక (కరికులం), బోధనా పద్ధతులు, పరీక్షల సంస్కరణలు, విద్యార్థుల అభ్యసన నైపుణ్యాల పెంపునకు వారు తీసుకుంటున్న చర్యలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
వియత్నాంలో ప్రాథమిక విద్యలో 99 శాతం ప్రభుత్వ పాఠశాలలే కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ బృందం గుర్తించింది. ప్రైవేటు పాఠశాలల వాటా ప్రాథమిక స్థాయిలో కేవలం 1 శాతం, ఉన్నత విద్యా స్థాయిలో 6 శాతం మాత్రమే ఉందని తెలిపింది. అక్కడ ప్రాథమిక విద్య(1-5 తరగతులు), లోయర్ సెకండరీ(6-9 తరగతులు), అప్పర్ సెకండరీ(10-12 తరగతులు) గా విద్యా వ్యవస్థను విభజించినట్లు ఈ బృందం సభ్యులు తెలిపారు.
ఇందులో 1 నుంచి 9 వ తరగతి వరకు నిర్బంధ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారని వారు తెలిపారు. వియత్నాం క్లాస్రూమ్లలో డిజిటల్ పరికరాల వినియోగం ఎక్కువగా ఉందని, ఉపాధ్యాయులకు ల్యాప్టాప్లు అందిస్తూ, బోధనలో కృత్రిమ మేధ(ఏఐ)ను అనుసంధానించేలా వారిని సన్నద్ధం చేస్తున్నారని తెలిపారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో స్నేహపూర్వకత, నిజాయితీ, ఆత్మవిశ్వాసం, బాధ్యత, సృజనాత్మకత అనే ఐదు ముఖ్యమైన విలువలను పెంపొందించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించారు.
1వ తరగతి నుంచే శారీరక విద్య, సంగీతం, చిత్రలేఖనాన్ని పాఠ్యప్రణాళికలో చేర్చారని ఈ బృందం వెల్లడించింది. ముఖ్యంగా విద్యార్థులకు ప్రాణరక్షణ నైపుణ్యంగా ఈత(స్విమ్మింగ్) నేర్పించడంపై పాఠశాలల్లో స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని సభ్యులు తెలిపారు. వియత్నామీస్ భాషలోనే ప్రధాన బోధన సాగుతుండగా, మారుమూల ప్రాంతాల్లోని గిరిజన పిల్లల కోసం మాతృభాషలో బోధనకు అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు.
ఇక 3వ తరగతి నుంచే ఆంగ్లాన్ని ఒక విదేశీ భాషగా పరిచయం చేస్తున్నారని వెల్లడించారు. విద్యార్థి కేంద్రక బోధన, గ్రూప్ డిస్కషన్లు, డిజిటల్ విద్య పరంగా వియత్నాంలో సాధించిన విజయాలను తెలంగాణ విద్యాశాఖ బృందం ప్రశంసించింది. ఈ పర్యటన ద్వారా పొందిన అంతరదృష్టిని, ఉత్తమ విధానాలను తెలంగాణలోని స్థానిక అవసరాలు, మౌలిక వసతులకు అనుగుణంగా ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంస్కరణల కోసం పరిశీలిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
Also read: కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్లో పడిపోయిన నీటి నిల్వలు!